నేనూ రైతు బిడ్డనే

ప్రతి ఎకరాకు నీళ్లు అందించి ఏపీని కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌ మార్చడమే తన సంకల్పమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Update: 2025-11-19 12:06 GMT

తానూ రైతు బిడ్డనే అని, రైతుల కష్ట, నష్టాలు తనకు తెలుసని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నదుల అనుసంధానం పూర్తి చేసి, రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగుభూమికీ నీళ్లు అందించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో బుధవారం జరిగిన అన్నదాతా సుఖీభవ – పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల రెండో విడత విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్‌ చేశాం: చంద్రబాబు

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ హిట్ అయ్యాయని సీఎం గర్వంగా ప్రకటించారు. ‘‘ఇప్పటివరకు 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పున జమ చేశాం. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించినా, మా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. ఇదే మా చిత్తశుద్ధికి నిదర్శనం’’ అని ఆయన అన్నారు.

రైతు బిడ్డగా.. రైతుల బతుకు మార్చే పంచసూత్రాలు

‘‘నేనూ రైతు బిడ్డనే. మా నాన్నకు వ్యవసాయంలో సాయం చేసిన అనుభవం ఉంది. పాత పద్ధతులతో వ్యవసాయం చేస్తే రైతుకు నష్టమే. డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి, ఎగుమతులు చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ముందుంటేనే భవిష్యత్తు ఉంటుంది’’ అని సీఎం సూచించారు. రైతుల అభివృద్ధికి పంచసూత్రాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు.

నదుల అనుసంధానం.. కరవు రహిత రాష్ట్రమే లక్ష్యం

‘‘కృష్ణా, గోదావరి సహా అనేక నదులు మనకు ఉన్నాయి. నదుల అనుసంధానం ద్వారా అన్ని రిజర్వాయర్లు నింపితే.. ఒక ఏట వర్షం లేకపోయినా నీళ్ల బ్యాలెన్స్ ఉంటుంది. అన్ని చెరువులు నింపాలి, భూగర్భజలాలు పెంచాలి. భూమిని ఒక జలాశయంగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా సంకల్పం’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. అభివృద్ధికి బలం

విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి వేగంగా సాగుతోందని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News