వైసీపీ ప్రతిపక్ష హోదా కేసులో స్పీకర్‌కు ఏపీ హైకోర్టు నీటీసులు
దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబరు అక్టోబరు 4కు వాయిదా వేసింది.
By : The Federal
Update: 2025-09-24 09:21 GMT
ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటుగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా దీనికి జోడించాలని ఆదేశిచింది. తదుపరి విచారణనుæ అక్టోబర్ 4, 2025కు వాయిదా వేసింది.
వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ జగన్ ఈ పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ వైస్ జగన్ రాసిన లేఖపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తామని ఆయన బదులిచ్చారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబందనలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించవని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నాడు పేర్కొన్నారు. దీనిపైన జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5, 2025న తీసుకొచ్చిన రూలింగ్‌ను సవాల్ చేస్తూ, ఇది రాజకీయ ప్రేరేపితమని, పక్షపాతంతో కూడుకున్నదని జగన్ ఏపీ హైకోర్టు పిటీషన్ దాఖలు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉండగా, 175 సీట్ల శాసనసభలో 11 సీట్లతో 10% సీట్ల కనీస అర్హత (18 సీట్లు) లేనందున హోదా తిరస్కరించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అయితే, జగన్ తన పిటిషన్‌లో రాజ్యాంగం, చట్టంలో సీట్ల ఆధారంగా హోదా ఇవ్వడానికి నిబంధన లేదని, గతంలో 10% కన్నా తక్కువ సీట్లున్న పార్టీలకు హోదా కల్పించిన సందర్భాలను పేర్కొన్నారు. ఉదాహరణకు, ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లతో లోప్ హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన ఉదహరించారు.
స్పీకర్ రూలింగ్ వెనుక అధికార పార్టీ సమిష్టి నిర్ణయం ఉందని, ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యమని జగన్ ఆరోపించారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టం, 1953కు విరుద్ధమని, తనను ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని కోర్టును కోరారు.
గతంలో, 2024 జులైలో జగన్ ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు జులై 30, 2024న అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 11, 2024న కోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది, ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు సరిగా అందలేదని, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ ఉందని వాదనలు వచ్చాయి. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హై కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ అక్టోబర్ 4, 2025కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఏపీ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉందని చర్చ వినిపిస్తోంది.