పేదల తిరుపతి కోసం వచ్చి..

తెలుగు రాష్ట్రాల్లో పేద, దిగువ మధ్య తరగతి వారికి తిరుమల మాదిరి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి.

Update: 2025-11-01 15:18 GMT
కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం

పేదలు.. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లడమంటే మాటలు కాదు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి వేల రూపాయలు ఖర్చవుతుంది. ఆ ఖర్చు భరించలేని వారు తమకు దగ్గర్లో ఉన్న వేంకటేశ్వరుని ఆలయానికి వెళ్లి తృప్తి పడుతుంటారు. అలాంటి వారి కోసం అక్కడక్కడ ఇలాంటి దేవాలయాలను నిర్మిస్తుంటారు. అలా వెలసినవే ద్వారకా తిరుమల (చిన్న తిరుమల)తో పాటు టీటీడీ ఆధ్వర్యంలో మరికొన్ని ఆలయాలు, కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాలు. ద్వారకా తిరుమల దేవదాయ శాఖ అధీనంలో ఉండగా కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. కాశీబుగ్గ శ్రీవారి ఆలయం పేదల తిరుపతిగా పేర్గాంచింది.


ఆలయం లోపల ఇలా..

కాశీబుగ్గ ఆలయానికి అంకురార్పణ ఇలా..
కాశీబుగ్గ ఆలయం నిర్మాణం వెనక ఆసక్తికర వాస్తవం దాగి ఉంది. ఒడిశా రాజవంశానికి చెందిన హరిముకుంద పండా (95) శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడు. తన చిన్నతనం నుంచి తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకోవడం అలవాటు. అలా పదేళ్ల క్రితం స్వామి దర్శనం కోసం వెళ్లిన పండాను ఆలయ సిబ్బంది సరిగా దర్శనం చేసుకోనీయకుండా పక్కకు ¯ð ట్టేశారు. ఈ పరిణామానికి కలత చెందిన పండా ఇంటికొచ్చి తన తల్లితో చెప్పారు. తానుంటున్న కాశీబుగ్గలోని తన సొంత భూమిలోనే తిరుమల మాదిరిగా పేద, దిగువ మధ్య తరగతి వారు, తిరుపతి వెళ్లే ఖర్చులు భరించలేని వారి కోసం శ్రీవారి ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఈ ఆలయానికి శ్రీకారం చుట్టారు. అలా 12 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ఈ ఏడాది మే నెలలో పూర్తి చేశారు. తిరుమలలో మాదిరిగా తొమ్మిది అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశ్వరుని ఏకశిలా విగ్రహాన్ని తిరుపతి నుంచి రప్పించి ప్రతిష్టించారు. అప్పట్నుంచి శ్రీనివాసుని దర్శనానికి భక్తులకు అనుమతించారు. అనతికాలంలోనే ఈ ఆలయానికి భక్తుల ఆదరణ పెరిగింది. వందల్లో మొదలైన భక్తుల సంఖ్య వేలకు చేరింది. ఎందుకంటే అక్కడ వేంకటేశ్వరునితో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించి నిత్య పూజలు జరుపుతున్నారు. అప్పట్నుంచి ఆలయ ధర్మకర్తగా పండా కొనసాగుతున్నారు.

ఆలయం లోపల ఇలా.. 

పలాస పండా ఎస్టేట్‌లో..
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులతో పాటు పేదలు, అనాథలను విశేషంగా ఆకట్టుకునే మరెన్నో ప్రత్యేకతలున్నాయి. ధర్మకర్త పండా తన సొంత నిధులతో ప్రతి సోమవారం అనాథలు, పేదలు, పిల్లల నిరాదరణకు గురైన వృద్ధులకు వారి స్థితిని బట్టి రూ.200–300 వరకు 300 నుంచి 500 మంది వరకు పింఛన్లు అందజేస్తారు. అవసరమైన వారికి వస్త్రాలు ఇస్తారు. అంధుల భవిష్యత్‌ అవసరాలకు వారి పేరున కొంత సొమ్ము డిపాజిట్టు చేసి బాండ్లను ఇస్తారు. ఆలయం ప్రాంగణంలోనే అనాధాశ్రమాన్ని కూడా కట్టారు. పండాకు పలాసలో వంద ఎకరాల ఎస్టేట్‌ ఉంది. æఅందులో సేంద్రియ పంటలు పండిస్తారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ చేస్తుంటారు. ఆలయంలో హుండీలు కూడా ఉండవు. ఎవరి నుంచీ విరాళాలు కూడా సేకరించరు. ఈ ఆలయంలో పేదల కోసం రెండు ఉచిత కల్యాణ మండపాలు నిర్మించారు. ఈ దేవాలయానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణల నుంచి భక్తులు వస్తుంటారు.

ఆలయంలో శ్రీవారి విగ్రహం 

స్థానికుల దిగ్భ్రాంతి..
కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఆలయ నిర్వహణపై స్థానికుల్లో సానుకూల ధృక్పథమే ఉంది. ఎవరి నుంచీ పైసా ఆశించకుండా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ఆలయంలో ఇలాంటి దుర్ఘటన జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి వెళ్లలేని పేదలకు అదే తరహాలో ఆలయం నిర్మించి ఉచితంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారని, మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాంటి తరుణంలో తొక్కిసలాట ఘటన తమను కలచి వేసిందని కాశీబుగ్గకు చెందిన కూలీ కె.సోమినాయుడు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశాడు. పేదల తిరుపతికి వచ్చి అశువులు బాయడం బాధాకరమని చెప్పాడు.
Tags:    

Similar News