ISRO- YUVIKA | విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు తొడుగుతాం అంటున్న ఇస్రో
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ఆలోచనలకు పదును పెడుతోంది. 9వ తరగతి విద్యార్థులకు యు.వి.కా YUVIKA కోసం దరఖాస్తు గడువు మూడురోజులే ఉంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-19 14:47 GMT
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలపడంలో శాస్ర్తవేత్తలు అవిశ్రాంత పరిశోధనలు సాధించారు. విద్యార్థుల్లో దాగున్న ఆలోచనలకు కూడా పదును పెట్టడానికి ఇస్రో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాకెట్ ప్రయోగ సమయంలో సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం సమీపానికి అనుమతించడం ద్వారా విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు ప్రేరణ కల్పిస్తోంది. యువశాస్ర్తవేత్తలను తయారు చేయడానికి కూడా అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం..
ఏపీజె కలాం మాటలు..
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మాటల్లోనే ఆయన విజయగాథ ఒకసారి పరిశీలిద్దాం..
ఏపీజె కలాం చిన్నతనంలో రామేశ్వరం బీచ్ లో కూర్చొన్నప్పుడు ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి, ఇలా విహరించాలని ఆలోచనల రెక్కలు మొగ్గ తొడిగాయి. పేదరికం అయినా, ఊరికి సమీపంలోని సముద్రం నుంచి ఎగిసిపడే ఆలలే ఆయన ఆలోచనకు మరింత పదును పెట్టాయి. కష్టాల ఒడిలో చదువు సాగించారు. భౌతికశాస్త్రంలో పట్టా సాధించారు.పైలెట్ కావాలనే కోరిక నెరవేరకున్నా, త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ అయ్యాను అని ఓ సందర్భంలో ఆనందంగా విద్యార్థులతో తన భావాలు పంచుకున్నారు. కష్టాలను ఆనందంగా అనుభవించి, తనలో ఆశకు కోరికకు ప్రతిబంధకమైన పేదరికం అడ్డుకాలేదని ఆయన ఆంటారు.
"కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి" అనే సూక్తికి నిండైన నిలువెత్తు నిదర్శనం. దానిని సాకారం చేసిన దార్శనికుడు కలాం, అదే మాటలు విద్యార్థులకు ఉద్బోధించారు.
రాష్ట్రపతి పదవీ విరమణ తరువాత కూడా ఏపీజె కలాం దేశంలో పర్యటన సాగిస్తూ, విద్యార్థులకు ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పడానికి అమితాసక్తి చూపారు. యువశాస్ర్తవేత్తలను తయారు చేయాలనేది తన కర్తవ్యంగా భావించిన ఆయన.. 2015 జూలై27వ తేదీ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎం (IIM) లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూనే, గుండెపోటుతో కుప్పకూలారు. ఈ విషాధ ఘటనతో విద్యార్థిలోకం, ఇస్రో ఉద్యోగులు, శాస్ర్తవేత్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాలపై మొగ్గ తొడిగిన విద్యార్థుల ఆశలు వికసింప చేయడానికి ఇస్రో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకోసం...
విద్యార్థులను యు.వి.కా పిలుస్తోంది
దేశంలోని 9వ తరగతి విద్యార్థులను సాంకేతికరంగంలో ప్రోత్సహించే దిశగా అంతరిక్ష పరిశోధన సంస్థ ( Indian Space Research Organisation ISRO) ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం యువ విజ్ఞాన కార్యక్రమం (యు.వి.కా) (YUva VIgyani KAryakram YUVIKA ) నిర్వహించనుంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమానికి తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. శాస్త్రవేత్తలతో విద్యార్థులు నేరుగా మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పించనున్నట్లు ఇస్రో తెలిపింది.
దరఖాస్తులకు ఆఖరి గడువు
తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈనెల 23వ తేదీలోపు www.isro.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇస్రో యువికా విభాగం విడుదల చేస్తుంది. మే 18 నుంచి విద్యార్థులను విడతల వారీగా ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా-25 కార్యక్రమం నిర్వహించి 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా బహుమతులు, ప్రశాంసా పత్రాలు అందివ్వనున్నారు.
దరఖాస్తుకు అర్హులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. వీటితోపాటు స్పేస్, సైన్సు క్లబ్బులలో ఉంటే 5 శాతం వెయిటేజీ ఇస్తారు. సైన్సు క్లబ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైన్స్ వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉంటే 10 శాతం వెయిటేజీ, ఎన్సీసీ స్కౌట్స్, గైడ్సుగా ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20 శాతం, పట్టణ ప్రాంతాల వారికి 5 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
అన్ని ఉచితమే
యువికా (YUVIKA) కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు ఇస్రో అన్ని వసతులు సమకూరుస్తుంది. విద్యార్థులకు ప్రయాణం, భోజన వసతి ఉచితంగా అందిస్తుంది. ఈ ఏడాది మే నెలలో 14 రోజులపాటు ఇస్రో అంతరిక్ష కేంద్రాలకు తీసుకెళుతుంది. అక్కడ సైన్సుకు సంబంధించిన విశేషాలు, వింతలు తెలియజేయడంతో పాటు రాకెట్ ప్రయోగాలు వాటి పనితీరుపై అవగాహన కల్పించనున్నారు.
ఎంపిక చేసిన విద్యార్థి ప్రయాణానికి (II AC రైలు ఛార్జీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా AC (వోల్వోతో సహా) బస్సు ఛార్జీ లేదా సమీప రైల్వే స్టేషన్/బస్ట్ టెర్మినల్ నుంచి రిపోర్టింగ్ సెంటర్‌కు, తిరిగి అధీకృత రవాణా) ఖర్చు మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది. సంబంధిత ఇస్రో కేంద్రం నుంచి ప్రయాణ ఛార్జీల రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థి అసలు ప్రయాణ టికెట్‌ను చూపించాలి. విద్యార్థి II AC రైలు (II AC తరగతి)లో ప్రయాణించకపోతే, గరిష్ట ఛార్జీల రీయింబర్స్‌మెంట్ II AC రైలు ఛార్జీ చేయనున్నారు. శిక్షణ సమయంలో కోర్సు సామగ్రి, వసతి, వసతి సదుపాయాలు ఇస్రో కల్పిస్తుంది.
YUVIKA ఎక్కడ నిర్వహిస్తారంటే..
ఔత్సాహిక విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అవగాహన కల్పించడం. వారిలో ఆలోచనలకు మరింత ఉత్సాహం నింపడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా, పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రయోగాలు చేయడంలో శ్రద్ధ చూపించే విద్యార్థులకు ఈ కార్యక్రమం మరింత ఊతం ఇస్తుందనడంలో సందేహం లేదు. దేశంలోని ఏడు కేంద్రాల్లో ఇస్రో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
దేశంలోని ఇస్రో ద్వారా పరిశోధనలు చేస్తున్న
1. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటోలని సతీస్ థావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్,
2. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్,3. తిరువనంతపురం (కేరళ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ) కేంద్రాల్లో యు.వి.కా కార్యక్రమం నిర్వహించనున్నారు.
Indian Institute of Remote Sensing (IIRS), Dehradun.
Vikram Sarabhai Space Centre (VSSC), Thiruvananthapuram.
Satish Dhavan Space Center (SDSC) Sriharikota.
U. R. Rao Satellite Centre (URSC), Bengaluru.
Space Applications Centre (SAC), Ahmedabad.
National Remote Sensing Centre (NRSC), Hyderabad.
North-Eastern Space Applications Centre (NE-SAC), Shillong.