వన్ ఇండియా ఓకే.. వన్ టాక్స్ సరికాదు.. సమీక్షించండి..

కేంద్రానికి లేఖ రాస్తానన్న సీఎం చంద్రబాబు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-01 13:00 GMT
శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో మాట్లాడుతున్న సీఎం నారా చంద్రబాబు

రాష్ట్రంలో ప్రయివేటు రవాణా వ్యవస్థను నియంత్రించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు వద్ద గత శుక్రవారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో 21 మంది సజీవదహనమైన ఘటనపై ఆయన స్థిరమైన ఆలోచనకు వచ్చారు. జాతీయ పన్ను విధానంపై సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. ఏ రాష్ట్రంలో పన్ను తక్కువ ఉంటే, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి, దేశం మొత్తం వాహనాలు తిప్పే పరిస్థితి ఉండడం వల్ల ప్రయాణికుల భద్రత లేకుండా పోయిందని గుర్తు చేశారు. 

శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో శనివారం మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పెద్దన్నవారిపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో మేడం రెడ్యమ్మకు వితంతు పింఛను, మరో కుటుంబంలోని మేడా మల్లయ్యకు వృద్ధాప్య పింఛను అందించారు.


మల్లయ్య ఇంటికి ఉన్న శిలాఫలకం చూసిన సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో కాసేపు మాట్లాడి కుటుంబ సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన గ్రామస్తుల నుంచి వినతులు అందుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పారదర్శక పాలన..
రాష్ట్రంలో పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా టెక్నాలజీని అనుసంధానం చేసి మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. గతానికి భిన్నంగా మరో విప్లవానికి విశాఖ గూగుల్, ఏటీ డేటా సెంటర్ తో నాంది పలికామని ఆయన గుర్తు చేశారు.

"30 ఏళ్ల కింద సెల్ ఫోన్ పై నేను మాట్లాడితే ఎగతాళి చేశారు.. ఐటీ విప్లవం తెచ్చా. కూలీ పనులకు వెళ్లే వారి ఇంట సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తయారయ్యారు. ఇప్పుడు మరో విప్లవం రాబోతోంది. అది విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే గూగుల్ (Google), ఏఐ ( Artificial Intelligence A ) డేటా సంటర్ ( Data Center) ఏర్పాటుకు 1.40 వేల కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం. విశ్వాసం పెంచాం" అని సీఎం చంద్రబాబు వివరించారు.

బాబు.. దుబాయ్ అనుభవం
దుబాయ్ పర్యటనకు వెళ్లి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు తన అనుభవాలను ప్రజావేదిక నుంచి పంచుకున్నారు. గతంలో కూలి పనులకు ఏపీ నుంచి దుబాయ్ వెళ్లే వారని ఆయన గుర్తు చేశారు.
"నేను దుబాయ్ వెళ్లిన సందర్బంలో ఓ విశాలమైన హాల్ లో సభ ఏర్పాటు చేశారు. వచ్చిన తెలుగు వారితోనే కాకుండా, మిగతా ప్రజలకు అది సరిపోలేదు. వారు చెప్పే మాటలు విన్న తరువాత నాకు చాలా ఆనందం కలిగించింది. అక్కడికి వచ్చిన వారిలో ఐపు నిపుణులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న తెలుగు వారు ఉన్నారు" అని సీఎం చంద్రబాబు హర్షధ్వానాల మధ్య చెప్పారు. అంతే గతానికి భిన్నంగా 30 సంవత్సరాల కిందట వేసిన ఐటీ అనే మొక్కు కారణంగా సాంకేతిక నిపుణులను తయారు చేసిన ఘనత తెలుగురాష్ట్రాలకు దక్కిందన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణం
రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం ఎన్. చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం అని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమిని గెలిపించి అధికారం అప్పగించారు. నిత్యం ప్రజల కోసమే మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అభివృద్ధి చేసి ఆదాయం వస్తేనే సంక్షేమం చేయగలం" అని సీఎం చంద్రబాబు వివరించారు.
వైసీపీపై విసుర్లు
మంచి మెజారిటీతో గెలిపించిన ప్రజల మధ్యనే ఉండాలని భావించానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నెలా మీ అందరిని కలవడానికి వస్తున్నా అని చెప్పారు.
"బటన్ నొక్కొచ్చు, పరదాలు కట్టుకుని రావచ్చు, ఇంట్లోనే కూర్చొవచ్చు" అని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైసీపీ నేత జగన్ తో పాటు ఆయన సహచరులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ప్రతి అంశంలో కులం, మతం, ప్రాంతీయతను రెచ్చగొట్టి, పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"గతంలో హెలికాప్టర్ లో వచ్చినా, భూమిపై ఉండే చెట్లు నరికేసిన పరిస్థితి ఉండేది. అప్పటి పాలనకు, ఇప్పటికీ తేడా అదే. ప్రజల మనిషిని కాబట్టే మీ ఇంటికి వచ్చి మీ దగ్గరకే వచ్చి పెన్షన్ ఇస్తున్నాం. అని సీఎం చంద్రబాబు తన పనితీరును ఆవిష్కరించారు.
వలంటీర్లపై సీఎం ఎన్. చంద్రబాబు ఏమన్నారంటే..
"ఒక్క పెన్షన్ ఇవ్వడానికే 2.65 లక్షల మంది వాలంటీర్లను పెట్టారు. దానికంటే మెరుగ్గా ఇప్పుడు మూడు గంటల్లోనే పెన్షన్ ఇస్తున్నాం" అని చెబుతూ, వలంటీర్ల వ్యవస్థ అనవసరం అని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
"ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాయిదా వేయబోం.పెన్షన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్ల ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఏపీనే. పెన్షన్ల కోసం రూ. 50,764 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశాం. దేశంలోనే ఇదో రికార్డు. అతిపెద్ద డీబీటీ కార్యక్రమం ఇది" అని వివరించారు.
మొంథా తుపాను వల్ల రూ.5,244 కోట్ల ఆస్తి నష్టం రాష్ట్రంలో జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. క్నాలజీ సాయంతో ముందుగానే గుర్తించడం ద్వారా ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చి, అధికారులను అప్రమత్తం చేసి, భారీ నష్టాన్ని నివారించగలిగామని ఆయన వివరించారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం అని ఆయన వివరించారు.

ప్రజావేదిక సభా వైదిక నుంచి కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,హిందూపూర్ ఎంపి బి. కే. పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, జిల్లా మంత్రి సవితమ్మ మాట్లాడారు. సభకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. అంతకుముందు సత్యసాయి పుట్టపర్తి  జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని వివరించారు.
Tags:    

Similar News