భారీ ధర్నాకు జగన్ ప్లాన్..వైసీపీ శ్రేణులలో జోష్

అనకాపల్లి జిల్లాలో 9న పర్యటన తరువాత యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయనున్న వైసీపీ అధినేత

Update: 2025-10-04 08:31 GMT

ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది.పథకాల అమలులో ,హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ అధినేతగా తానే పూర్తి స్థాయిలో రంగంలో దిగాలని జగన్ చేస్తున్న ఆలోచన ఇప్పడు పార్టీ శ్రేణులలో జోష్ పెంచుతోంది. అమరావతికి రెండో దఫా భూసేకరణ, ప్రైవేటు సంస్ధలకు భూముల కేటాయింపు ఇలా ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నాయని , వాటిని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లానని జగన్ భావిస్తున్నారు.అయితే మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీకి వరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల కోసం పోరుబాట నిర్వహించాయి. ఇక ఇప్పుడు ఈ నిరసనల్లో తాను స్వయంగా పాల్గొనాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించి,అక్క‌డ జరిగిన నిర్మాణ‌ పనులను పరిశీలించనున్నారు.జగన్ పర్యటన ఖరారు కావడంతో పార్టీ శ్రేణులలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

భారీ ధర్నాలో నేరుగా జగన్?
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పై కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన దగ్గరి నుంచి , ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. జగన్ తన హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఇప్పటికే వివరించారు. పార్టీ నేతలు సైతం అదే జోరుతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసారని విమర్శిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజలలోకి పూర్తిగా తీసుకెళ్లాలని , వైద్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే భావనను అర్థం అయ్యేలా ప్రజలకు చెప్పాలని భావిస్తున్న వైసీపీ , పార్టీ అధినేత నేరుగా నిరసనలో పాల్గొంటే వచ్చే అడ్వాంటేజ్ వేరని చెబుతోంది..అన్నింటా ప్రైవేటుపరమనేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలలో ఎండగట్టాలని జగన్ భావిస్తున్నారు. నర్సీపట్నం కాలేజీ సందర్శన తరువాత అక్కడి నుంచే జగన్ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ధర్నాకు జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి లేదా నంద్యాల కేంద్రంగా ఈ ధర్నా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.దీంతో, 9న జరిగే జగన్ నర్సీపట్నం పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.మెడికల్ కాలేజీల అంశంలో జగన్ తదుపరి కార్యాచరణ ఎలా వుండబోతోందన్నిదీ చర్చకు దారితీస్తోంది. మిగిలిన అంశాలు , హామీల విషయం అట్లుంచితే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తప్పుబడుతూ ప్రజలే చర్చించుకుంటున్నారని ,ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారు.
Tags:    

Similar News