ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గుత్తాధిపత్యం వహించడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-12-08 14:16 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులపై ఆయన మాట్లాడారు. ఇండిగో సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించడం లేదని, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రానిదే బాధ్యత:
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని, కేంద్రం ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఇండిగో వైఫల్యం:
ఇండిగో విమానయాన సంస్థ  నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విధించిన ప్రమాణాలను పాటించడానికి సమయం ఇచ్చినా వాటిని పాటించడంలో ఇండిగో సంస్థ విఫలమైందని అన్నారు. అంతేకాకుండా గుత్తాధిపత్యం కూడా ఒక కారణం అన్నారు.  దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం (monopoly) వహిస్తోందని, అందు వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి, ముఖ్యంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సొంత పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
Tags:    

Similar News