కర్నూలు ప్రమాదం..ఆ బస్సుపై ఎన్ని చలానాలు ఉన్నాయంటే

9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించడం, అతివేగం, డేంజరస్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు కూడా ఆ బస్సుపై ఉన్నాయి.

Update: 2025-10-24 07:06 GMT

కర్నూలు జిల్లా శివారు చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఒక బైక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దారుణ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమై మృతి చెందారు. ప్రమాదానికి గురైన బస్సు రిజిస్ట్రేషన్ నంబరు DD01 N9490 కాగా, ఇది కావేరి ట్రావెల్స్ పేరిట 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్టర్ అయినట్టు ఏపీ రవాణా శాఖ వెల్లడించింది.

ఈ బస్సుపై తెలంగాణలో 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు మొత్తం 16 ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. వీటిలో 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించడం, అతివేగం, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ చలాన్లకు సంబంధించి రూ.23,120 జరిమానా పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ బస్సు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్, 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, 2026 ఏప్రిల్ 20 వరకు ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్టు రవాణా శాఖ తెలిపింది. బస్సు పూర్తి ఫిట్‌గా ఉందని, బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే మంటలు వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్టు, దర్యాప్తు నివేదిక ఆధారంగా భవిష్యత్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News