తెలుగు సినీఫీల్డ్ ఏపీకి వెళ్ళటానికి ఎందుకు ఇష్టపడటంలేదు ?

ఏపీలో పాలకులు గడచిన పదేళ్ళుగా తెలుగుసినీ పరిశ్రమను ఏపీకి తరలిరావాలని పదేపదే విజ్ఞప్తిచేస్తున్నా ఎవరూ పెద్దగా సానుకూలంగా స్పందించటంలేదు;

Update: 2025-04-14 08:05 GMT
Telugi Film Industry in Hyderabad

ఇపుడీ విషయమే సస్పెన్సుగా మారిపోయింది. ఏపీలో పాలకులు గడచిన పదేళ్ళుగా తెలుగుసినీ పరిశ్రమను ఏపీకి తరలిరావాలని పదేపదే విజ్ఞప్తిచేస్తున్నా ఎవరూ పెద్దగా సానుకూలంగా స్పందించటంలేదు. తెలుగుసినీ ఇండస్ట్రీ(Telugu film industry) పెద్దలు పాలకుల విజ్ఞప్తిని ఎందుకని పట్టించుకోవటంలేదు ? హైదరాబాద్(Hyderabad) నుండి ఏపీకి ముఖ్యంగా విశాఖపట్నంకు తరలి వెళ్ళటానికి ఎందుకు వెనకాడుతున్నారు ? అనే విషయాలను పరిశీలిద్దాం. ఒకపుడు తెలుగుచిత్రపరిశ్రమ చెన్నై(Chennai)లో(మద్రాసు) ఉండేది. నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు, సంగీత దర్శకులతో పాటు కమెడియన్లు, విలన్లు ఒకటేమిటి, ఒకరేమిటి సినిమా ఇండస్ట్రీకి అవసరమైన ప్రతివిభాగంలోని ప్రముఖులు, టెక్నీషియన్లంతా చెన్నైలోనే ఉండేవారు. అయితే 1970ల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, మర్రిచెన్నారెడ్డి రిపీటెడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుండి హైదరాబాద్ కు తరలి రావాలని చేసిన విజ్ఞప్తులు, సంప్రదింపులు, ప్రయత్నాల కారణంగా మెల్లిగా మద్రాసు నుండి సినీప్రముఖులు హైదరాబాద్ రావటం మొదలుపెట్టారు.

నిజానికి 1956 అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందే సారధి స్టూడియోస్ మద్రాసు నుండి హైదరాబాద్ కు వచ్చేసింది. సారధి స్టూడియో 1956, మార్చి 9వ తేదీన హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ 1956, నవంబర్ లో ఏర్పడింది. పైన చెప్పుకున్నట్లుగా ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రత్యేక కృషివల్ల మొదట మద్రాసు నుండి హైదరాబాద్ కు మారింది అక్కినేని(Akkineni) నాగేశ్వరరావు తర్వాత ఘట్టమనేని కృష్ణ. మద్రాసు నుండి హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ తరలిరావాలంటే అందుకు అవసరమైన ఏర్పాట్లను అప్పటి ముఖ్యమంత్రులు చేశారు. స్టూడియో నిర్మాణాలకు, సినీప్రముఖులు శాశ్వతంగా హైదరాబాద్ లోనే ఉండేలా భూములు, స్ధలాలను అప్పటి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. తక్కువ ధరలకే స్డూడియోలకు, ఇళ్ళు నిర్మించుకునేందుకు భూములు, స్ధలాలతో పాటు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దాంతో పద్మాలయా స్టూడియోను కృష్ణ 1973లో నిర్మిస్తే, 1975లో నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించారు.

ఇద్దరు సినీప్రముఖులు మద్రాసు నుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయడు కూడా హైదరాబాదుకు వచ్చేసి రామకృష్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ నిర్మించుకున్నారు. ఆతర్వాత చాలామంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు చాలామంది మద్రాసు నుండి హైదరాబాదుకు తరలివచ్చేశారు. ఇపుడు హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్(Film Nagar) దానికి ఆనుకునే ఉండే కృష్ణానగర్లో ఎక్కడచూసినా సినీజనాలే కనబడుతున్నారంటే అందుకు 50 ఏళ్ళ చరిత్ర, కృషి ఉంది.

తెలుగుసినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన తర్వాత అధికారంలో ఎవరున్నా పరిశ్రమ మాత్రం మంచి సంబంధాలను కొనసాగిస్తున్నది. కాబట్టే ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. అలాంటిది రాష్ట్రవిభజన రూపంలో 2014లో పెద్దసమస్య ఎదురైంది. పరిశ్రమ మొదట్లో మద్రాసులో ఉన్నా తర్వాత హైదరాబాదుకు మారినా సినీప్రముఖుల్లో అత్యధికులది ఆంధ్రప్రదేశే. అప్పటి సినీప్రముఖుల్లో ఎక్కువమంది కృష్ణా, గుంటూరు, తెనాలి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలవారే. 2014లో రాష్ట్రవిభజన తర్వాత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రులయ్యారు. ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో తెలుగుసినీ పరిశ్రమను ఏపీకి తరలిరావాలని, వైజాగ్ లో అవసరమైన భూములు ఇస్తామని ప్రకటించారు. ఒక సినిమా ఫంక్షన్లో ఇదే విషయాన్ని చంద్రబాబు బావమరిది కమ్, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా ప్రస్తావించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు విజ్ఞప్తిచేసినా తెలుగుసినీ ప్రముఖులు హైదరాబాదును వదిలి ఏపీకి తరలి వెళ్ళటానికి పెద్దగా సానుకూలంగా కనిపించలేదు.

వైరుధ్యాలే ప్రధాన కారణమా ?

2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆహ్వానించినా సినీప్రముఖులు పెద్దగా స్పందించలేదు. దీనికి కారణం ఏమిటనే విషయమై ఆరాతీస్తే ఒక విషయం తెలిసింది. అదేమిటంటే రాజకీయ సమస్యలేనట. మామూలుగా అయితే సినీపరిశ్రమకు ప్రభుత్వానికి డైరెక్టుగా ఎలాంటి సంబంధాలు ఉండవు. అందుకనే ప్రభుత్వంలో ఎవరున్నా పరిశ్రమ మంచి సంబంధాలనే మైన్ టెన్ చేస్తుంది. కానీ ఇపుడు ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP)కి మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు చాలా తీవ్రస్ధాయిలో ఉన్నాయి. రెండుపార్టీల మధ్య వైరుధ్యాలు ఏస్ధాయిలో ఉన్నాయంటే ప్రభుత్వం మారినపుడల్లా అధికారంలో ఉన్నపార్టీ ప్రతిపక్షంలోని నేతలపై కేసులుపెట్టి జైళ్ళకు పంపేంతగా ముదిరిపోయింది.

నిజానికి టీడీపీ ఏర్పడినప్పటినుండి సినీపరిశ్రమల్లో చాలామంది ఎన్టీఆర్ తోను తర్వాత చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ అండచూసుకుని చాలామంది ప్రముఖులు కాంగ్రెస్ ను తర్వాత వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన కొందరు సినీప్రముఖులు టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బందిపడ్డారు. అలాగే వైసీపీ అధికారంలోకి రావటంతోనే టీడీపీతో సన్నిహితంగా ఉండే కొందరు సినీప్రముఖులు ఇబ్బందిపడ్డారు. ఇపుడు టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ మద్దతుదారుడైన పోసాని కృష్ణమురళి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరు చూస్తున్నదే. దాంతో రెండుపార్టీల ఆధిపత్యగొడవలమధ్య తాము నలిగిపోవటం ఎందుకని మెజారిటి సినీప్రముఖులు హైదరాబాద్ నుండి ఏపీకి తరలివెళ్ళటానికి ఇష్టపడటంలేదని సమాచారం. పైగా షూటింగులు చేసుకోవటానికి లోకేషన్లు, ప్రముఖ నటుల బస, వసతికి హైదరాబాద్ లో ఉన్నన్ని సౌకర్యాలు ఏపీలోని వైజాగ్ లేదా విజయవాడలో లేవు. పరాయిభాషలకు చెందిన ప్రముఖనటులు హైదరాబాద్ కు రావటానికి ఎలాంటి ఇబ్బందులు పడటంలేదు. కారణం ఏమిటంటే భాషా సమస్య లేకపోవటమే. ఉత్తరాధి నటీ, నటులు మాట్లాడేది హిందీనే. హైదరాబాదులో ఏమూలకు వెళ్ళినా హిందీ మాట్లాడుతారు కాబట్టి భాషా సమస్య వీళ్ళకు ఎదురుకావటంలేదు.

వాతావరణ రీత్యా కూడా ఏపీ కన్నా హైదరాబాద్ చాలా బాగుంటుంది. ఏపీలోని వైజాగ్, విజయవాడ, రాయలసీమ, కోస్తా జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కో వాతావరణం ఉంటుంది. అదే హైదరాబాద్ ను తీసుకుంటే ఏడాదిలో చాలావరకు ఉష్ణోగ్రతలు దాదాపు సమంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితమే స్టూడియో నిర్మాణాలకు, ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన భూములు తీసుకుని చాలామంది ప్రముఖులు హైదరాబాదులో బాగా స్ధిరపడిపోయారు. ఇపుడు ఏపీకి వెళ్ళి మళ్ళీ స్టూడియోలు నిర్మించుకుకోవాలన్నా, ఇళ్ళు నిర్మించుకోవాలన్నా ఏదో సందిగ్దత వెనక్కు లాగుతోంది. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం రామానాయుడు భీమిలీ కొండల మీద 35 ఎకరాలను సినిమా స్టూడియో కోసం తీసుకున్నారు. తీసుకున్న భూమిలో కొంతవరకు స్టూడియో కట్టి మిగిలిన భూమిని ఖాళీగా వదిలేశారు.

ఇపుడా భూమిని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు నోటీసులు జారీచేసింది. రామానాయుడు పూర్తిగా ఎందుకు స్టూడియో కట్టలేదంటే సముద్ర వాతావరణం కారణంగా స్టూడియోకు పక్కాభవనాలు నిర్మించి, షూటింగులు చేసుకోవటానికి సాధ్యంకాలేదట. తీసుకున్న భూమిలో ఎక్కువభాగాన్ని నిర్మాణాలు చేయకుండా వదిలేశారు. అందుకనే ఇపుడా భూమిని వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దాంతో దగ్గుబాటి సురేష్ బాబు, ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకునే చాలామంది సినీప్రముఖులు హైదరాబాద్ నుండి ఏపీకి తరలి వెళ్ళటానికి ఇష్టపడటంలేదు. తాజాగా సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా సినీపరిశ్రమ హైదరాబాద్ నుండి ఏపీకి తరలిరావాలని పిలుపిచ్చారు. ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తేనే తరలిరాని పరిశ్రమ మంత్రి దుర్గేష్ అడిగితే వస్తుందా ?

Tags:    

Similar News