Nallamala: నల్లమల కొండల్లో... వెలిగొండ వెతుకులాటలో...
ఓ రిపోర్టర్ స్వీయానుభవం;
ప్రకాశం జిల్లాలోని శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సందర్శన ఒక అనుభూతిని మిగిల్చింది. నల్లమల అడవుల మధ్యలో మూడు కొండల మధ్య ఉన్న కాలువలకు అడ్డుకట్టలు వేయడం ద్వారా నిర్మించే వెలిగొండ ప్రాజెక్టు ఎంతో అహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. గొట్టిపడియ ఆనకట్ట నుంచి ఎటు చూసినా కొండలు, పొలాలు, విశాలంగా కనిపించే పచ్చదనం అక్కడికి వెళ్లే వారికి హాయిని ఇస్తుంది.
ప్రకాశం జిల్లా రాయవరం వద్ద ఉదయం 11 గంటలకు సాగునీటి రంగం నిపుణులు టి లక్ష్మినారాయణ, భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌తోపాటు వివిధ రంగాల నిపుణుల బృందంతో ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధి జిపి వెంకటేశ్వర్లు వెలిగొండ ప్రాజెక్టు పరిపాలనా భవనానికి చేరుకున్నారు. సుమారు 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో ఎర్రగొండపాలెం నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు.
రాయవరం వెలిగొండ ఆఫీస్ లో...
వెలిగొండ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒంగోలు జిల్లా కేంద్రంలో జరిగే గ్రీవెన్స్ కు హాజరయ్యారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెరిడియన్ ప్రాజెక్టు పనుల వివరాలను తెలిపారు. సమాచారం సేకరించిన బృందం అక్కడి నుంచి మార్కాపురం పట్టణం చేరుకుంది. అక్కడి ప్రెస్ క్లబ్‌లో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు, సాగునీటి రంగ నిపుణులు టి లక్ష్మినారాయణ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షలను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా పనులు పూర్తి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అవసరమైతే ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ‘ఆలోచనా పరుల వేదిక’ ద్వారా నిర్వహించారు.
మార్కాపురంలో...
మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత బృందం మార్కాపురంలో భోజనం చేసి, గొట్టిపడియ డ్యామ్ గ్యాప్ సందర్శించింది. అక్కడ ఇంజనీర్ నాయక్ పనుల పురోగతిని వివరించారు. నాలుగు గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు పెద్దదోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్టు డివిజన్ కార్యాలయానికి చేరుకున్న బృందం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి కృష్టారెడ్డితో సొరంగ మార్గాల పనులపై చర్చించింది. అనంతరం ఆరు గంటల సమయంలో అక్కడి నుంచి బయలుదేరి నల్లమల అడవిలోని సొరంగ మార్గాల వెలుపలి భాగాన్ని పరిశీలించారు. రెండో సొరంగం పనులు పూర్తయితే ట్యాంకుకు నీరు అందించే కార్యక్రమం చేపట్టవచ్చని డిఈ నిరంజన్, ఏఈ ముక్తేశ్వరరావు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేనేజర్ సతీష్ తెలిపారు.
అక్కడి నుంచి సాయంత్రం 7 గంటలకు బయలుదేరి 7.30 గంటలకు దోర్నాల చేరుకున్న బృందం రోడ్డుపై టీ దుకాణంలో టీ తాగి శ్రీశైలం బయలుదేరింది. ‘ది ఫెడరల్’ ప్రతినిధి సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు బృందంతో కలిసి ఉన్నారు. దోర్నాల వచ్చే సరికి రాత్రి కావడంతో అక్కడి నుంచి బృందం సభ్యులతో విడిపోయారు.
నల్లమల కొండల్లో ఆహ్లాదం...
వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతం నల్లమల కొండల్లో పచ్చని చెట్లతో ఆకట్టుకుంటుంది. సుమారు మూడేళ్ల క్రితం పూర్తైన గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల కొండల మధ్య నిర్మితమైన గ్యాప్ ఆనకట్టలు చూపరులను ఆకర్షిస్తాయి. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు గర్భం ఈ ఆనకట్టల ద్వారా ఏర్పడుతుంది. గొట్టిపడియ ఆనకట్టను పరిశీలించేందుకు ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకుంటే, చుట్టూ ఉన్న పచ్చదనం అలసటను మరిచిపోయేలా చేస్తుంది.
కర్నూలు-గుంటూరు హైవేలో కొత్తూరు వద్ద నుంచి సొరంగ మార్గాల ప్రాంతానికి చేరుకునేందుకు వెళ్లినప్పుడు గేట్ వద్ద వాచ్‌మెన్‌లు వాహనాలను ఆపి, బృందం వివరాలు తెలుసుకుని అనుమతించారు. సొరంగ మార్గాలు కలిసే ప్రాంతంలో అహ్లాదకర వాతావరణం బృందాన్ని ఆకర్షించింది. రెండు సొరంగాల నుంచి నీరు బయటకు వచ్చిన తరువాత అర కిలోమీటర్ దూరంలో రెండు కాలువలు ఒకటిగా మారతాయి.
సొరంగాల నుంచి జలధార
సాయంత్రం ఆరు గంటల సమయంలో అక్కడికి చేరగానే అప్పటికే కురిసిన వర్షంతో ఆ ప్రాంతమంతా బురదగా ఉంది. పైగా గాలి ఆడక పోవడంతో ఉక్కపోతగా ఉంది. అందరి శరీరాలు చెమటలు పట్టాయి. ముఖాలు జిడ్డుగా మారాయి. నలుగు అడుగులు వేసి మొదటి సొరంగం ముఖద్వారం వద్దకు వెళ్లగానే సొరంగం లోపలి నుంచి నీరు ఒక చిన్న కాలువ ద్వారా బయటకు వస్తోంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోందని అధికారులను ది ఫెడరల్ ప్రతినిధి ప్ర్రశ్నిస్తే సొరంగంలో అక్కడక్కడ జలధరాలు ఉన్నాయని, సీపేజీ ద్వారా నీరు వస్తోందని చెప్పారు. దీని వల్ల సొరంగానికి ప్రమాదం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నిస్తే అటువంటి దేమీ ఉండదని చెప్పారు.
నిపుణుల ఆలోచనలు... ప్రజల ఆకాంక్షలు
ఏబీ వెంకటేశ్వరావు సొరంగ మార్గాల వద్ద మాట్లాడుతూ, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి కాలువలకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పునరావాసం, ఇతర నిర్మాణ అవసరాల కోసం రూ. 5,000 కోట్లు అవసరమని, ఈ నిధులను సకాలంలో మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రాజెక్టు పరిశీలన బృందం సభ్యులు పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ, రెండో సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉందని, దీన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ప్రాజెక్టు పూర్తి కావడం వారి జీవనోపాధికి కీలకమని బృందం అభిప్రాయపడింది.
అద్భుతమైన అనుభవం
వెలిగొండ పర్యటన ఒక జర్నలిస్టుగా అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చింది. నల్లమల కొండల్లో పచ్చని వాతావరణం, ఆనకట్టల నిర్మాణం, సొరంగ మార్గాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అధికారుల సహకారం, నిపుణుల చర్చలు ప్రాజెక్టు పట్ల ఆశావాదాన్ని కలిగించాయి. అయితే పనుల జాప్యం పట్ల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, ప్రభుత్వం నిధులు, వేగవంతమైన పనులపై దృష్టి సారించాలి. ఈ పర్యటన ప్రాజెక్టు పురోగతి, సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఒక వేదికగా నిలిచింది. వెలిగొండ ప్రాజెక్ట్ (నల్లమల సాగర్) లోకి నీరు పూర్తిగా వస్తే అడవి మధ్యలో సముద్రాన్ని తలపిస్తుంది.
నీటి పారుదల రంగానికి సంబంధించిన అక్కినేని భవానీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితీ అధ్యక్షులు బరిసెల కృష్ణమూర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల రంగ నిపుణులు నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావులు అధ్యయన బృందంలో ఉంటూ పలు సూచనలు సలహాలు ఇచ్చారు.