Cases on KCR and KTR|అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్ధితి ఏమవుతుంది ?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైన కాస్త అటుఇటుగా కేసులు నమోదు, విచారణ, అరెస్టులు తప్పకవపోవచ్చనే చర్చ బాగా జరుగుతోంది;

Update: 2024-12-17 07:53 GMT

అందరు అనుమనిస్తున్నదే జరిగితే బీఆర్ఎస్ పరిస్ధితి ఏమవుతుంది ? ఇపుడిదే విషయమై తెలంగాణా రాజకీయాల్లో చర్చ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తండ్రి, కొడుకులు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), మేనల్లుడు హరీష్ రావు(Harish Rao) ముగ్గురి మీదా కేసులు నమోదయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race), లగచర్లలో కలెక్టర్ మీద గ్రామస్తుల, రైతుల దాడికి సూత్రదారుడు, టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద బాగా వినబడుతున్నాయి. అయితే వీటిల్లో ఫార్ములా ఈ కార్ రేసులో రు. 55 కోట్ల అవినీతికి ప్రధాన బాధ్యుడని ఇప్పటికే ప్రాధమిక విచారణలో నిర్ధారణైంది. అందుకనే కేటీఆర్ మీద కేసు నమోదుచేయాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఏసీబీ(ACB Police) ఉన్నతాధికారులకు లేఖ రాయబోతున్నారు. చీఫ్ సెక్రటరీ నుండి లేఖ అందటమే ఆలస్యం కేసు నమోదుచేసి విచారణకు నోటీసులు జారీచేయటానికి ఏసీబీ ఉన్నతాధికారులు రెడీగా ఉన్నారు. జరుగుతున్నది చూస్తుంటే కేటీఆర్ అరెస్టు తధ్యమని అర్ధమైపోతోంది. కాకపోతే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే(Assembly Winter Session) జరుగుతుందా లేకపోతే సమవేశాలు అయిపోయిన తర్వాతనా అన్నదే తేలాలి.

ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విషయం చూస్తే ఈయనపైన కూడా అవినీతి ఆరోపణలు, అక్రమాల ఆరోపణలు చాలానే ఉన్నాయి. పదేళ్ళ కేసీఆర్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు కొదవైతే లేదు. ఛత్తీస్ గర్(Chhattisgarh) తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి(Bhadradri), యాదాద్రి(Yadadri) పవర్ ప్లాంట్ల నిర్మాణంలో వేలకోట్లరూపాయల అవినీతి జరిగిందని, వేలాది టెలిఫోన్లను ట్యాపింగ్(Telephone Tapping) చేయించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. టెలిఫోన్ ట్యాపింగ్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుచేస్తోంది. విద్యుత్ కొనుగోళ్ళ అవినీతిని జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్(Justice MadanBLokur Commission) విచారించింది. అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) విచారిస్తోంది. మదన్ బీ లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సోమవారం క్యాబినెట్ సమావేశంలో చర్చజరిగింది.

మంత్రుల ద్వారా అందిన సమాచారం ఏమిటంటే కేసీఆర్ నిర్ణయంవల్ల భద్రాద్రి ప్లాంట్ ఏర్పాటు కారణంగా ప్రభుత్వంపై పాతికేళ్ళల్లో 9 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం కారణంగా ప్రభుత్వంపై రు. 3642 కోట్లు నష్టం జరిగిందని. అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు కారణంగా ప్రభుత్వంపై రు. 1600 కోట్ల భారం తప్పదని రిపోర్టులో ఉందట. 1600 కోట్ల భారం దేనికంటే ఎక్కడో దూరంగా ఉన్న గనులనుండి బొగ్గు రవాణ చేయటానికే వందల కోట్లు భరించాల్సుంటుందని మదన్ బీ లోకూర్ స్పష్టంగా చెప్పారట. వాస్తవంగా ఈ ప్లాంటు వల్ల తెలంగాణాకు నష్టమే కాని ఎలాంటి ఉపయోగం ఉండదని రిపోర్టులో ఉందని మంత్రులు చెప్పారు. విద్యుత్ రంగంలోని అనేకమంది నిపుణులు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు, సర్వీసులో ఉన్నతాధికారులను లోకూర్ విచారించిన తర్వాత కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం, పడబోయే భారం తదితరాలను తన రిపోర్టులో పెట్టారని మంత్రులు చెప్పారు. లోకూర్ రిపోర్టులోని కీలక అంశాలను రేవంత్ క్యాబినెట్ భేటీలో మంత్రులందరికీ వివరించారు. దీనిపై లోతైన చర్చను తొందరలోనే జరగబోయే క్యాబినెట్ సమావేశంలో జరిపి ఏమిచేయాలనే నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

మంత్రుల మాటలు విన్నతర్వాత కేసీఆర్ మీద అవినీతికేసులు నమోదయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు అర్ధమైపోతోంది. అవినీతి జరిగిందని లోకూర్ తన రిపోర్టులో స్పష్టంచేయటమే కాకుండా అందుకు ఆధారాలను కూడా చూపించారని సమాచారం. కాబట్టి కేసీఆర్ మీద కేసులు నమోదుచేసే అవకాశం వస్తే రేవంత్ ఊరుకుంటారని ఎవరూ అనుకోవటంలేదు. కాకపోతే కేసుల నమోదు, విచారణ ఎప్పుడు అన్నదే సస్పెన్సుగా మారింది. ఇప్పటికైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసునమోదు చేయాలని క్యాబినెట్ డిసైడ్ అయ్యింది కాబట్టి మిగిలిన ప్రక్రియ లాంఛనమే. కాబట్టి తొందరలోనే కేటీఆర్ మీద కేసునమోదు, విచారణ, అరెస్టు ఖాయమని అర్ధమైపోతోంది.

ఇదేసమయంలో వచ్చే సమావేశంలోనే కేసీఆర్ మీద కేసు నమోదుచేయాలని క్యాబినెట్ డిసైడ్ అయితే నోటీసు, విచారణ, అరెస్టు తప్పకపోవచ్చు. తండ్రి, కొడుకులు ఇద్దరు అవినీతి కేసులతో అరెస్టయితే అప్పుడు పార్టీ పరిస్ధితి ఏమిటనే చర్చ ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత(kalvakuntla Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని తీహార్ జైలు(TiharJail)లో 6 మాసాలు గడిపిన కవిత బెయిల్ పై రెండు నెలల క్రితం బయటకు వచ్చారు. ఏ కారణం వల్లయినా బెయిల్ రద్దయితే మళ్ళీ కవిత జైలుకు వెళ్ళకతప్పదు. వీళ్ళ ముగ్గురి మీద ఆరోపణలు, కేసులు సరిపోవన్నట్లు టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిద్ధిపేట పోలీసుస్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్ధిపేటకే చెందిన జీ చంద్రశేఖర్ గౌడ్ ఫిర్యాదుమేరకు హరీష్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ను హరీష్ ట్యాపింగ్ చేయించినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి గౌడ్ ఫిర్యాదులో చెప్పిన కారణంగా పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదుచేశారు. తనపైన పోలీసులు నమోదుచేసిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేయాలని హరీష్ వేసిన కేసును హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు అదనంగా కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలపై కేసీఆర్ మీద కేసులు నమోదైతే హరీష్ మీద కేసులు నమోదవ్వటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసింది హరీష్ రావే. పైగా కేసీఆర్, హరీష్ మేనమామ, మేనల్లుళ్ళన్న విషయం అందరికీ తెలిసిందే. మేనమామ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో నిర్ధారణ అయితే మేనల్లుడికి సంబంధంలేకుండానే ఉంటుందా అనే చర్చ బాగా జోరుగా సాగుతోంది. జరుగుతున్నది చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైన కాస్త అటుఇటుగా కేసులు నమోదు, విచారణ, అరెస్టులు తప్పకవపోవచ్చనే చర్చ బాగా జరుగుతోంది. మరదే జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పరిస్ధితి ఏమవుతుందో ?

Tags:    

Similar News