TTD STAMPEDE | టీటీడీలో ఎవరి తల 'తెగుద్దీ'? చంద్రబాబు ఏం చేస్తాడు?
చంద్రబాబు సమక్షంలో నువ్వెంతంటే నువ్వెంతని ఇద్దరు బాధ్యతాయుతమైన వ్యక్తులు తిట్టుకున్నారంటే టీటీడీ పాలకమండలిలో అసలేం జరుగుతోంది.. ఎందుకిలా?;
By : Amaraiah Akula
Update: 2025-01-10 06:18 GMT
వ్యవస్థలకన్నా వ్యక్తుల ప్రాబల్యం పెరిగినపుడు అనర్థాలు తప్పవు. వ్యక్తుల కలయికే వ్యవస్థ (System). వ్యవస్థలో ఒక వ్యక్తి మంచి మనసుతో పని చేస్తే మొత్తం ఆ వ్యవస్థే పరుగులు పెడుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అదే వ్యవస్థకు మచ్చ వస్తుంది.
ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సరిగ్గా అదే జరుగుతోంది. పలానా అధికారి బాగా పని చేస్తారు, ఆయన చేతుల్లో టీటీడీని పెడితే బాగుంటుందని భావించి ప్రభుత్వం ఓ అధికారికి బాధ్యత అప్పగించింది. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వేతర రాజకీయ నియామకాన్నీ చేసింది. ఒకటి వ్యవస్థీకృతం, మరొకటి రాజకీయం. ఈ రెండింటి మధ్య సమన్వయం లేని ఫలితమే తిరుపతి తొక్కిసలాట. ఆరుగురు అమాయక భక్తుల మరణం. పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు. దీంతో తిరుమల ప్రతిష్టకు భంగం వాటిల్లింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. టీటీడీ పాలకవర్గాన్ని సంస్కరించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఐదుగురు అధికారులను బదిలీ చేసింది. తొందర్లో టీటీడీ పాలకమండలి పెద్ద తలకాయల్లో ఎవరో ఒకర్ని మార్చే దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 9న తిరుపతిలో చేసిన సమీక్షా సమావేశం చెప్పిన మాటలు, చేసిన హెచ్చరికలు అటువంటి సంకేతాలనే ఇస్తున్నాయి.
సమన్వయ లోపం..
తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగిందనే స్పష్టమైంది. ఈ ఘటనతో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైసీపీ, వామపక్ష పార్టీల నాయకులు తిరుపతికి క్యూ కట్టడం, ప్రాంతీయ, జాతీయ మీడియా యావత్తు అక్కడే కేంద్రీకరించడంతో సమస్య విశ్వవ్యాప్తమైంది.
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.5లక్షలు వంతున పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం వచ్చి... తిరుపతి నగరం బైరాగపట్టెడలో పద్మావతి పార్క్ వద్ద భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటకు పోలీసు అధికారులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమేనని ప్రాధమిక విచారణలో తేలింది. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు లక్షల సంఖ్యలో జనం వస్తారని తెలిసినా అటు పోలీసు ఇటు టీటీడీ వారు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారు. డీఎస్పీ తాను చేయాల్సిన పని చేయలేదు. జేఇవో విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఈ సమన్వయ రాహిత్యాన్ని సాకుగా తీసుకుని కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఫలితం అమాయక భక్తులు వైకుంఠానికి చేరుకున్నారు.
తిరుపతి కలెక్టరు, ఎస్పీ కూడా ఇంత జరుగుతుందని ఊహించకపోవడం, అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షించాల్సిన టీటీడీ ఇవో, టీటీడీ ఛైర్మన్ కేవలం సమీక్షలకు, ఆదేశాలు ఇవ్వడానికి పరిమితం అయ్యారు. ఎవరేమి చేస్తున్నారో, టికెట్ కౌంటర్ల దగ్గర ఏమి జరుగుతుందో చూడకపోవడం కూడా తొక్కిసలాటకు కారణమైంది.
ఎవరేమన్నారు?
అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ దుర్ఘటన వెనుక ఘోర వైఫల్యం కనిపిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. జరిగిన సంఘటనకు చేతులెత్తి దండం పెట్టి క్షమించమని వేడుకుంటున్నానని జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర డెప్యూటీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ మొత్తం సంఘటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టను అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
అసలేం జరుగుతోంది?
టీటీడీ, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ దుర్ఘటనకు కారణమని అందరూ తేల్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా సీఎం సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ దుర్ఘటన జరగకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నా వీరి అహం, ఎవరు చెబితే ఎవరు వినాలనే దానిపై పంతాలకు పోవడంతో ఈ ఘటన జరిగింది.
సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత లేదనేది వాస్తవం. ప్రముఖులకే తిరుమలలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. టీటీడీ అధికార యంత్రాంగం వీఐపీల సేవలో తరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పకనే చెప్పారు. ప్రణాళిక బద్ధంగా వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు సామాన్య భక్తులకు అందచేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
నువ్వెంతంటే నువ్వెంత?
తిరుపతి దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తామని చెప్పిన మరుక్షణంలో టీడీడీ ఇవో, చైర్మన్ కి మధ్య ఘర్షణ జరగడం గమనార్హం.
‘‘ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదు. చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు. ఏ చిన్న విషయాన్నీ నాతో చర్చించడం లేదు. మీరైనా కాస్త చెప్పండి’’ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘నీకేం చెప్పడంలేదు. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా’ అంటూ చైర్మన్‌పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరూ ‘నువ్వు’ అంటే ‘నువ్వు’ అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు, సీఎం విస్మయానికి గురయ్యారు.
సరిగ్గా ఈ దశలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని... ఈవోను మందలించారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి మన అందరికీ బాస్. ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా? శ్రీవాణి ట్రస్టులో అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి. ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు!’’ అని అభ్యంతరం తెలిపారు.
అప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుని ‘సత్యప్రసాద్ నువ్వు ఆగు’ అంటూ... ఈవో, చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా పద్ధతి? మీ పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు. మీ ఫ్రస్టేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు? అసలిక్కడ జరిగిందేమిటి? మీరు మాట్లాడుతున్నదేమిటి? ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలి. అది మీకు ఎందుకు సాధ్యపడటం లేదు? నేనూ, చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా? మేం కోఆర్డినేషన్‌లో లేమా? ఒకరితో మరొకరం మాట్లాడుకోవడం లేదా? ఇద్దరం కలిసి పనిచేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఇలా కొట్టుకుంటే ఎలా? ఇదేం భాష? ఇదేం వ్యవహారం. ఇది పద్ధతిగా లేదు. వెంటనే ఆపండి’’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు.
ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహారశైలి కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘‘వాటన్నింటిపై తర్వాత మాట్లాడదాం. ఇది సందర్భం కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం. కానీ మీ పద్ధతి మార్చుకోవాలి. సమన్వయంతో పని చేయాల్సిందే’’ అని సీఎం స్పష్టం చేశారు. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయకతప్పదని హెచ్చరించారు. ఆ దిశగా చర్యలు చేపట్టారు.
ఇప్పుడేం జరగబోతోందీ?
టీటీడీ నిబంధనావళి ప్రకారం భక్తులకు స్వామి వారి దర్శనం వ్యవహారాన్ని జేఇవో చూడాలి. "భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు?" అని TTD జేఈవో గౌతమిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఆమె ఏదో చెప్పబోతుండగానే.. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత లేకుండా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చిన డీఎస్పీపైన కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు.
తప్పు చేసినవారిపై కఠినచర్యలు తప్పవన్న దానికి సంకేతంగా ప్రక్షాళన మొదలైంది. మంచితనాన్ని అలుసుగా తీసుకున్న వారిని వేటు తప్పదన్నట్టుగానే వెంటనే ఓ ఐదుగుర్ని బదిలీలు చేశారు. ముగ్గురు అధికారుల బదిలీకి తిరుపతిలో ఆదేశించగా, సాయంత్రం ఆయన అమరావతికి వచ్చేసరికే బదిలీ ఉత్తర్వులూ (జీఓలు) జారీ అయిపోయాయి. ఇలా వేటు పడిన వారిలో 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయనకు ముఖ్య భద్రతా అధికారి, ప్రస్తుత తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఉన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే చంద్రబాబు ఇక ఎవర్నీ ఉపేక్షించబోరని అర్థమవుతోంది.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అధికారులు కొంత భయభక్తులతో పనిచేశారు. ఇప్పుడు ఆ భయం భక్తీ రెండూ లేకుండా పోయాయి. వ్యవస్థల్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకుని నడిపిస్తున్నారు. సీఎం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టకు ముప్పు వాటిల్లే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇక ఆ పరిస్థితిని ఉపేక్షించబోమని ఐదుగురు అధికారులపై వేటువేయడం ద్వారా సీఎం స్పష్టం చేశారు.
మొత్తం మీద కింద తిరుమలలో సమన్వయం లోపించింది. పై అధికారి చెప్పింది కిందివారు వినడం లేదు. కింది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని పరిశీలించే పద్ధతి లేదు. రాజకీయ నియామకాలతో వచ్చి అధికారులపై పెత్తనం చెలాయిస్తామనే ధోరణిని ఐఎఎస్ లు, ఐపీఎస్ లు సహించడం లేదు. ఆ అధికారి చెబితే నేను వినేదేమిటనే ధోరణి ప్రబలింది. దాంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా టీటీడీ పాలకమండలి తయారైంది. ఆ ఫలితాన్ని భక్తులు అనుభవించాల్సి వస్తోంది. భక్తి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తోంది. దీంతో టీటీడీ ఇవోనో, టీటీడీ ఛైర్మన్నో మారుస్తారనే వాదన వినిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు తాను చేసిన టీటీడీ ఛైర్మన్ నియామకాన్ని రద్దు చేస్తాడని ఊహించలేం.
అంచనా ఉన్నా అధికారులు ఎందుకిలా?
వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులు.. సగటున 80 నుంచి లక్ష మంది వరకు భక్తులు తిరుమల శ్రీవారిని సందర్శిస్తారన్న అంచనా ఉంది. తిరుపతిలో 8 సెంటర్లు.. 90 కౌంటర్లు.. తిరుమలలో 4 సెంటర్లు, ఒక్కో కౌంటర్.. వెరసి 94 కౌంటర్లు.. సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు అన్ని రకాల ప్రివిలైజ్డ్ దర్శనాలను రద్దు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 3వేల మంది పోలీసులు, 1550 మంది టీటీడీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారని ప్రకటించింది టీటీడీ. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రక్షాళన మాత్రం మిగిలే ఉంది.