సెలబ్రిటీలతో సందడిగా మారిన పుట్టపర్తి..

సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-19 11:24 GMT
ప్రశాంతి నిలయంలో ప్రధాని నరేంద్రమోదీతోొ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీెఎం పవన్ కల్యాణ్

రాయలసీమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం. అందులో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం కూడా ఒకటి. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఓకేసారి రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీల రాకతో మరింత సందడిగా మారింది.

పుట్టపర్తి ప్రశాంత అధ్యాత్మిక వాతావరణం పెట్టింది పేరు. అందుకే ప్రపంచ దేశాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, పర్యాటకుల తాకిడి ఎక్కువ. నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కావడంతో పుట్టపర్తిలో మరింత రద్దీ పెరిగింది.

సత్యసాయి శతజయంతి వేడుకలను టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. దీంతో పుట్టపర్తి జిల్లా యంత్రాంగం తోపాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సారధ్యంలోని మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటు చేసింది. సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయం, సత్య సాయి మహాసమాధి ఉన్న సాయికుల్వంత్ హాల్,  పరిసర ప్రాంతాలు, హిల్ వ్యూ స్టేడియం ను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పుట్టపర్తిలో నాయకుల హడావుడి

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు పోటెత్తారు. ఒకసారి సెలబ్రెటీలు రావడం మరింత రద్దీకి అవకాశం ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య బచ్చన్ రాకతో పాటు డ్రమ్స్ శివమణి చేరుకున్నారు. వాయిద్య విన్యాసాలతో ఊర్రూతలూగించారు. సత్యసాయి వేడుకలకు వచ్చిన యాత్రికులకు మించే ప్రముఖుల రాకకోసం వచ్చిన వారితో పుట్టపర్తి కిటకిటలాడుతోంది.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వచ్చారు. సినీ కథానాయకుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తోపాటు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్సవాలకు హాజరయ్యారు. రాష్ట్ర, కేంద్ర మంత్రులు కూడా పెద్ద సంఖ్యలోనే పుట్టపర్తికి వచ్చారు.
ప్రత్యేక ఆకర్షణ

 బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హిల్వే స్టేడియంలో జరిగిన వేదికపై వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థినిగా తాను నేర్చుకున్న, తెలుసుకున్న అంశాలను ఐశ్వర్య బచ్చన్ గుర్తు చేసుకున్నారు.
"విలువలతో కూడిన విద్య నేర్చుకున్న. సత్య సాయి బోధనలు విన్నాను. నా జీవితంలో అవే పాటిస్తున్న" అని మాజీ విశ్వసుందరి తన మనసులోని భావాలను పంచుకున్నారు.
బాల్యం నుంచి అనుబంధం

సత్య సాయితో తనకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని, దివ్యానుభూతులను సచిన్ టెండూల్కర్ సాయి భక్తులతో పంచుకున్నారు.
"నాకు చిన్న బాల్యం నుంచే సత్యసాయితో ఒక దైవ సంబంధమైన అనుబంధం ఉంది" అని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ..
"ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా ఆసక్తిగా చూసేవారు. ఈ బాలుడిలో బాల సత్య సాయిబాబా ఉన్నాడు అనేవారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగేది" అని సచిన్ టెండూల్కర్ తాను బాల్యంలో ఉండగానే జనం సత్యసాయిబాబా తో పోల్చిన విషయాన్ని మర్చిపోలేనని అన్నారు.
1990 లో బెంగళూరు వైట్ ఫీల్డ్ లో భగవాన్ సత్య సాయి బాబా దర్శనం తీసుకున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ
"మన మనసులో ఏముందో? ఏ సందేహం ఉందో సత్యసాయి ముందుగానే గ్రహించి చెప్పేవారు. ఇది నమ్మశక్యం కాకపోయినా సరే. నేను అనుభవించిన సత్యం" అని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు.
2011 వరల్డ్ కప్ సందర్భంగా నా జీవితంలో మరిచిపోవాలని ఘట్టం ఉందని టెండూల్కర్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.
"వరల్డ్ కప్ సమయంలో ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఒత్తిడి కూడా ఉంటుంది. బెంగళూరులో మా టీం ఉన్నప్పుడు సత్యసాయి బాబా నుంచి ఫోన్ వచ్చింది. నీకు ఒక పుస్తకం పంపించాను అని చెప్పారు. ఆ పుస్తకం నాలో అచంచలమైన విశ్వాసాన్ని పెంచింది" అని సచిన్ టెండూల్కర్ భావోద్వేగంగా తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.
ఈ సభలోనే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ మాట్లాడారు.

అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సత్యసాయి ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ ఉన్న వ్యక్తి అన్నారు. ఈ ప్రాంతంలో ప్రజల దాహం తీర్చేందుకు సత్యసాయి చేసిన కృషి గొప్పదన్నారు. ఆయన ప్రాజక్టే  జల్ జీవన్ మిషన్ కు ప్రేరణ అయిందని పవన్ కల్యాణ్ అన్నారు. విదేశీయుల ఇళ్లలో చిత్రపటం ఉంచుకునే విధంగా సత్యసాయి శాంతి సందేశం, ప్రేమను విశ్వవ్యాపితం చేశారని ఆయన అన్నారు.

విరిసిన కళలు

సత్యసాయి శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలతో హిల్ వ్యూ స్టేడియం కిక్కిరిసింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ఎన్. చంద్రబాబు, సెలబ్రిటీల్లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య బచ్చన్, మంత్రులు ప్రదర్శనలు చూస్తూ ఆనందపడ్డారు.

తమిళనాడు నుంచి బాహుబలి డ్రమ్ముపై విన్యాసాలు ప్రదర్శించే సమయంలో డప్పు కళాకారుల ప్రదర్శన అలరించింది.

డప్పు కళాకారులను హుషారెక్కిస్తూ, డ్రమ్స్ శివమణి తెల్లటి దుస్తుల్లో వేదికపై తళుక్కుమన్నారు. నడుముకు డ్రమ్మ్ అమర్చుకున్న శివమణి స్టిక్స్ తో లయబద్దంగా దరువు వేస్తూ, చేసిన విన్యాసాలు రక్తికట్టించారు. వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ప్రముఖులు కూడా శివమణి డ్రమ్స్ విన్యాసాలకు తగినట్టు తాళం వేస్తూ కనిపించారు.

పుట్టపర్తికి ప్రముఖుల రావడం వల్ల ప్రశాంతినిలయం పరిసరాలు కిటకిటలాడాయి. కళాకారుల ప్రదర్శనలతో యాత్రికులకు  కళాకారులు కనువిందు చేస్తున్నారు.


Tags:    

Similar News