గోల్డ్ చూపి దుమ్ము నాకించిన ఎంపీటీసీ

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి పరార్...;

Update: 2025-07-22 06:51 GMT
మీరు వీళ్ల మాట నమ్మారో.. కొంప కొల్లేరే.. బంగారమంటే మోజు లేని ఇల్లు ఉండదు కదా.. అదే వీళ్ల మోసానికి మార్గం. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటారు, ఆ తర్వాత మీ డబ్బుతో చెక్కేస్తారు. డబ్బులు తిరిగి ఇమ్మని అడిగితే రౌడీలతో బెదిరిస్తారు. ఈ ముఠా మోసం ఎలా ఉంటుందంటే..

గుంటూరు ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు వీరు

వీళ్లది గుంటూరు పక్కనే ఉన్న పెదకాకాణి. ఓ రాజకీయ పార్టీతో అనుబంధం ఉంది. ఎంపీటీసీ సభ్యురాలు కూడా. పేరు గుల్జార్‌. సులువైన మార్గంలో డబ్బు సంపాయించేందుకు ఓ మార్గం కనిపెట్టింది. ఇంకొందర్ని కూడేసి తన ప్లాన్ చెప్పింది. వాళ్లు సరే అన్నారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామనేది ఈమె ప్లాన్. ఇలా చాలా మంది నుంచి డబ్బు గుంజారు. మొహం చాటేశారు. ఈ క్రమంలోనే గుంటూరు కొత్తపేటకు చెందిన నాగదుర్గ, నరసింహకృష్ణ, ఆరిఫ్ లకు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామ‌ని రూ.40 లక్షలు వసూలు చేశారు. బంగారం ఇవ్వకపోయే పాటికి వాళ్లు గుంటూరు ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
డబ్బులు తిరిగివ్వమని అడిగితే బ్లేడ్‌ బ్యాచ్, రౌడీషీటర్లతో చంపిస్తానంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏఎస్పీ దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
బాధితులు చెప్పిన వివరాల ప్రకారం... ‘మూడు నెలల క్రితం గుల్జార్‌ తనకున్న పరిచయాలతో బంగారాన్ని మార్కెట్‌ ధరలో సగానికే ఇప్పిస్తానని చెప్పారు. అందుకు కనీసం రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలని షరతు విధించారు. తాను ఇప్పటికే చాలామందికి బంగారు బిస్కెట్లు, ఆభరణాలు తక్కువ ధరకే ఇప్పించానని నమ్మబలికారు. ఎవరెవరికి ఇప్పించారో తేదీలు సహా ఫొటోలు చూపించారు.
ఆమె మాటలు నమ్మి బంగారు నగలు తాకట్టు పెట్టి మరికొంత నగదు కలిపి గుల్జార్ కు ఇచ్చారు. ఇలా దాదాపు రూ. 40 లక్షల వరకు ఇచ్చారు. ఇంతవరకు బంగారపు వస్తువులు ఇవ్వలేదు. డబ్బులు తిరిగిచ్చేయమని అడుగుతుంటే పోలీసులు, రౌడీషీటర్లు, బ్లేడ్‌బ్యాచ్‌లతో పరిచయాలు ఉన్నాయని బెదిరిస్తున్నారు. ప్రాణాలు తీస్తామంటూ బెదిరించి తప్పించుకు తిరుగుతున్నారు అని బాధితులు చెప్పారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. మోసం చేసిన వాళ్లు మాత్రం పరారీలో ఉన్నారు.
Tags:    

Similar News