రేవంత్ అంటే కేటీఆర్, హరీష్ భయపడుతున్నారా ?

కాంగ్రెస్ అధికారంలోకి రావటం అనే విషయంకన్నా రేవంత్ సీఎం అవటాన్ని వీళ్ళిద్దరు జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు.

Update: 2024-11-10 08:59 GMT

మహారాష్ట్ర ప్రజలను తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మోసంచేస్తున్నారు. ఇక్కడి మోసాలు చాలవన్నట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మోసాలు మొదలుపెట్టారు..ఇవి తాజాగా రేవంత్ ను ఉద్దేశించి హరీష్ చేసిన ఆరోపణలు.

తెలంగాణాలో కోలుకోలేని విధ్వసం సృష్టించి విజయోత్సవాలు చేసుకుంటున్నారా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో ప్రజల బతుకు చీలికలు, పీలికలైపోయినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ లోని కీలక నేతలైన కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)ల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎలాగంటే ప్రతిరోజు టైంటేబుల్ పెట్టుకుని పిల్లలు చదువుకున్నట్లుగా వీళ్ళిద్దరు నేతలు ప్రతిరోజు రేవంత్(Revanth Reddy) ను టార్గెట్ చేస్తునే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయి కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఇంకా గట్టిగా చెప్పాలంటే రేవంత్ ముఖ్యమంత్రి అయిన వెంటనే బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావటం అనే విషయంకన్నా రేవంత్ సీఎం అవటాన్ని వీళ్ళిద్దరు జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే అయినదానికి కానిదానికి ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో గోల చేస్తు పదేపదే రేవంత్ ను టార్గెట్ చేస్తునే ఉన్నారు. వీళ్ళు టార్గెట్ చేస్తున్న పద్దతి ఏ విధంగా ఉందంటే రేవంత్ కు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో వీళ్ళ అక్కసు బయటపడిపోతోంది.

సంక్షేమ హాస్టళ్ళల పరిస్ధితులు బాగాలేవని వీళ్ళిద్దరు నానా గోలచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదునెలలకే సంక్షేమహాస్టళ్ళపై గోలచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సంక్షేమహాస్టళ్ళ పరిస్ధితి బాగాలేదంటే పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో కూడా అలాగే ఉన్నట్లు కదా. తమహయాంలో కూడా సంక్షేమ హాస్టళ్ళ పరిస్ధితి అధ్వాన్నంగా ఉందన్న విషయాన్ని మరచిపోయారు. తమ హయాంలో సంక్షేమ హాస్టళ్ళ పరిస్ధితిని బాగుచేయకుండా గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నామన్న స్పృహ కూడా వీళ్ళల్లో కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో జనాలను మోసంచేసి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిందంటు నానా రచ్చ చేస్తున్నారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత రెండుఎన్నికల్లో కేసీఆర్ నోటికొచ్చిన హామీలిచ్చారు. ఆ హామీలను నమ్మిన జనాలు ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టారు. మూడో ఎన్నికకు జనాల భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. దీన్నే వీళ్ళిద్దరు తట్టుకోలేకపోతున్నారు.

కేసీఆర్ ఇచ్చిన హామీల్లో దళితులకు మూడెకరాల భూమి, తెలంగాణా ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి లాంటి హామీలు ఏమయ్యాయో అందరు చూసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలన్నీ ఏ పార్టీ కూడా నూరుశాతం అమలుచేయదని జనాలకు బాగా తెలుసు. ఇచ్చిన హామీల్లో ఏవో నాలుగైదు హామీలకు కనెక్టయి లేదా అధికారపార్టీ ఆగడాలు భరించలేక మార్పు కోరుకుని వేరేపార్టీకి ఓట్లేసి గెలిపిస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా హామీలిచ్చినా సిక్స్ గ్యారెంటీస్(Six Guarantees) కు జనాలు కనెక్టయ్యారు. సిక్స్ గ్యారెంటీస్ లో ఐదింటిని అమలు చేస్తున్న ప్రభుత్వం మహిళలకు నెలకు రు.2500 పెన్షన్ హామీని మాత్రం పెండింగులో పెట్టింది. కేసీఆర్ కూడా ఆచరణ సాధ్యంకాని ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేక ఫెయిలయ్యారు. ఇపుడు కాంగ్రెస్ కూడా అలాగే ఇచ్చిన హామీల్లో సిక్స్ గ్యారెంటీస్ అమలుమీద మాత్రమే దృష్టిపెట్టి మిగిలినవి పక్కనపెట్టేసింది. అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలు సాధ్యమేనా ? ఇది అమలయ్యే హామీకాదన్న విషయం జనాలకు కూడా తెలుసు. సిక్స్ గ్యారెంటీస్ కు కనెక్టయిన జనాలు మిగిలినవి పట్టించుకోకుండా ఓట్లేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారంతే.

ఇక అవినీతి అంశాన్ని జనాలు పట్టించుకోవటం మానేసి చాలా కాలమైంది. కేసీఆర్(KCR) పదేళ్ళ హయాంలో చాలా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కాళేశ్వరం(Kaleswaram), మేడిగడ్డ(Medigadda) ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి, ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణలు జరగుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత పైన కూడా చాలా ఆరోపణలే ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత ఆరుమాసాలు ఢిల్లీ తీహార్ జైలు(Delhi Tihar Jail)లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా కేటీఆర్ పైన ఫార్ముల వన్ కార్ రేసు(Formula 1 Car Race) ఏర్పాటులో రు. 55 కోట్ల అవినీతి ఆరోపణలు అందరికీ తెలిసిందే. తమపైన ఉన్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎదురు రేవంత్ పైన అవినీతి ఆరోపణలతో గోల చేస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎవరి మీద వచ్చినా జనాలు స్పందించటం మానేసి చాలా కాలమే అయ్యింది. మీడియాలో వార్తలు వస్తే ఒకటిరెండు రోజులు మాట్లాడుకుని తర్వాత మరచిపోతున్న కాలమిది.

ఈ విషయాలు కేటీఆర్, హరీష్ కు తెలీవని కాదు. అయినా పదేపదే రేవంత్ పైన ఆరోపణలు, విమర్శలతో ప్రతిరోజు ఎందుకు రెచ్చిపోతున్నట్లు ? ఎందుకంటే పరిపాలనలో రేవంత్ పాతుకుపోతే బీఆర్ఎస్ భవిష్యత్తుకు కష్టమన్న విషయం బాగా తెలుసుకాబట్టే. కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు టీడీపీ, కాంగ్రెస్ ను భూస్ధాపితం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. టీడీపీ విషయంలో సక్సెస్ అయిన కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో ఫెయిలయ్యారు. ఆ ఫెయిల్యూరే ఇపుడు రేవంత్ రూపంలో కేసీఆర్, కేటీఆర్ ను వెక్కిరిస్తోంది, భయపెడుతోంది. తమపదేళ్ళ అధికారంలో కేసీఆర్ ఏమి చేయకూడదో అవన్నీ చేశారు. ప్రత్యర్ధి పార్టీల తరపున గెలిచిన ఎంఎల్ఏలను చీల్చేశారు. బీఆర్ఎస్ లోకి ఫిరాయింపులను ప్రోత్సహించారు. టీడీపీ(TDP)ని నిలువునా ముంచేశారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు అదే పరిస్ధితి ఎదురవుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కోర్టులో కేసులు వేయటమే విచిత్రం. ఫిరాయింపులకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసింది కూడా ఫిరాయింపు ఎంల్ఏలే.

అధికారంలో ఉన్నపుడు యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడి ఇపుడు అదే ఫిరాయింపులను తట్టుకోలేక ఫిరాయింపులు తప్పని బీఆర్ఎస్ కోర్టులో కేసులు వేయటం జోక్ కాక మరేమిటి ? అందుకనే రేవంత్ కు వ్యతిరేకంగా కేటీఆర్, హారీష్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు జనాలు పెద్దగా విలువ ఇవ్వటంలేదు. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతే ఇపుడున్న నేతల్లో చాలామంది పార్టీలో నుండి బయటకు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మరో నాలుగేళ్ళ వరకు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరగవు. ఈలోపు బీఆర్ఎస్ ను రేవంత్ చీల్చి చెండాడేస్తాడేమో అన్న భయమే కేటీఆర్, హరీష్ లో బాగా కనబడుతోంది. అందుకనే ఉనికి కాపాడుకోవటమే టార్గెట్ గా ప్రతిరోజు రేవంత్ ను కేటీఆర్, హరీష్ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతోంది.

Tags:    

Similar News