పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మార్గదర్శకాలు
రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపునకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి.;
పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో ఇంటి పట్టా ఇస్తారు. ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇంటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు ఇంటిని, లేదా స్థలాన్ని కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయి.
అర్హత ఉన్న వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలి. ప్లాటు ను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడా చూస్తారు.
అర్హతలు ఇవే ...
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం ఉండకూడదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్ధలం పొంది ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదు.
అయిదు ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు, లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉంటే అర్హులు.
ఇప్పటికే ఇంటి స్థలం కేటాయించి, కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట ఇంటి స్థలం ఇస్తారు. ఇంటిస్థలం పొంది ఉండి ఇల్లు నిర్మించకుండా ఉంటే వారికి ఆ ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరే చోట ఇస్తారు.
గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లబ్దిదారుల ఎంపిక ...
విలేజ్, వార్డు స్ధాయిలో ధరఖాస్తు చేసుకోవాలి.
వీఆర్వో, ఆర్ఐల ద్వారా విచారణ చేయించాలి.
లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి.
తుది జాబితాను తహశీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ లకు పంపాలి.
లబ్ధిదారులకు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామల్లో భూమి పరిశీలించి స్ధలం కేటాయింపుకు కలెక్టర్‌కు ప్రభుత్వం అధికారం ఇచ్చింది.
ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండేళ్లలో నిర్మాణం చేపట్టని సైట్స్‌ను రద్దు చేసే అధికారాన్ని రెవెన్యూ అధికారులకు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.