Breaking | నెల్లూరు చాకు రౌడీలకు పోలీసుల కోటింగ్

నగరంలో మరోసారి రోడ్డుపై ప్రదర్శన

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-08 18:16 GMT

నెల్లూరు నగరంలో రౌడీలకు మరోసారి ప్రత్యేక కోటింగ్ ఇచ్చారు. ప్రయివేటు బస్సు డ్రైవర్, కండక్టర్ పై ఆదివారం మధ్యాహ్నం యువకులు బ్లేడుతో దాడి చేసిన సంఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. ఆ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి రోడ్డుపై నడిపించడం ఆసక్తికరంగా మారింది.


నెల్లూరు నగరంలో ఆదివారం ఓ ప్రైవేటు టౌన్ బస్సు నక్కలోళ్ల సెంటర్, బోసు బొమ్మ మధ్య బస్సు ప్రయాణిస్తుండగా, ట్రంక్ రోడ్డులో పల్సర్ బైక్ ను యువకులు బస్సుకు అడ్డంగా నిలిపారు. పక్కకు తీయమని డ్రయివర్ చెప్పగానే, బైక్ ఉన్న యువకుడు, ఇంకొందరిని పోగేశాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో బస్సు డ్రైవర్, కండక్టర్ పై దాడి చేశారు. గొంతు తోపాటు ముఖంపై ఇస్టానుసారంగా కొట్టడంతో రక్తస్రావం అవుతున్న వారిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు సిబ్బందిపై దాడి చేసిన అనంతరం ఐదుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయాని తెలిసింది. యువకుల దాడిలో గాయపడిన బస్సు డ్రైవర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన మన్సూర్, కండక్టర్ ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలీంగా గుర్తించారు.
రౌడీలపై ఉక్కుపాదం..

నెల్లూరు నగరంలో ప్రయివేటు బస్సు సిబ్బందిపై దాడి చేసిన వారిలో నెల్లూరు నగరానికి చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు 24 గంటలు తిరగముందే గుర్తించారు. వారిలో సంతపేటకు చెందిన ఉప్పు మదన్ అలియాస్ భాబి, ఉప్పు శ్రీకాంత్, గండవరపు అజయ్ తేజ, యాకసిరి నితిన్ , నక్క తేజగా గుర్తించారు. వారికి పోలీసులు తమ శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
నెల్లూరు నగరంలో రౌడీయిజం చేస్తే క్షమించేది లేదని పోలీసులు చెప్పకనే చెప్పారు. ఆ ఐదుగురిని సోమవారం రాత్రి నగరంలోని గాంధీ బొమ్మ వద్దకు తీసుకుని వచ్చారు అందరూ చూస్తుండగానే ఆ ఐదుగురిని కూరగాయల మార్కెట్ మీదుగా నగరంలో ప్రదర్శన చేయించారు. మళ్లీ దాడులకు పాల్పడే వారేవరైనా సరే. ఉపేక్షించేది లేదని మరోసారి పోలీసులు ఘాటు హెచ్చరికలు జారీ చేసినట్లు కనిపించింది.
Tags:    

Similar News