కాశీబుగ్గ తొక్కిసలాట ఎందుకు జరిగిందంటే?

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు కారణం ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Update: 2025-11-01 11:35 GMT
కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో చనిపోయిన భక్తులు

అసలే కార్తీకమాసం.. ఏకాదశి.. ఆపై శనివారం.. ఈ మూడు ఒకేరోజు రావడాన్ని హిందూ భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. వందల సంఖ్యలో దేవుళ్ల విగ్రహాలతో అలరారుతున్న శ్రీవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తే పుణ్యమో, మోక్షమో ప్రాప్తిస్తుందన్నది భక్తుల నమ్మకం. ఏడాదంతా చేసిన పూజలు, పునస్కారాల పుణ్యఫలం ఈ ఒక్కరోజే వస్తుందన్న నమ్మకంతోనే శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆ స్వామిని దర్శించుకోవాలన్న కోరిక చాలామందిలో కలిగింది. దీంతో శనివారం వేకువ జామునుంచే భక్త కోటి ఆ ఆలయానికి పోటెత్తింది. పొద్దెక్కే కొద్దీ భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలా ఉదయం పది గంటల సమయంలో భక్త జనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్షణక్షణానికి అక్కడకు చేరుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది.


కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం

రాకపోకలు ఒక గేటు నుంచే..
ఈ ఆలయం మొదటి అంతస్తులో శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం కొలువై ఉంది. అక్కడే శ్రీదేవి, భూదేవిల విగ్రహాలూ ఉన్నాయి. మొదటి అంతస్తులో ఉన్న స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకోవాలంటే కింద నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. దర్శనానంతరం బయటకు వెళ్లిపోతుంటారు. మామూలు రోజుల్లో వందల సంఖ్యలో, ప్రతి శనివారం రెండు నుంచి మూడు వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. అందువల్ల తొక్కిసలాటకు ఆస్కారం ఉండదు. కానీ శనివారం ఏకాదశి, కార్తీకమాసం కావడంతో ఎక్కడెక్కడ నుంచో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయ నిర్వాహకులు అస్సలు ఊహించలేదు. దీంతో ఎలాంటి భద్రత, రక్షణ ఏర్పాట్లపై దృష్టి సారించలేదు. దర్శనానికి వెళ్లే వారు, దర్శనానంతరం తిరిగి బయటకు వచ్చే వారికి (ఇన్‌ గేటు, ఔట్‌ గేటు) ఒకటే కావడంతో రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది. అనూహ్యంగా వచ్చిన భక్తులు స్వామి దర్శనం కోసం మొదటి అంతస్తులోకి వెళ్తుండగా మెట్లకు ఆనుకుని ఉన్న రెయిలింగ్‌ విరిగిపడింది. దీంతో పైనున్న భక్తులు కిందనున్న వారిపై ఒక్కసారిగా పడిపోయారు. అక్కడ నుంచి పైకి లేచే అవకాశం లేకుండా పోవడంతో ఊపిరాడక చనిపోయారు. స్వామి దర్శనానికి వచ్చిన వారంతా ఉపవాసంతో నీళ్లు సైతం తాగకుండా ఉన్నారు. తొక్కిసలాటలో ఆక్సిజన్‌ అందక, గ్లూకోజ్‌ స్థాయిలు పడిపోయి స్వల్ప వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు.

మృతుల వివరాలను తెలుసుకుంటున్న అధికారులు, పోలీసులు 

తొక్కిసలాట మృతులు పది మంది!
కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య పదికి చేరుకుంది. మృతులు తొలుత ఐదుగురని, ఆ తర్వాత ఏడుగురని, అనంతరం తొమ్మిది మంది అని అధికారులు చెబుతూ వచ్చారు. చివరకు శనివారం మధ్యాహ్నం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మృతులు పది మంది అని ప్రకటించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఈడూరి చిన్నమ్మాయి (50) రాపాక విజయ (48),మురిపింటి నీలమ్మ (60), దువ్వు రాజేశ్వరి (60), చిన్ని యశోదమ్మ (56), రూప (వయసు తెలియదు), డొక్కర అమ్ముదలచచల (వయసు తెలియదు), బోర బృందావతి (62) లొట్ల నిఖిల్‌ (13)లు ఉన్నారు. పదో వ్యక్తి ఎవరన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తీవ్రంగా గాయపడిన బాకీ కళావతి (50), దువ్వు కుమారి (25)లను శ్రీకాకుళం, విశాఖ ఆస్పత్రులకు తరలించారు.
మృతుల్లో ఎనిమిది మంది మహిళలే..
తొక్కిసలాటలో చనిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలే కావడం విశేషం! మృతులంతా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, వజ్రపు కొత్తూరు, మందస, నందిగామ, సోంపేట, పలాస/కాశీబుగ్గ మండలానికి చెందిన వారే. శనివారం ఉదయం పదిగంటలకే పాతికి వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చినట్టు చెబుతున్నారు. వీరిలో 80 శాతం మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు వీరంతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారేనని సమాచారం.
హుండీ లేని దేవాలయం.. ఉచిత భోజనం..
ఈ దేవాలయంలో ప్రతి శని, సోమవారాల్లో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ ఉంటుంది. స్వామి దర్శనానికి వచ్చిన వారంతా భోజనం చేసి వెళ్తారు. పైగా ఇతర దేవాలయాల మాదరిగా అక్కడ హుండీలు ఉండవు. ఎవరికీ దక్షిణలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దోపిడీ ఉండదు. పైగా బోజనం ఖర్చు అక్కర్లేదు. వందల సంఖ్యలో దేవుళ్లు, దేవతా మూర్తుల విగ్రహాలుండడం వల్ల ఇతర ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు. ఇప్పుడలా వచ్చిన వారే తొక్కిసలాటకు గురయ్యారు. పది మంది అశువులు బాశారు.
Tags:    

Similar News