మోదీతో జగన్‌కు హాట్‌లైన్‌ ఉంది

జగన్‌ మాదిరిగా రాహుల్‌ గాంధీ బలప్రదర్శన చేయడం లేదని షర్మిల అన్నారు.;

Update: 2025-08-14 16:30 GMT

ప్రధాని మోదీతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు హాట్‌లైన్‌ ఉందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. విజయవాడలో గురువారం ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీతో జగన్‌ హాట్‌లైన్‌ మెయింటెయిన్‌ చేస్తూనే వచ్చారని విమర్శలు గుప్పించారు. జగన్‌ మోదీతో తెర వెనుక పొత్తులు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీతో సీఎం చంద్రబాబుకి ఎలాంటి హాట్‌లైన్‌ లేదని షర్మిల తెలిపారు. మోదీతో జగన్‌కు హాట్‌లైన్‌ లేదని బైబుల్‌ మీద ప్రమాణం చేసి గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.

మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్, తన మెడలు వంచుకుని మోదీకి జగన్‌ సాగిలపడ్డారని విమర్శించారు. ఇది హాట్‌లైన్‌ కాదా? అక్రమ పొత్తు కాదా? రాజకీయ వ్యభిచారం కాదా అని నిలదీశారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మోదీకి జగన్‌ దత్త పుత్రుడుగా మారారని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లాలని జగన్‌కు షర్మిల సవాల్‌ విసిరారు. లిక్కర్‌ కుంభకోణంప సంజాయిషీ ఇచ్చుకోవాలని జగన్‌కు సూచించారు. అసెంబ్లీకి పోరు, పార్లమెంట్‌కు పోరు, మరి వైసీపీ పార్టీ ఎందుకు ఉన్నట్టు.. సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు.

కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ బీజేపీ తొత్తుగా మారిందని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ ప్రశ్నలకు ఎందుకు సమాధానలు చెప్పడం లేదని ఆమె నిలదీశారు. డిజిటల్‌ సమాచారాన్ని ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. మోదీ కమిషన్‌గా భారత ఎన్నికల సంఘం మారిపోయిందన్నారు. బోగస్‌ ఓట్ల నమోదుపై భారత ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలన్నారు. దేశ పౌరుల ఓటు హక్కును కాపాడటం కోసం, రాజ్యాంగ కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేపట్టిందన్నారు. ఓట్‌ చోరీపై తమ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రతరం చేస్తుందన్నారు.
Tags:    

Similar News