పలమనేరులో టీటీడీ దివ్య వృక్షాల ప్రాజెక్ట్?

తిరుమలలో ప్రారంభమైన బోర్డు మీటింగులో రోప్ వే చర్చకు అవకాశం.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-16 06:55 GMT

టిటిడి పాలకమండలి సమావేశం తిరుమలలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 60 అంశాల అజెండాపై చర్చించనున్నారు. ఇందులో మూడు అంశాలపై కీలకంగా చర్చించడానికి అవకాశం ఉన్నట్టు టీటీడీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.

దేశంలోనే మొదటిసారి ఆలయ ధ్వజ స్తంభాల కోసం టీటీడీ దివ్య వృక్షాల ప్రాజెక్టు 100 ఎకరాల్లో చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును పలమనేరు సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వదేశీ గోసంవర్ధన సంస్థ ఆవరణలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు సారధ్యంలో పాలకమండలి సమావేశమైంది. నిర్ణీత అజెండాలో ప్రధానంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై కార్యాచరణ సిద్ధం చేయనన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు
తిరుపతి నుంచి తిరుమలకు రోప్ వే వేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
తిరుమలకు రోప్ వే వేయడం అనేది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని అభ్యంతరాలు పదేళ్ల కిందటే వ్యక్తం అయ్యాయి. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ అంశంపై పాలకమండలిలో చర్చించడానికి అజెండా సిద్ధం చేసినట్లు టిటిడి అధికార వర్గాల ద్వారా తెలిసింది.
టీటీడీ పరిధిలో తిరుపతి, తిరుమలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో 60 ఆలయాలు ఉన్నాయి. రానున్న కాలంలో ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలో శ్రీవాణి ట్రస్టు నిధులతో ఐదు వేల ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటితోపాటు భవిష్యత్తులో నిర్మించే ఆలయాల వద్ద ధ్వజస్తంభాలకు ఇబ్బంది లేకుండా 100 ఎకరాల్లో టీటీడీ దివ్య వృక్షాల ప్రాజెక్టు చేపట్టడానికి పలమనేరు సమీపంలోని గోశాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.
చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద సుమారు 15 సంవత్సరాల కిందట 450 ఎకరాల్లో టీటీడీ గోశాల ఏర్పాటు చేసింది. ఇక్కడ సంప్రదాయ గోజాతుల సంరక్షణ, సంతానోత్పత్తికి అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఒక నాలెడ్జ్ గా తీర్చిదిద్దారు. టీటీడీ దివ్య వృక్షాల ప్రాజెక్టు ప్రారంభించడానికి పాలక మండల సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
శ్రీ వాణి ట్రస్ట్ ఆలయాలు
తిరుమలలో ప్రారంభమైన పాలకమడల సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణాలకు సంబంధించి విధివిధానాలు రూపకల్పన చేసే అంశంపై కూడా చర్చించనున్నారు. అలాగే తిరుమలలో కాటేజ్ నిర్వహించే దాతలకు కల్పించే ప్రయోజనాలు నిర్వహణపై కూడా సమగ్ర విధానాన్ని అమలు చేయడానికి వీలుగా తీర్మానాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Tags:    

Similar News