ఏపీకి కుంకీ ఏనుగులు
రంజనీ, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర కుంకీ ఏనుగులను ఏపీకి కర్ణాటక అందజేసింది.;
కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కుంకీ ఏనుగులను అప్పగించింది. బెంగుళూరులోని విధానసౌధలో బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రంజనీ, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర అనే కుంకీ ఏనుగులను అప్పగించారు. ఆ మేరకు కుకీ ఏనుగుల అప్పగింత పత్రాలతో పాటు వాటి పోషణ, వాటి సంరక్షణకు సంబంధించిన పత్రాలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు.
ఈ సంర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అందజేసినందుకు కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సాయం కోరినా దానిపై తక్షణమే స్పందించి చేసేందుకు ముందుకు రావడంతో సంతోషకరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య ఇప్పటి వరకు తొమ్మిది కీలక ఒప్పందాలు జరిగాయని, స్నేహపూరిత వాతావరణంలో ఇరు రాష్ట్రాలు, ఇరు ప్రభుత్వాల మధ్య సహాయ సహకారాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. కర్ణాటక నుంచి ఏపీకి తీసుకెళ్తున్న కుంకీ ఏనుగులకు ఏపీలో ప్రత్యేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు.