Liquor scam | తిరుపతి: మద్యం విధానం ఎక్కడ నిర్ణయించారు?

వైసీపీ మాజీ మంత్రి నారాయణస్వామిని పుత్తూరులో విచారణ చేస్తున్న సిట్ బృందం.;

Update: 2025-08-22 08:40 GMT

ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న సిట్ (special investigative team - SIT ) అధికారులు మరోసారి తిరుపతి జిల్లాపై దృష్టి పెట్టారు. అమరావతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఐదుగురు సభ్యుల సిట్ బృందం వైసీపీ మాజీ మంత్రి కే. నారాయణస్వామిని శుక్రవారం విచారణ చేస్తున్నారు. ఆయన నివాసంలో మూడు గంటల నుంచి తనిఖీలు కూడా చేస్తున్నట్లు సమాచారం అందింది.

గంగాధర నెల్లూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కళత్తూరు నారాయణస్వామి పుత్తూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఈ పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి చేరుకున్న ఐదుగురు అధికారుల బృందం నారాయణస్వామి నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి 2019లో వైసిపి ఎమ్మెల్యేగా గెలిచిన కే. నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. తమిళనాడు తరహాలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ దుకాణాల్లో మద్యం కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ కాకుండా నగదు మాత్రమే స్వీకరించడం పై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పెద్ద కుంభకోణం ఉన్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి ఆరోపణలు చేసింది.
అధికారంలోకి వచ్చాక
2024 ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో ప్రధానంగా లిక్కర్ స్కాం లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.
ఈ కేసులో ప్రధానంగా మాజీ సీఎం ys. జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన వారిలో అందులోనూ లిక్కర్ స్కాం కు సంబంధించి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, అంతకుముందే చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. వీరి తోపాటు ఆడిటర్ బాలాజీ గోవిందప్ప తోపాటు చెవిరెడ్డి స్నేహితుడు, ఇంకొందరు ఇంకా రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.
నారాయణస్వామిపై ఎందుకు దృష్టి?
ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తునకు రంగం లోకి దిగిన (special investigative team - SIT ) అధికారులు ఇప్పటి వరకు ఊహించని విషయాలు వెలుగులోకి తీసుకుని వస్తున్న విషయాన్ని మీడియా ద్వారా వెలుగు చూస్తున్న కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో కీలకమైన వ్యక్తిగానే భావించి వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జీడీ నెల్లూరు మాజీ ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామిని కూడా విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీ చేసింది.
"వయసు పైబడిన కారణంగా రాలేకపోతున్న" అని డిప్యూటీ మాజీ సీఎం నారాయణస్వామి లేఖపంపినట్లు తెలిసింది. దీంతో అమరావతి నుంచే సిట్ అధికారులు నారాయణస్వామిని ఆన్లైన్లో విచారణ చేశారు. రెండవసారి కూడా నోటీసుకు స్పందించని కారణంగానే లిక్కర్ స్కాం లో దర్యాప్తు చేస్తున్న అధికారులు పుత్తూరులోని మాజీ మంత్రి నారాయణస్వామి నివాసంలో విచారణకు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది.
నివాసంలో తనిఖీలు
గంగాధర నెల్లూరు నుంచి. వైసిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కలతూరు నారాయణస్వామి పుత్తూరు పట్టణం ఎస్బిఐ కాలనీలో దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్నారు. అమరావతి నుంచి వచ్చిన సిట్ బృందంలోని అధికారులు తమ వాహనాలను దూరంగా పెట్టి శుక్రవారం ఉదయం నారాయణస్వామి నివాసానికి చేరుకున్నట్లు అక్కడ మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం అందింది.
"సిట్ అధికారులు వచ్చింది వాస్తవమే. మాజీ మంత్రి నారాయణస్వామి తో మాట్లాడుతున్నారు. కొందరు ఇంట్లో తనిఖీలు కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది" అని ఓ మీడియా ప్రతినిధి చెప్పారు.
ఏపీ లిక్కర్ స్కాం జరగడంలో మాజీమంత్రి నారాయణస్వామి పాత్ర ఏమిటి? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి, వివరాలు రాబట్టే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా..
"మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం తాడేపల్లిలోనే లిక్కర్ స్కాం జరగడానికి నారాయణస్వామి నుంచి సంతకాలు తీసుకున్నారా?" అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వైసిపి ప్రభుత్వ కాలంలో మద్యం విధానంలో మార్పులపై జరిగిన వ్యవహారాలను తెలుసుకొనేందుకు నారాయణస్వామిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మద్యం విధానం అనేది కొందరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం మేరకే కుట్రకు తెరతీసారా? అని కూడా దర్యాప్తు బృందం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో కూడా మద్యం విక్రయాలకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల్లో ఆన్లైన్ విధానాన్ని తొలగించి, మాన్యువల్ పద్ధతిలో అమలు చేయడంపై ఉన్న సందేహాలను వివరిస్తూ మాజీ మంత్రి నారాయణస్వామి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పుత్తూరులోని నారాయణస్వామి నివాసంలో ఇంకా విచారణ సాగుతున్నట్లే అక్కడి నుంచి అందిన సమాచారం. లిక్కర్ స్కామ్ లో దర్యాప్తునకు సిట్ అధికారులు వచ్చిన విషయం బయటకు తెలియకపోవడంతో నారాయణస్వామికి నివాసం వద్ద వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు అక్కడి నుంచి అందిన సమాచారం. పది నుంచి 20 మంది వరకే వైసిపి కార్యకర్తలు ప్రధానంగా నారాయణస్వామి మద్దతు దారులు ఆయన ఇంటి వెలుపల నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News