జిందాల్ కంపెనీ భూములు వెనక్కి తీసుకోవాలి
18 ఏళ్లుగా ఉత్పత్తి ప్రారంభించని కంపెనీకి భూములు ఎలా ఇస్తారు: హెచ్ఆర్ఎఫ్;
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ కు కేటాయించిన భూములు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని HRF ఏపీ అధ్యక్షుడు కెవి జగన్నాధరావు, ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె అనురాధ, ఆంధ్ర, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు విఎస్ కృష్ణ డిమాండ్ చేశారు. 2007 జూన్ 28న జీవో నెం.892 ద్వారా కేటాయించిన భూములు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
18 ఏళ్ల క్రితం 1166 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించిందని వారు తెలిపారు. ఇందులో 985.70 ఎకరాల ప్రభుత్వ భూమి, డి పట్టా భూమి ఉందని, అలాగే కంపెనీ 180 ఎకరాల ప్రైవేట్ భూములు కొనుగోలు చేసిందన్నారు. ఇన్నేళ్లుగా పరిశ్రమను ప్రరాంభించడంలో కంపెనీ విఫలమైనందున భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు కోరారు.
2025 జూలై 5న హెచ్ఆర్ఎఫ్ బృందం ముషిడిపల్లి, కిల్తంపాలెం, చీడిపాలెం, చిన్నఖండేపల్లి, మూడబొడ్డవర గ్రామాలకు వెళ్లి రైతులను కలిసి మాట్లాడినట్లు వారు తెలిపారు. కంపెనీ వస్తే ఉపాధి దొరుకుతుందని నమ్మి వారికి భూములు ఇచ్చి మోసపోయామని వారు చెప్పినట్లు హెచ్ఆర్ఎఫ్ నాయకులు తెలిపారు.
ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో అరకు దగ్గర ఉన్న రక్తకొండ, గాలికొండ, చిత్తంగొండి కొండల్లో ఉన్న బాక్సైట్ ఖనిజాన్ని ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎండీసీ జిందాల్ కంపెనీకి సరఫరా చేయాల్సి ఉందని, అయితే 2016లో ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఇన్నేళ్లుగా ఫ్యాక్టరీ నెలకొల్పటం కానీ, ఇతర చోట్ల నుంచి ముడి సరుకును తెచ్చుకునే ప్రయత్నం చేయడం కానీ చేయలేదని, దీని కారణంగా భూములు కోల్పోయిన రైతులు జీవనాధారం పోగొట్టుకుని బాధపడుతున్నారని తెలిపారు.
2023 ఫిబ్రవరి 20న అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెం.14 ద్వారా అల్యూమినియం కాంప్లెక్స్ కు బదులుగా ఎంఎస్ఎంఈ పార్క్ లేదా ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని జిందాల్ కంపెనీకి మళ్లీ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది ప్రైవేట్ సంస్థలకు నేరుగా లాభం కేకూర్చే చర్యగానే ఉందని వారు పేర్కొన్నారు. తాడిపూడి రిజవ్వాయర్ నుంచి ఈ పార్క్ కు నీరు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు మాకు సమాచారం ఉందని, ఇది విశాఖ పట్నం నగరానికి తాగునీరు, ఎస్ కోట, జామి, గంట్యాడ మండలాల్లో 15,000 ఎకరాల సాగునీటి అవసరాలకు హాని చేస్తుందని తెలిపారు. ప్రజల తాగునీరు, సాగు నీటి అవసరాలు తీర్చకుండా పరిశ్రమకు నీరు ఇవ్వాలనే నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
18 ఏళ్లపాటు నిరుపయోగంగా భూములను పెట్టిన కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి, భూములు స్వాధీనం చేసుకుని భూములు లేని పేదలకు భూములు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని వారు కోరారు.