బెల్టు షాపులు తొలగించి..నీరా కేఫ్‌లు పెట్టాలి
ఆంధ్రప్రదేశ్‌లో గోవా, యానాం అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారని కల్లుగీత కార్మికులు ఆరోపిస్తున్నారు.;
ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులు తొలగించి.. నీరా కేఫ్‌లు పెట్టాలని, బెల్టుషాపులకు బదులుగా నీరా కేఫ్‌లు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేసేందుకు కల్లుగీత కార్మికులు రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. కల్లుగీత కార్మికుల సంఘం విజయవాడలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ.. చెట్టు మీద నుంచి పడిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియాని సీఎం చంద్రబాబు రద్దు చేశారని.. ఇంత కంటే దుర్మార్గం మరొకటి ఉండదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్లుగీత కార్మికుల సమస్యలపైన, వారికి ఇచ్చిన హామీలపైన ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదని, పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గోవా, యానం అక్రమ మద్యంను అమ్ముతున్నారని ఆరోపించారు. ఏపీలో 3396 వైన్ షాపులు ఉంటే 75వేల బెల్టుషాపులను పెట్టించిందని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అంతేకాకుండా స్పిరిట్‌తో తయారు చేసిన కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మద్యాన్ని వరదలై పారిస్తూ.. ముంచెత్తుతున్నారని విమర్శలు గుప్పించారు.