తిరుమల శ్రీవారికి రూ.3.86 కోట్ల కానుక
3.860 కేజీల స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పించిన విశాఖ పారిశ్రామికవేత్త.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మత్సవాలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. విశాఖపట్టణానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త అత్యంత విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కానుకను శ్రీవారికి సమర్పించారు. 3860 కిలోల బరువు ఉన్న బంగారుతో తయారు చేసిన యజ్ణోపవీతాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు తిరుమల ఆలయంలో అందించారు.
విశాఖపట్నంకు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమరేఖ దంపతులు రూ.3.86 కోట్ల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని తయారు చేయించారు. ఆ కానుకను బుధవారం వారు తిరుమలకు తీసుకుని వచ్చారు. శ్రీవారి భక్తులైన విశాఖకు చెందిన పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమరేఖ దంపతులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు గారికి అందజేశారు. దాతలను అభినందించిన చైర్మన్ వారికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.