సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా

అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు.

Update: 2024-10-10 08:48 GMT

అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. కేటీఆర్ తరపున లాయర్ ఉమా మహేశ్వరరావు నాంపల్లి కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. సినీ సెలబ్రిటీలు సమంత-అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవటానికి కేటీఆరే కారణమని కొద్దిరోజుల క్రితం కొండా ఆరోపించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తనదగ్గరకు పంపాలని నాగార్జునను కేటీఆర్ అడిగినట్లు సురేఖ చెప్పారు. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి చేసినట్లు, అందుకు సమంత ససేమిరా అని చెప్పినట్లు మంత్రి చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళమని నాగార్జున, చైతన్యలు చెప్పటంతోనే సమంత ఇంట్లోనుండి వచ్చేసి తర్వాత విడాకులు కూడా తీసుకున్నట్లు మంత్రి ఆరోపించారు.

ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో ? తన ఆరోపణలకు మంత్రి దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో ఎవరికీ తెలీదు. నాగార్జున, కేటీఆర్, సమంత, చైతన్యలు కేంద్రంగా మంత్రిచేసిన ఆరోపణలు తెలుగురాష్ట్రాల్లో బాగా సంచలనమయ్యాయి. అందుకనే సినీపరిశ్రమలోని చాలామంది ప్రముఖులు మంత్రి ఆరోపణలు, వ్యాఖ్యలను ఖండించటంతో పాటు నాగార్జున ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఆరోపణలను ఖండించిన నాగార్జున తర్వాత నాంపల్లి కోర్టులో మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేసు వేశారు. రు. 100 కోట్లకు పరువునష్టం దావా వేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. కేసు విషయమై నాగార్జున కుటుంబం నుండి నాంపల్లి కోర్టు స్టేట్మెంట్లు కూడా రికార్డుచేసింది.

ఇదే విషయమై తాజాగా కేటీఆర్ కూడా సురేఖ మీద పరువునష్ట దావా వేశారు. మరి కేటీఆర్ తాజా డిమాండ్ ఏమిటన్నది ఇంకా తేలలేదు. కేటీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు చాలామంది డిమాండ్లు చేశారు. అయితే కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు సురేఖ పదేపదే చెప్పారు. దాంతో ఇక లాభంలేదని అనుకుని కేటీఆర్ గురువారం సురేఖ మీద కేసు వేసినట్లున్నారు. ఇదే విషయమై నాలుగురోజుల క్రితం సురేఖ తరపు లాయర్ తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడుతు మంత్రి మీద నాగార్జున వేసిన కేసు నిలవదని చెప్పారు. ఎందుకంటే మంత్రికి వ్యతిరేకంగా వేసిన కేసులో నాగార్జున, నాగచైతన్య, సాక్షి సుప్రియ భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒకే కేసులో ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టే మంత్రి మీద వేసిన కేసు నిలబడదని వర్మ ధీమా వ్యక్తంచేశారు. మరీ నేపధ్యంలో కేటీఆర్ వేసిన కేసు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News