Road accident | కడప:లారీ కింద నలిగిన నలుగురి ప్రాణాలు
ఓ బాలిక మాత్రం మృత్యుంజయురాలిగా బయటపడింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం కారును లారీ ఢీకొనడంతో నలుగురు మరణించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-24 06:30 GMT
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో కారు, లారీ ఢొకొన్న ఘటనలో నలుగురు అక్కడికి అక్కడే మరణించారు. మృతి చెందిన వారిలో ఒక పురుషుడు, మహిళా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. రాయచోటి సమీపంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన ఘటనతో ట్రాఫిక్ స్తంభించింది.
కడప వైపునకు వెళుతున్న కారును లారీ ఢీకొంది. మలుపులో లారీ కింద కారు నలిగిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి ఓ కుంటుబం కారులో కడపకు బయలుదేరింది. ఇదే మార్గంలో రామాపురం దాటిన తరువాత ప్రమాదకరమైన గువ్వలచెరువు ఘాట్ ప్రారంభం అవుతుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.
ఘాట్ రోడ్డులో ఒక పక్కన ఉన్న గోడవైపు కారు దూసుకుని పోయింది. లారీ కూడా కారుపై పడిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జుగా నలిగిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కల్పోయారని సమాచారం. లారీ కింద నలిగిపోయిన కారును, అందులోని మృతదేహాలను వెలికి తీయడానికి వాహనాల్లో వెళుతున్న వారితో పాటు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంతో భారీగా వాహనాలు నిలియిపోయాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మరణించిన వారు కడప జిల్లా బద్వేలుకు చెందిన వారిగా భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
లారీ కింద నలిగిన కారులో నాలుగేళ్ల పాప మృత్యుంజయురాలిగా ఉండడం గమనించిన ప్రయాణికుల సహకారంతో ఆ పాపను వెంటనే కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందింది.