దివ్యాంగులకు గుర్తింపు కార్డులు
గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలి.;
By : The Federal
Update: 2025-05-16 13:03 GMT
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పీఎంజేఏవై వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
శుక్రవారం అమరావతి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబందిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికేట్లు, పీఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్‌పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కి చర్యలు చేపట్టాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఆధారంగా గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.