నరికి చంపి..నాలుగు ముక్కలు చేసి..గోనె సంచిలో కుక్కి
భార్యా భర్తలు విడిపోవడానికి తన చిన్నమ్మే కారణమని 13 ఏళ్ల తర్వాత ఆమెను కిరాతకంగా చంపేశాడు.
By : The Federal
Update: 2025-10-06 04:16 GMT
విజయవాడ భవానీపురం హెచ్‌బీ కాలనీలో దసరా ముందు రోజు జరిగిన దారుణ ఘటనలో ఓ మహిళను ఆమె అక్కడ కొడుకు, మనవడు కలిసి హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి వేర్వేరు మురుగు కాల్వల్లో పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ భవానీపురం ఉర్మిళానగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి (65) తన కుమారుడితో కలిసి నివసిస్తోంది. కోడలు మరణించడంతో తల్లీకొడుకులిద్దరే ఇంట్లో ఉంటున్నారు.
విజయలక్ష్మి అక్క కొడుకు వంకధార హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యానికి భార్య హారిక, కుమారులు శ్రీమహావిష్ణు, 16 ఏళ్ల కుమారుడు (ఇంటర్మీడియట్ చదువుతున్నాడు), కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు రావడంతో 2012కు ముందు హారిక తన పెద్ద కుమారుడు, కుమార్తెను తీసుకుని తిరువూరు సమీపంలోని కంభంపాడులోని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి తన చిన్నమ్మ (విజయలక్ష్మి) కారణమని భావించిన సుబ్రహ్మణ్యం అప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్నాడు. చివరికి 13 ఏళ్ల తర్వాత ఆ కోపాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నించాడు.
ఈనెల 1వ తేదీన సుబ్రహ్మణ్యం తన పిన్ని విజయలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెతో మంచిగా మాట్లాడి, ఆమెను తన బైకుపై ఎక్కించుకుని హెచ్‌బీ కాలనీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన రెండో కుమారుడితో కలిసి పెద్ద కత్తితో ఆమె మెడ నరికి హత్య చేశాడు. తర్వాత తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఆమె శరీరాన్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేసి గోనె సంచుల్లో కుక్కి వేర్వేరు మురుగు కాల్వల్లో పడేశారు.
విజయలక్ష్మి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆధారాలతో తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.