జమ్మూ కశ్మీర్‌లో పుస్తకాల నిషేధంపై కర్నూలు కవుల నిరసన
తక్షణమే కశ్మీర్ ప్రభుత్వం 25 పుస్తకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసారు.;
జమ్మూ కశ్మీర్‌లో పుస్తకాల నిషేధంపై కర్నూలు జిల్లా కవులందరూ సంయుక్తంగా గళమెత్తారు. కర్నూలు నగరంలోని సీ క్యాంప్ సెంటర్‌లో నిరసన ప్లేకార్డులు పట్టుకొని ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, డిటీఎఫ్ రాష్ట్ర నాయకులు రత్నం యోసేపులు మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రసిద్ధ రచయితలు రచించిన 25 పుస్తకాలను నిషేధిస్తూ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులను విడుదల చేశారనీ, వాటిల్లో సుప్రసిద్ధ రచయితలు అరుంధతి రాయ్, ఏజీ నూరాని, సుమంత్ర బోస్, సీమా కాజీ, డేవిడ్ దేవదాస్ వంటివారు రచించిన పాపులర్ గ్రంథాలు ఉన్నాయనీ, అవన్నీ కశ్మీర్ చరిత్రను, కశ్మీర్‌లో జరుగుతున్న వాస్తవ విషయాలను తెలియజేసే గ్రంథాలే అని, వాటిని నిషేధించడం ద్వారా కేంద్ర బిజెపి ప్రభుత్వం మేధావులపై, మేధావుల ఆలోచనలపై నిషేధం విధించినట్టు అయ్యిందన్నారు.
ఈ చర్య రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమన్నారు. కశ్మీర్ విడుదల చేసిన ఈ నిషేధపు చర్య వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని కశ్మీర్‌లో జరుగుతున్న వాస్తవాలను ఈ దేశ ప్రజలకు, బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించిందని కవులు భావిస్తున్నారి పేర్కొన్నారు. తక్షణమే కశ్మీర్ ప్రభుత్వం 25 పుస్తకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. ఈ నిరసన ప్రదర్శనలో సాహితీ స్రవంతి రాష్ట్రనాయకులు కెంగార మోహన్, మారుతీ పౌరోహితం, నాగేశ్వరాచారి, సయ్యద్ జహీర్ అహ్మద్, డిగ్రీ కళాశాల లెక్చరర్ రవి ప్రకాష్, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ నాయకులు, విజయులు, తనగల తదితరులు పాల్గొన్నారు.