Kadapa Steel - CM RAMESH | దీక్ష కడప ఉక్కు కోసం ప్లాంట్ అనకాపల్లికా?

కడప ఉక్కును మర్చిపోయిన సిఎం రమేష్

Update: 2024-12-24 08:50 GMT

వెనుకబడిన రాయలసీమ ప్రజల ఆశా దీపం కడప ఉక్కు కర్మాగారం. దీని ఏర్పాటు గాలిలో దీపంలా మారింది. 2004 నుంచి 2024 వరకు ముగ్గురు సీఎంలు నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు. అయిన, అడుగు ముందుకు సాగలేదు. ఇందులో ప్రధానంగా, గర్జించిన రాయలసీమ పులులు సైలెంట్ అయ్యాయి. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్. జగన్ రాయలసీమ వాసులే. బీజేపీలో టీడీపీ గొంతుకగా ఉంటూ, అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ కూడా కడప జిల్లా వాసే. కడప ఉక్కు కోసం రమేష్ చేసిన ఆమరణ దీక్ష అనకాపల్లికి కలిసివచ్చింది.

11 రోజుల దీక్ష ఏమైంది రమేష్..

2018 జూన్ 20వ తేదీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్ష చేశారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో 11వ రోజులు దీక్ష చేశారు. సీఎం ఎన్. చంద్రబాబు సూచనలతో దీక్ష సీఎం రమేశ్ దక్ష విరమించారు. మాజీ ఎంఎల్సీ బీటెక్ రవి కూడా ఏడు రోజులు దీక్ష చేశారు. కాగా , సీఎం రమేష్ ను నాలుగో రోజు మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. దీక్ష విరమణకు సీఎం చంద్రబాబు కూడా వచ్చారు. "కడపలో ఉక్కు పరిశ్రమ కేంద్రమే ఏర్పాటు చేయాలి. లేదంటే, కేంద్రం 50 శాతం నిధులు ఇస్తే, మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరిస్తాం" అని కూడా ఆరో రోజు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

"మా హక్కులు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము" అని కూడా సీఎం చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

"ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా కీలక భాగస్వామి" కావడం గమనార్హం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు భాగస్వామ్యంతో కడప వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత దీనికి చట్టబద్ధత లభించింది. సెయిల్ ( Steel Exchange India limited - SEIL) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టం 13వ షెడ్యూల్ లో చేర్చారు. అయినా, ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలంగా లేదని సెయిల్ నివేదిక ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పక్కన పెట్టడం వెనుక

నడిచిన మంత్రాంగం ఏమిటి?
ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితి డోలాయమానంలో ఉంది. దీనికి సమీపంలోనే ప్రైవేటు భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయాలని కూడా కార్యక్రమం ఖరారు చేశారు. దీంతో..
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం తెరమీదకి వచ్చింది. కడప ఉక్కు కూడా ఆంధ్రుల హక్కు అనే నినాదం ఊపు అందుకోక పోవడం వెనుక రాయలసీమ పులులుగా గర్జించే అధికార, ప్రతిపక్ష నాయకుల వ్యవహార శైలిలో డొల్లతనం మరో మారు బట్టబయలైంది.

రాయలసీమ ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.
సీమపై వివక్ష ఎందుకు?
అనకాపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ వ్యవహార తీరుపై.. రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
"రాయలసీమలో స్విచ్ వేస్తే కోస్తాలో బల్బు వెలుగుతోంది" అని నాగార్జున రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"కడపలో ఉక్కు కర్మాగారం ప్రారంభించాలని రాజ్యసభ సభ్యుడుగా సీఎం రమేష్ 2019లో ఆమరణ దీక్ష చేశారు. అలాంటి వ్యక్తి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తారంట" అని నిరసించిన నాగార్జునరెడ్డి "ఎందుకన్నా మీకు మన రాయలసీమ అంటే అంత కోపం? సీమపై ఎందుకు ఈ వివక్ష, సొంత గడ్డపై ఎందుకు మమకారం లేదు" అని కూడా నాగార్జున రెడ్డి ఎంపీ సీఎం రమేష్ సూటిగా ప్రశ్నించారు. ఆ దీక్షలో తాను మాట్లాడిన మాటలను నాగార్జునరెడ్డి గుర్తు చేశారు.
సీఎం రమేష్ ద్రోహం
"కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో కడప నుంచి టిడిపి రాజ్యసభ సభ్యునిగా, ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ద్రోహం చేశారు" అని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటైన ఆరోపణ చేశారు.
ఆయన ఏమంటున్నారంటే..
"తప్పుడు నివేదికలతో ఓబులాపురం మైన్స్ లో ఉన్న ఖనిజంలో నాణ్యత లేదని కేంద్రానికి పంపిన మీరు (సీఎం రమేష్) ప్రస్తుతం ఒక్కొక్కటిగా మన రాయలసీమ ప్రాంతం నుంచి కోస్తాకు తరలిస్తూనే ఉన్నారు" అని ఆరోపించారు.
గత ప్రభుత్వం కూడా కడప ఉక్కు పరిశ్రమను నిర్మించ కుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారు. మీ రాజకీయ నాయకుల అండతో అక్రమ మైనింగ్ చేసుకోవడానికి, స్మగ్లింగ్ చేసుకోవడానికి మాత్రము నాణ్యత ఉంటుంది. కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇక్కడ ఉన్న ఖనిజ సంపదతో నిర్మించడానికి పరిశ్రమలను విభజన చట్టంలో ఉన్న కూడా ఈ తల్లికి పుట్టిన నాయకులే కడప ఉక్కు పరిశ్రమను రాయలసీమ ప్రాంతంలో నిర్మించ కుండా మల్లీ మన రాయలసీమ ప్రాంత ప్రజలను ఎక్కిరించినట్లు, అవమానించినట్లు, కోస్తాలో ఏకంగా ప్రధానితో అక్కడ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడాన్ని సీ ఎమ్ రమేష్ గారి విఙ్ఙతకే వదిలేస్తున్నాం" అని తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప ఉక్కు పరిశ్రమను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. అనకాపల్లి నుంచి ఎంపీగా గా గెలిచిన తరువాత మొదటిసారి సొంత జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్ధనల తరువాత కూడా హామీ ఇచ్చారు. అయినా, విశాఖ- చెన్నై కారిడార్ లో భాగంగా అనకాపల్లి సమీపంలో నక్కల పల్లె వద్ద కర్మాగారం ఏర్పాటుకు అనుమతి సాధించారు. ఇదే జిల్లాలో చర్చకు తెర తీసింది.
రాయలసీమకు మేలు చేసేందుకు ఉద్దేశించిన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొదటి నుంచి అవరోధాలే ఎదురవుతున్నాయి. 2004లో దివంగత సీఎం వైఎస్ఆర్ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే కడప జిల్లా మైలవరం సమీపంలో కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బీజం వేశారు.
కర్ణాటకలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) నుంచి ఇనుప ఖనిజం తీసుకోవడానికి బ్రాహ్మణి స్టీల్స్ తో 2007 నాటి ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చకుని, జమ్మలమడుగు సమీపంలోని అంబవరం వద్ద ఎనిమిది వేల ఎకరాలు కేటాయించడంతో పాటు గండికోట రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీళ్లు ముద్దనూరు థర్మల్ విద్యుత్ పవర్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఉత్పత్తి చేసిన స్టీల్ తరలించడానికి, ఇనుప ఖనిజం తరలించడానికి వీలుగా ముద్దనూరు నుంచి రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అంగీకరించింది. వైఎస్ఆర్ మరణం తరువాత ఆ పనులు ఆగడమే కాదు. విపరీతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తరువాత బ్రాహ్మణి స్టీల్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయడంతో పాటు 2013లో జీఓ నంబర్ 333 ఉత్తర్వులతో భూములు కూడా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆగింది.
"తమ కంపెనీకి అనుమతి ఇస్తే, రెండేళ్లలో కర్మాగారం ఏర్పాటు చేస్తాం" అని ఓఎంసీ అధినేత గాలి జనార్దనరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా "బ్రాహ్మణి స్టీల్స్ ప్లాంటుపై రూ.1350 కోట్లు ఖర్చు చేశాం. అవి తిరిగి చెల్లిస్తే, స్టీల్ ప్లాంట్ నిర్వహణ ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన ప్రతిపాదించిన విషయం ప్రస్తావనార్హం.
రాష్ట్రం విడిపోయాక..
రాష్ట్ర విభజన తరువాత "కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం" అని విభజన చట్టం 13వ షెడ్యూల్ లో ప్రకటించారు. ఆ మేరకు 2014 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ ప్రతినిధులు స్టీల్ ప్లాంటుకు పరిశీలన జరిపిన తరువాత "ఇక్కడ లాభదాయకం కాదు" అని తేల్చారు.
2017లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఉ్ననత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, "మెకాన్"ను భాగస్వామ్యం చేసింది. ఆ తరువాత కూడా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు లేవు. తెలంగాణ రాష్ట్రం, బయ్యారం, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుకూలంగా లేదని సెయిల్ నివేదికను గుర్తు చేసిన కేంద్రం ఏమైనా సందేహాలు, సూచనలు మెకాన్ సంస్థకు ఇవ్వాలని కేంద్రం సూచించింది. దీంతో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆ కోవలోనే..
2019లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ ఆమరణ దీక్షకు ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నాయకుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి సాగించిన పోరాటం ప్రేరణగా నిలిచింది. ఇందులో వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలు కూడా మమేకం కావడం వల్ల ఉద్యమం మహోధృతంగా సాగింది. విద్యార్థులను కూడా ఉద్యమాల్లో భాగస్వామ్యం చేశారు. అయితే..
"కడప ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదం అందించడంలో అన్ని పార్టీల నేతలు విఫలం అయ్యారని చెప్పక తప్పదు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు అనే అంశం ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీకి అస్ర్తంగా పనిచేసిందనడంలో సందేహం లేదు.
దీనిపై అప్పుడు పోరాటం సాగించిన ఎంపీ సీఎం రమేష్ తీరుపై రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి ఆగ్రహం చెందారు. ముడిఇనుము లో నాణ్యత లేకుంటే, ఇతర దేశాలకు ఎలా ఎగుమతి అవుతోంది? అని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తరువాత
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2018లో ఆయన మళ్లీ కడప ఉక్కు పరిశ్రమకు గండికోట రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతంలోని కంబాలదిన్నె వద్ద శంకుస్థాపన చేశారు. నాలుగు వేల ఎకరాల్లో రూ.18 వేల కోట్లతో నిర్మించే ప్లాంట్ ద్వారా, లక్ష మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.

2019 డిసెంబర్ 23న సున్నపురాళ్లపల్లె వద్ద మాజీ సీఎం వైఎస్. జగన్ శంకుస్థాపన చేశారు. ఇంతా చేసినా, కడప స్టీల్ ప్లాంట్ ప్రాంతం అడవిలా మారి, పునాది రాళ్లకే పరిమితమైంది. 2023లో మళ్లీ అదే ప్రాంతంలో జగన్ భూమి పూజ చేశారు. ఇదిలావుండగానే,
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన కర్మాగారం స్థితి ఎలా మారింది. అనడం కంటే అధికార, ప్రతిపక్షాలు వేలాది మంది కార్మికులతో ఆటలాడుకుంటున్నాయి.
అటు కడప ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. విశాఖ ఉక్కుకు కొరత లేదు. అయితే, "కడప కర్మాగారం లాభదాయకం కాదు. ముడి ఖనిజం నాణ్యతపై" నివేదికలు వీటినే కాదు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను గాలిలో దీపంలా మార్చారు. ముడిఖనిజం నాణ్యత లేకుంటే, ఎగుమతికి ఎలా అనుమతిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
ఈ వ్యవహారంపై
ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు నర్రెడ్డి తులసిరెడ్డి స్పందించారు. ఆయనను పలకరించిన 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.

"కడప వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నాయి." అని గుర్తు చేశారు. "ఇప్పటికి ముగ్గురు సీఎంలు నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు. ఈ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వంలో ఉన్న వారికి చిత్తశుద్ధి అవసరం. కేంద్రం వద్ద తమ పలుకుబడి ఉపయోగించి, ప్రయోజనాలు సాధించాలి" అని వ్యాఖ్యానించారు. "కడప జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయనే విషయం చాలా స్పష్టంగా నాయకులకు తెలుసు, రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి కేంద్రంతో సమన్వయం చేసుకుని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి" అని హితవు పలికారు.
ప్రభుత్వ రంగంలో ఏర్పాటు వల్ల ప్రయోజనాలు ఉంటాయి. విశాఖ వద్ద కర్మాగారం ఉంది. దీనిని డోలాయమాన స్థితికి తీసుకుని వచ్చారు. దీనికి సమీపంలోనే ఉన్న అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో కర్మాగారం ఏర్పాటు చేయగలిగిన పాలకులు అదే పద్థతి కడపలో ఎందుకు సాధ్యం కాలేదనేది ప్రజలక సమాధానం చెప్పాలి" అని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News