దేవతలారా రండి.. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-24 16:15 GMT
తిరుమల శ్రీావారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోణ చేస్తున్న వేదపండితులు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ, శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ధ్వజారోహణం చేశారు. రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి పి.రాధాకృష్ణన్ తిరుపతికి చేరుకున్నారు.


మీన లగ్నంలో..


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

అంతకుముందు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీఅనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కంకణ బట్టర్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు వేదపండితులు పరివట్టం (తలకు పట్టువస్త్రం చుట్టడం) కట్టడం ద్వారా కంకణధారణ చేశారు. అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆయన పెద్దగా వ్యవహరిస్తారనే విషయాన్ని ఆగమోక్తంగా చెప్పడమే పరమార్థం.
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

తిరుమలలో బుధవారం ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల ఆలయ పీఠాధిపతి ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామికి 'పట్టు వస్త్రాలు' సమర్పించారు.

సంప్రదాయ వస్త్రాలు ధరించిన ముఖ్యమంత్రి ప్రధాన ఆలయం ముందు ఉన్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీబేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు జరిగిన ఆచార వేడుక తర్వాత, ఆలయ పూజారులు ముఖ్యమంత్రి చంద్రబాబు తలపై సాంప్రదాయ 'పరివట్టం'ను కప్పి, పవిత్ర 'వస్త్రాలు' ఉన్న వెండి పళ్ళెంను ఆయన తలపై ఉంచారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి తన తలపై ఉన్న పవిత్ర పట్టు వస్త్రాల వెండిపళ్లెం వేదమంత్రాల, వేద పారాయణం, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ లాంఛనాలు పూర్తి చేసిన తరువాత శ్రీవారి సన్నిధిలోకి తీసుకెళ్లారు.
పట్టువస్త్రాల అందజేత

ఆలయంలోని శ్రీవారి సన్నిధిలోకి వెళ్లిన సీఎం నారా చంద్రబాబు గర్భగుడి లోపల ప్రధాన పూజారికి పట్టు పట్టువస్త్రాలను అధికారికంగా అందజేశారు. అక్కడే నిలబడిన సీఎం చంద్రబాబు కొద్దిసేపు మూలమూర్తికి ముకుళిత హస్తాలతో ప్రార్థనలు చేశారు. దర్శనం తర్వాత, కొండ ఆలయంలోని రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రికి వేదశీర్వచనం అందించారు. రంగనాయకుల మండపంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సీఎం చంద్రబాబుకు శ్రీవారి ఫోటో, తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఐటి, విద్య శాఖా మంత్రి నారా లోకేష్, అధికారులు, ఉన్నారు.
Tags:    

Similar News