Revanth afraiding|రేవంత్ ప్రభుత్వం భయపడుతోందా ?

స్ధానికసంస్ధల ఎన్నికల(Local body elections) నిర్వహణవిషయంలో ప్రభుత్వం వెనకాముందు ఆలోచిస్తోంది.;

Update: 2025-01-27 04:30 GMT

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల(Local body elections) నిర్వహణవిషయంలో ప్రభుత్వం వెనకాముందు ఆలోచిస్తోంది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో తేల్చుకోలేకపోతోంది. రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీల పాలకవర్గాలపదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఇందులో 121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లున్నాయి. స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రేవంత్, మంత్రులు చాలా ప్రకటనలు చేశారు. ఆమధ్య రెవిన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti) మాట్లాడుతు జనవరిలోనే స్ధానిక ఎన్నికలు నిర్వహిస్తామని బల్లగుద్దకుండా ప్రకటించారు. మంత్రులు పొన్నంప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటివాళ్ళయితే జనవరి-ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరుగుతాయని చాలాసార్లు చెప్పారు.

జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన మంత్రులు ఎవరూ ఇప్పుడు నోరిప్పటంలేదు. ఎందుకంటే తాముచెప్పినట్లుగా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని వాళ్ళకు స్పష్టంగా అర్ధమైపోయింది. ఇందుకు మొదటి కారణం ఏమిటంటే బీసీ రిజర్వేషన్లు(BC Reservations) ఎంతన్నది తేలకపోవటం. రెండో కారణం ఏమిటంటే సంక్షేమపథకాల విషయంలో గ్రామీణప్రాంతాల్లోని జనాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోతోంది. ఈమధ్యనే గ్రామాల్లో పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభల్లో ఎంత రచ్చరచ్చయ్యిందో అందరు చూసిందే. ఇందిరమ్మ(Indiramma) ఆత్మీయభరోసా, కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు, రైతుభరోసా డబ్బులు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాల్లో లబ్దిదారుల ప్రకటన కోసం గ్రామసభలు జరిగాయి. ఈ సభలు జరిగిన చాలాగ్రామాల్లో పెద్ద గొడవలే జరిగాయి.

అధికారులు ప్రకటించిన జాబితాలపై గ్రామస్తుల్లో చాలామంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తంచేశారు. గ్రామసభలు నిర్వహించకుండా లబ్దిదారుల ఎంపిక విషయంలో అభ్యంతరాలను తీసుకోకుండా ఏకపక్షంగా లబ్దిదారుల జాబితాను తయారుచేయటం ఏమిటని జనాలు ప్రభుత్వంపై మండిపోయారు. పై నాలుగు పథకాల్లో కూడా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక, రేషన్ కార్డుల జారీ విషయంలోనే చాలా గొడవలైపోయాయి. దాంతో చేసేదిలేక, గ్రామస్తులకు సమాధానాలు చెప్పలేక చివరకు అధికారులు గ్రామసభలను ముగించేశారు. గ్రామస్తుల అల్లర్లవెనుక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) నేతలున్నారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలుగా మాత్రమే వినబడుతున్నాయి. ఎందుకంటే లబ్దిదారుల జాబితాఎంపికను ప్రభుత్వం పక్కాగా చేసుంటే గ్రామసభల్లో గొడవలకు పెద్దగా అవకాశాలు ఉండేవికావు.

గ్రామసభల్లో లబ్దిదారులను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండేదికాదు. ఏ ప్రభుత్వంలో లబ్దిదారుల జాబితాలు తయారైనా నూటికి నూరుశాతం కరెక్టుగా ఉండదని అందరికీ తెలిసిందే. ఇపుడు తాము తయారుచేసిన లబ్దిదారుల జాబితాలో ఎక్కువ తప్పులున్నాయని గ్రామస్తులు గొడవలు చేశారంటే తాము తయారుచేసిన జాబితాలను అధికారులు ఒకాసారి చెక్ చేసుకుని సరిచేసుకుంటే బాగుంటుంది. పథకాల లబ్దిదారుల జాబితాలు అవకతవకలతో తయారైంది కాబట్టే చాలాచోట్ల గొడవలయ్యాయి. లబ్దిదారుల ఎంపిక తప్పుగా తయారైందికాబట్టి తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవేజాబితాలతో లబ్దిదారుల ఎంపిక ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తే జనాల్లో వ్యతిరేకత ఏస్ధాయిలో ఉంటుందో ప్రభుత్వం అంచనా వేయలేకపోతోంది.

అందుకనే లబ్దిదారుల ఎంపికను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని వీలైనంతలో లబ్దిదారుల జాబితాలను తప్పులులేకుండా తయారుచేస్తేకాని జనాల్లో ఆగ్రహం తగ్గదు. అలాజరగాలంటే లబ్దిదారులఎంపిక గ్రామసభల్లో బహిరంగంగా జరగాలి. ఇదంతా జరగాలంటే సమయంపడుతుంది. అందుకనే మంత్రులు చెప్పినట్లుగా జనవరిలో ఎన్నికలు జరగలేదు. ఫిబ్రవరిలో జరుగుతాయనే నమ్మకాలు కూడా లేవు. తాజా పరిణామాలను గమనిస్తే లబ్దిదారుల జాబితాలు పక్కాగా తయారవ్వాలంటే కనీసం మూడునెలలు పట్టేట్లుంది. జాబితాలను తయారుచేసిన తర్వాత నెత్తిపగిలిపోయే మేనెల ఎండల్లో కాకుండా జూన్ లో నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రేవంత్(Revanth) లో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం.

బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కూడా ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. రిపోర్టును స్టడీచేయటానికి మంత్రులతో కమిటివేసి తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని రేవంత్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఇదంతా జరగాలంటే ఎంతలేదన్నా ఏప్రిల్-మేనెల అయిపోతుంది. ఒకవైపు బీసీ కమిషన్ రిపోర్టుపై చర్చలు, నిర్ణయం, మరోవైపు లబ్దిదారుల ఎంపికకోసం గ్రామసభల నిర్వహణ అయ్యేటప్పటికి మే నెల అయిపోతుంది. అందుకనే స్ధానికసంస్ధల ఎన్నికలు మేనెల తర్వాతే జరగచ్చని ఒక అంచనా.

Tags:    

Similar News