ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..బ్యాంకు ఉద్యోగుల్లో సంతోషం
గతేడాది నిర్ణయించిన సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించింది. అదనంగా మరో సెలవును మంజూరు చేసింది.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా మరో రోజును సెలవుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు యూనియన్ల అభ్యర్థన మేరకు కనుమరోజును కూడా సెలవుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 2025 ఏడాదికి గాను జనవరి 14న ఒక రోజు మాత్రమే సంక్రాంతి సెలవుగా ఇది వరకు నిర్ణయించారు. ఆ మేరకు గతేడాది డిసెంబరులోనే నిర్ణయించారు.
అంటే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు సెలవు లేదు. కనుమ రోజు యథావిధిగా బ్యాంకులు పని చేయాల్సి ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు సెలవు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. కనుమ రోజును సెలువగా ప్రకటించాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనియన్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనియన్ల అభ్యర్థనను అర్థం చేసుకుంది. వాళ్లు కోరిన సెలవు పట్ల సానుకూలంగా స్పందించింది. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజును కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనుమ రోజును కూడా సెలవు దినంగా పొడిగించింది. దీంతో బ్యాంకు ఉద్యోగులకు రెండు రోజుల సెలవులు లభించినట్టు అయ్యింది. సెలవు దినాలకు సంబంధించి గత ఏడాది డిసెంబరు 6న జారీ చేసిన 2116 జీవోను సవరిస్తూ సోమవారం కొత్తగా 73 నంబరు ఉత్తర్వులను జారీ చేసింది.