మఠాధిపతుల మౌనం అధర్మానికి సంకేతం కాదా?

తెలుగు రాష్ట్రాల సీఎంలకు పీఠాధిపతులు రాజగురువులుగానే ఉంటారా? తిరుమల లడ్డూ అపవిత్రతపై నోరు మెదపరా? ఇది అధర్మానికి సంకేతం కాదా? అని సంఘాలు నిలదీస్తున్నాయి.

Update: 2024-09-25 02:52 GMT

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో రాజకీయ పార్టీలు శ్రీవారి ఔన్నత్యాన్ని రచ్చకీడ్చారు. ఇంత జరుగుతున్నా ధార్మిక ప్రచవనాలు వినిపించే ఒక్క స్వామీజీ కూడా కనిపించడం లేదు. కనీసం ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. స్వామీజీలు చేయాల్సిన క్రతువును డిప్యూటీ సీఎం కొడిదెల పవన్ కల్యాణ్ చేపట్టారు. అందులో కొంతకూడా పీఠ, మఠాధిపతుల నుంచి స్పందన లేకపోవడం వెనేక ఆంతర్యం ఏమిటనేది తెలియని పరిస్థితి.

స్వామివారి ప్రాశస్త్యాన్ని, ఆగమ సలహాలు ఇచ్చే వారి మౌనం దేనికి సంకేతం? తిరుపతి, తిరుమలలో అనేక మఠాలు, పీఠాధిపతుల సత్రాలకు కొదవలేదు. ఉత్తర భారతదేశంతో పాటు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతంతో పాటు విశాఖ శారదాపీఠం కూడా అత్యంత ప్రధానమైనది.
ఈ పీఠాలకు తిరుమలలో ప్రత్యేకంగా మఠాలు కూడా ఉన్నాయి. కేటాయించిన స్థలాలకు మించి, ఆక్రమణలతో భారీ భవంతులు నిర్మించుకున్న వారంతా తిరుమలలో ఎక్కువ రోజులు అనడం కంటే, ఏడాదిలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో కూడా శ్రీవారి చెంతకు మాత్రం రావడం లేదు. ఈ విషయం పక్కన ఉంచితే, తిరుమల లడ్డూ వివాదంపై ఒక్క స్వామీజీ కూడా ఎందుకు మాట్లాడడం లేదు. అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఏడు నెలల వెనక్కి వెళదాం..
మఠాలకు నిలయం

తిరుమల కొండపై ఉన్న మఠాలకు చారిత్రక నేపథ్యం ఉంది. వైష్ణవ సంప్రదాయంలోని పీఠాధిపతులకు 2004 వరకు కర్ణాటకలోని మైసూరులోనిపెజావర్, శృంగేరి, హంపి, తమిళనాడులోని కంచి, శ్రీరంగం కడప జిల్లా పుష్పగిరి, అహోబిలం పీఠాధిపతులతో సహా 18 మఠాలు మాత్రమే మఠాలు ఉండగా, ఆ సంఖ్య 33కు చేరింది. ఆ తరువాత రాజకీయ ప్రేరేపిత సిఫారసు నేపథ్యంలో వేలూరు బంగారు అడిగళార్ మఠం కోసం అమ్మ భగవాన్కు కు కూడా మఠం నిర్మాణానికి స్థలం కేటాయించారు. వీటితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా పోటీ పడడం వల్ల ఆ సంఖ్య దాదాపు 50కు చేరింది. 1980కు ముందు వరకు తిరుమల ఆలయ మాడవీధుల్లో మాత్రమే ఈ మఠాలు ఉండేవి. ఇక్కడ విడిది చేసే పీఠాధిపతులు ధార్మిక ఉపన్యాసాలు, భక్తులకు ఆశీర్వచనాలు అందించే వారు. మాస్టర్ ప్లాన్ అమలుతో మాడవీధుల్లోని మఠాలు, నివాసాలను ఖాళీ చేయించారు. వారికి పాపవినాశనానికి వెళ్లే మార్గంలోని గోగర్భం డ్యాం వద్ద కూడా స్థలాలు కేటాయించారు. దత్తపీఠం, విశాఖ శారదాపీఠంతో పాటు కర్ణాటక మఠాల నిర్మాణంలో ఉన్నాయి. వీటి నేపథ్యంలో
ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు మౌనంగా ఎందుకు ఉన్నారనేది కూడా చర్చకు వచ్చింది.
సదస్సుతో దిశానిర్దేశం

2024ఫిబ్రవరి 3: మూడు రోజుల పాటు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మొదటిరోజు సదస్సుకు వచ్చిన 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. ఈ విద్వత్ సదస్సుకు ఎవరు వచ్చారంటే...


తిరుమలపెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి స్వామితో పాటు టీటీడీ ఆహ్వానంపై గళూరు శ్రీవ్యాసరాజ మఠానికి చెందిన విద్యాశ్రీషతీర్థ స్వామీజీ, కుర్తాళం మౌనస్వామి మఠానికి చెందిన సిద్ధేశ్వరానంద భారతిస్వామి, తిరుపతి రాయలచెరువుకు చెందిన భారతి శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద, విజయవాడ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి, భీమవరం భాష్యకార సిద్ధాంత పీఠం రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీలలితా పీఠం స్వరూపానందగిరి స్వామి, ఏర్పేడు వ్యాసాశ్రమం నుంచి పరిపూర్ణానందగిరి స్వామి, కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య మఠానికి చెందిన విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉన్నారు. 

కడప బ్రహ్మంగారిమఠం విరజానంద స్వామి, గుంటూరు విశ్వయోగి విశ్వంజి, తుని తపోవనానికి చెందిన సచ్చిదానంద సరస్వతి స్వామి, నెల్లూరుకు చెందిన సత్యానంద ఆశ్రమం హరితీర్థ స్వామీజీ, విజయవాడలోని జ్ఞాన సరస్వతి పీఠం నుంచి ప్రకాశానంద సరస్వతి స్వామి, తేనెపల్లికి చెందిన చైతన్య తపోవనం మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద, ప్రొద్దుటూరుకు చెందిన శివ దర్శనం మాతాజీ, ఉత్తరకాశీకి చెందిన స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి, విజయవాడకు చెందిన చిదానంద ఆశ్రమం సత్యానంద భారతి, గుంటూరుకు చెందిన శైవక్షేత్రం శ్రీ శివ స్వామి, హైదరాబాదుకు చెందిన దేవనాథ రామానుజ జీయర్ స్వామి, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి. శ్రీవారి దర్శనానికి వస్తే, వారికి దక్కే గౌరవం ఏ స్ధాయిలో ఉంటుందంటే..
వీవీఐపీలకు దీటుగా..

దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రొటోకాల్ ఉంటుంది. సీజేఐ పీఎం, సీఎం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి వంటి ప్రముఖులు, శ్రీవారి దర్శనానికి వస్తే, ఆలయ మహద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం లభిస్తుంది. వెండిపళ్లెంలో స్వామివారి లడ్డూ ప్రసాదం ఉంచి ఆలయ ప్రధాన అర్చకుడు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించడం ఆనవాయితీ. ఆ తరహాలోనే దేశంలోని కంచి, విశాఖ శారదాపీఠం, ఉడిపి, మైసూరు, కంచి, బెంగళూరు దత్తపీఠం, హంపీ, వేలూరు బంగారు ఆలయ మఠాధిపతి అమ్మ వంటి మఠాధిపతులకు ప్రత్యేక స్వాగతం ఉంటుంది. అందులో రెండు రకాలు ఉంటాయి. వారి వచ్చిన సమయంలో..
పెద్దమర్యాద తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో పీఠాదిపతులకు వేదపండుతులు ఎదురేగి, శ్రీవారికి సమర్పించిన గొడుగుల నీడను మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం ఆలయంలోకి వెంట తీసుకుని వెళతారు. వారు శ్రీవారి మూలవిరాట్టుగా వింజామరలు విసురుతూ, సేవచేసే అవకాశం ఉంటుంది.

చిన్న మర్యాద దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులకు ఆలయం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం, స్వామివారి దర్శనం, సేవ చేసే అవకాశం ఉంటుంది. పీఠాలు, మఠాల్లో ఉంటూ ధార్మిక ప్రవచనాలతో పాటు ఆధ్యాత్మికత చాటడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు. ఇది వారి దైనందిన కార్యక్రమంలో భాగమే.
ఈ సదస్సులో సూచనలు చేసిన విజయవాడలోని శ్రీపరమాత్మానందాశ్రమ పీఠాధిపతి ప్రకాశనంద సరస్వతి స్వామీజీ ఏమన్నారంటే...
"నేను ప్రస్తుతం రిషికేష్ లో ఉన్నాను. శంకాచారర్య పరంపరగా ఆధ్మాత్మిక ప్రవచనాలు చేసే వారు మాత్రమే రిషికేష్ లో మూడు రోజుల సదస్సు నిర్వహించాం. తిరుమలలో జరిగిన అపచారంపై చర్చించాం" అని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు. "శంకారాచార్యుని ప్రతినిధులుగా వారసత్వాన్ని కొనసాగించే మేము నిరసనలకు ఆస్కారం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని నిర్ణయించాం" అని ప్రకాశనంద సరస్వతి స్వామీజీ స్పష్టం చేశారు.
మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించకపోవడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరశర్మ తప్పుపట్టారు.
రాష్ట్రంలోని తెలుగు పీఠాధిపతుల తీరుపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరశర్మ గుంటూరులో మాట్లాడుతూ, తీవ్ర ఆక్షేపణ తెలిపారు. "తెలుగు రాష్ట్రాల్లో పెట్టుడు పీఠాలు పెట్టుకున్న చిన్న జీయర్ స్వామిజీ, విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ, సాత్వామనంద స్వామీజీలు ఈ విషయం మీద ఎందుకు నోరు మెదపట్లేదు" అని నిలదీశారు.
"ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా, స్వాములు స్పందించరు. ఇది వారి అధర్మ మార్గానికి సంకేతమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో తెలంగాణ, ఏపీలో మాజీ సీఎంలకు రాజగురువులుగా వ్యవహరించిన చిన్నజీయర్ స్వామి, విశాఖ శారదాపీఠం స్వరూపానందస్వామి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారంపై ఖండించండి" అని కూడా డిమాండ్ చేశారు.
వాస్తవంగా మాఠాలు, పీఠాధిపతుల తీరు తరచూ వివాదమైన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ కాలంలో విశాఖ శారదాపీఠం విస్తరణ స్థలం ఆక్రమణ జరిగిందనే విషమయంతో పాటు, పీఠానికి కల్పించిన భారీ సెక్యూరిటీని టీడీపీ కూటమి వచ్చిన తరువాత తొలగించిన విషయం తెలిసిందే.

విశాఖ శారదాపీఠం ఆక్రమణలపై శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురానికి చెందిన ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ పరిశీలన జరిపారు. " ఆ ఆక్రమణలు తొలగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలలో ఆ మఠం నిర్మాణానికి మంజూరు చేసిన స్థలానికి మించి ఆక్రమించారు" దీనిని రద్దు చేయాలి" అని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ధర్నా కూడా చేశారు.
మొత్తం మీద పరిశీలిస్తే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలను పీఠాధిపతులు ఆశీర్వచనాలు అందిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో "తిరుమల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఎందుకులే" అని పీఠాధిపతులు భావిస్తున్నట్లు ఉందని తిరుమల వ్యవహారాలు దగ్గరగా తెలిసిన సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.
మఠాలు వదలిరండి
తిరుమలలో మఠాలు కట్టుకుని వ్యాపారం చేయడం కాదు. శ్రీవారి ఆచార, వ్యవహారాల్లో అపచారం జరిగినప్పుడు స్పందించాలి అని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ సూచించారు. " తిరుమల లడ్డూ ప్రసాదం తిరుపతి వాసులకు ఎమోషన్, శ్రీవారి ప్రసాదంతో దేశంలో ఏపనైనా భక్తి భావంతో చేసుకుంటాం" అని అన్నారు. " శ్రీవారి లడ్డూ అపవిత్రంతో అపచారం జరిగితే మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు. ఇలాంటి మహాపాపం జరిగినప్పుడు స్పందించరా?" అని ప్రశ్నించారు.
" మాజీ సీఎం వైఎస్. జగన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఏ తప్పు చేయలేదని భావిస్తే, తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలి" అని కిరణ్ రాయల్ సవాల్ చేశారు.
మొత్తానికి ఈ ఎపిసోడ్ లో తిరుమల లడ్డూ వ్యవహారంపై మఠాథిపతులు స్పందించకపోవడం అనేది ప్రధాన అంశంగా మారింది. దీనిపై ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే. వారి పర్యటనలు బహిరంగంగా ఉండవు, మీడియాకు కూడా అందుబాటులో ఉండరనేది గమనించతగిన విషయం.
Tags:    

Similar News