Amaravati | దేవతల రాజధానిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

రాష్ట్రంలో క్రీడలకు అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాం. ఉత్తమ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-19 12:59 GMT

అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందనేది సీఎం చంద్రబాబు చెప్పే మాట. ఇది దేవతల రాజధానిగా కూడా ఆయన అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ ప్రదేశంలో అంతర్జాయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇదే ప్రదేశంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం. అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా రూ.7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి లోకేష్ బుధవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించారు. వారితో గ్రూప్, సెల్ఫీలు తీసుకోవడానికి అనుమతించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.


అమరావతిలో క్రికెట్ స్టేడియం

రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. అమరావతిలో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పద్మావతి యూనివర్సిటీ వేదికగా ఉత్తమ క్రీడాకారిణులను తయారుచేసేందుకు కొత్తగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం దోహదపడుతుందన్నారు.
షటిల్ ఆడిన లోకేష్

శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో క్రీడాకారిణులతో మంత్రి లోకేష్ కొద్దిసేపు షటిల్ ఆడి ఉత్సాహ పరిచారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటుచేసిన ఏరో బిక్స్, తైక్వాండో, యోగా మెడిటేషన్ సెంటర్లను కూడా లోకేష్ ప్రారంభించారు. యూనివర్సిటీ విద్యార్థినులు, క్రీడాకారిణులు ఇక్కడ ఏర్పాటుచేసిన క్రీడా వసతులను వినయోగించుకుని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా మాట్లాడుతూ క్రీడాకారిణులకు యూనివర్సిటీలో మంచి శిక్షణ వేదిక లభించడం తమ విద్యార్థినులకు గొప్ప అవకాశమన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ., రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ ఎండి గిరీషా, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు (తిరుపతి), పులివర్తి నాని (చంద్రగిరి), బొజ్జల సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, యూనివర్సిటీ రిజిస్ట్రార్ రజని పాల్గొన్నారు.

Similar News