ఏపీలో ఆ శాఖలకు పని లేకుండా పోయింది

ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశాయి. ఆ శాఖలు ఉన్నా.. ఉపయోగపడని విధంగా తయారయ్యాయి.

Update: 2024-05-29 07:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని కొన్ని శాఖలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యాయి. ఎన్నడు లేని విధంగా గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాల వల్ల కొన్ని శాఖలకు అసలు పనే లేకుండా పోయింది. ఆర్థిక, రెవిన్యూ, వైద్య ఆరోగ్య, స్కూల్‌ ఎడ్యుకేషన్, వ్యవసాయ శాఖ వంటి కొన్ని శాఖల్లో మాత్రమే పనులు జరిగాయి. తక్కిన శాఖల్లో చెప్పుకో దగ్గ స్థాయిలో పనులేమీ జరక్క పోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోయాయి.

ప్రధానంగా సంక్షేమ శాఖలను తీసుకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో అసలు పనే లేకుండా పోయింది. లబ్ధిదారుల ఎంపిక సచివాలయాల స్థాయిల్లోనే జరుగుతోంది. ఆ జాబితాను ఎంపీడీఓ పరిశీలించి నేరుగా జిల్లా కలెక్టరు కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ నుంచి జాబితా రాష్ట్ర కార్యాలయానికి చేరుతుంది. కమిషనర్‌ జాబితాను పరిశీలించి ఎంత నిధులు కావాలో ఆర్థిక శాఖకు పంపుతారు. తర్వాత ఫైనాన్స్‌ శాఖ నుంచి నిధులు సంబంధిత సంక్షేమ శాఖ కమిషనర్‌ ఖాతాకు పంపుతారు. ఈ నిధులను సీఎఫ్‌ఎమ్మెస్‌ ద్వారా డీబీటీ పద్దతిలో లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతాయి. కేవలం లబ్ధిదారుల జాబితాలపై సంతకాలు పెట్టడం తప్ప సంక్షేమ శాఖలకు వేరే పని లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో డిప్యూటీ డైరెక్టర్, తర్వాత ఉన్న మరి కొంత మంది అధికారులు, ఉద్యోగులు ఉంటారు. వీరంతా గతంలో మాదిరిగా పని చేసేందుకు పని లేకుండా పోయింది. హాస్టళ్లకు సంబంధించిన బిల్లులు వార్డన్ల ద్వారా వస్తే వాటిని పరిశీలించి నిధుల కోసం రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు.
గతంలో సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ పథకాలు ఎక్కువుగా ఉండేవి. గత ఐదేళ్లుగా ఆ పథకాలు లేవు. కేవలం డీబీటీ పద్దతిలో నగదు పంపిణీ చేసే పథకాలు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ పథకాలు అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు మంజూరు చేస్తుంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి. మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద ఈ పథకాలను అమలు చేస్తారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. దీంతో పాటుగా లబ్ధిదారులల్లో జవాబు దారీ తనం కూడా ఉంటుంది. నేషనల్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఈ మొత్తాన్ని కంతుల వారీగా అప్పుడప్పుడు ఆయా శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇలాంటివి గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నాయి. కానీ గత ఐదేళ్ల నుంచి వీటిని నిలిపి వేశారు. ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణం.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలంటే ఏ విధమైన పద్దతి అనుసరించాలో ఐఏఎస్‌లకు కూడా మొదట అర్థం కాలేదు. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లో కులాల వారీగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారు. బీసీల్లో 56, ఎస్సీల్లో మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు కావడంతో డీబీటీ నిధులు ముందుగా కార్పొరేషన్‌ అకౌంట్లో వేసి ఆ తర్వాత బ్యాంకులకు పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసం సంవత్సరంలో కనీసం మూడు సార్లు కార్యదర్శి స్థాయి అధికారులు ఢిల్లీ వెళ్లి వచ్చే వారు. ఇవేమీ లేకపోవడంతో ప్రస్తుతం ఆ పని కూడా వారికి తప్పింది.
సహజంగా ఐఏఎస్‌లు స్వతహాగా ఆలోచించి, పేదల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి ఏమి చేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారంగా కొన్ని పథకాలకు రూపకల్పన చేసేవారు. అయితే పాలకులే ఫలానా పని చేయాలని చెప్పడంతో ఐఏఎస్‌లు వాటికే పరిమితమవుతూ ఉండటంతో తక్కిన వాటిని రూపొందించే పని లేకుండా పోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అనేవి రాజ్యాంగ బద్దంగా సోషలిజమ్‌ బాటలో నడిచేందుకు ఏర్పాటు చేసినవి. సోషలిజమంటేనే సంక్షేమం అని నాటి కేంద్ర ప్రభుత్వం భావించి ఆ పదాన్ని రాజ్యాంగంలో చేర్చింది. కేవలం అభివృద్ధి అంటే సరిపోదని, పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలంటే సోషలిజమ్‌ కూడా ఒక మార్గమని, నాటి పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి ప్రభుత్వం సోషలిజాన్ని అమలు చేసిందని చెప్పాలో.. ఆ భావన అమలులో జరిగిన లోటుపాట్ల గురించి చర్చించాలో మేధావులకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది.
రాష్ట్రంలో పర్యావరణం ఎంత ముఖ్యమో నాటి పాలకులు గుర్తించినంతగా నేటి పాలకులు గుర్తించ లేదు. భూమిపై మూడో వంతు అడవులు ఉండాలని, అలా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యమవుతుందని, పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పర్యావరణం పెంచేందుకు కించిత్‌ పని కూడా అటవీ శాఖ ద్వారా చేపట్ట లేదు. కారణం నిధులు ఇవ్వక పోవడం. ప్రేయారిటీ అంశాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగాలే తప్ప ఇష్టాను సారం చేస్తే కుదరదు. ఈ ఐదేళ్ల పాలనలో ఇష్టాను సారం జరిగిందే తప్ప ప్రేయారిటీల ప్రాతిపదికన పాలన సాగ లేదనేది పలువురి వాదన.
ప్రతి సంవత్సరం వర్షా కాలంలో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. అడవుల్లో నేరుగా విత్తనాలు చల్లే కార్యక్రమాలను కూడా చేపడుతుంది. సామాజిక వన విభాగం ద్వారా మొక్కలు పెంచి ఇళ్ల వద్ద, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నాటేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. దీని ద్వారా మొక్కలు పెంచడం ఎంత అవసరమో చిన్ప నాటి నుంచే పిల్లలు తెలుసుకుంటారు. పైగా ఒక ఎకరం స్థలంలో చెట్లు పెరిగితే కనీసం 20 మందికి తగ్గకుండా ఆక్సిజన్‌ అందుతుంది. కరోనా సమయంలో ఆక్జిజన్‌ కోసం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్లారా చూశాం. అంత ముఖ్యమైన అటవీ శాఖపై ఎందుకు ఇంత నిర్లక్ష్యాన్ని పాలకులు ప్రదర్శించారంటే వారి వద్ద సమాధానం లేదు. ఈ విషయమై అటవీ శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే గతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా కొంత మేరకు నిధులు వచ్చేవని, ఇప్పుడు దానిని కూడా తీసేశారని, ప్రభుత్వం నుంచి జీతాలు తప్ప పైసా కూడా మొక్కల పెంపకానికి నిధులు రావడం లేదని చెబుతున్నారు. ఇదే బాటలో హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్, యూత్‌ సర్వీసెస్, ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, రోడ్లు భవనాలు, శానిటేషన్, టూరిజమ్‌ వంటి శాఖలు నిరుపయోగంగా మారాయంటే ప్రభుత్వం తీరే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News