గాజుల అలంకారంలో కనక దుర్గమ్మ..ఎన్ని గాజులంటే

300 మంది రెండు రోజుల పాటు శ్రమించి ఈ గాజులను దండలుగా కట్టి అలంకరణకు సిద్ధం చేశారు.

Update: 2025-10-24 04:25 GMT

భగిని హస్త భోజన పర్వదినం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జగన్మాత దుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలవిరాట్‌తో పాటు మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి రంగురంగుల గాజులతో విశేష అలంకరణ చేశారు. ఈ అలంకరణ కోసం దాతలు అందజేసిన 4,31,932 గాజులను ఉపయోగించారు.

దేవస్థానం సిబ్బంది సుమారు 300 మంది రెండు రోజుల పాటు శ్రమించి ఈ గాజులను దండలుగా కట్టి అలంకరణకు సిద్ధం చేశారు. అదనంగా, చెన్నై, ముంబయి, బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక గాజులను కూడా ఈ అలంకరణలో వినియోగించారు. స్వర్ణాభరణాల స్థానంలో రంగురంగుల గాజులతో అమ్మవారు చూడముచ్చటగా కనిపించారు, భక్తులను ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈఓ) శీనానాయక్, పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ జగన్మాత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విశేష అలంకరణ భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపి, ఇంద్రకీలాద్రిని భక్తిమయ వాతావరణంతో నింపింది.


Tags:    

Similar News