తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు

క్రీడలతో పర్యాటక–వాణిజ్య రంగాల వృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-07-28 10:59 GMT

క్రీడలతోనూ పర్యాటక–వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యమని...అందుకే ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు అత్యధిక ప్రాధానత్య ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేయటంతో పాటు క్రీడా సదుపాయాలు, పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ స్పోర్ట్స్‌ పాలసీ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం సింగపూర్‌ పర్యటనలో రెండో రోజు ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్, మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూలును ముఖ్యమంత్రి సందర్శించారు.

అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయటంతో పాటు వినోదం, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా స్పోర్ట్స్‌ స్కూళ్లు ఉండాలని సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఓంగ్‌ కిమ్‌ సూన్‌తో ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న క్రీడా రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచామని, అలాగే ఒలంపిక్స్, ఏషియన్‌ గేమ్స్, వరల్డ్‌ చాంపియన్, నేషనల్‌ గేమ్స్‌ లో పతకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచామన్నారు. ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.7 కోట్లు, రజతం సాధిస్తే రూ.5 కోట్లు, కాంస్య పతకం పొందిన వారికి రూ.3 కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు.

ఒలింపిక్, ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారికి గ్రూప్‌–1 ఉద్యోగాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో పాటు క్రీడలకు ప్రాధాన్యత కల్పించేలా అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని వివరించారు. సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ తరహాలోనే కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా సింగపూర్‌ని తీర్చిదిద్దేందుకు సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్థ ప్రిన్సిపల్‌ ఓంగ్‌ కిమ్‌ సూన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ లో హైపెర్ఫార్మన్స్‌ స్పోర్ట్స్‌ సిస్టంను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత పనితీరు కలిగిన వ్యవస్థలను రూపొందించుకున్నామని అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్ధులకు స్పోర్ట్స్‌ స్కూల్లో అడ్మిషన్‌ ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. విద్యార్ధులకు 12 ఏళ్లు వచ్చిన తర్వాతే అడ్మిషన్లు ఇచ్చి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నట్టు.. అలాగే జాతీయ క్రీడా అసోసియేషన్లు, అకాడమీలతో స్పోర్ట్స్‌ స్కూల్‌ని అనుసంధానించామని ఓంగ్‌ కిమ్‌ సూన్‌ సీఎం చంద్రబాబుకు తెలిపారు.
Tags:    

Similar News