తిరుపతి బీసీ మహిళా మేయర్ కు అవమానం

జాతీయ సదస్సుకు డిప్యూటీ మేయర్ కోసం జీఓ జారీ చేయడంపై కేంద్ర మంత్రికి తిరుపతి ఎంపీ ఫిర్యాదు చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-01 15:32 GMT
తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం. (ఇన్సెట్) మేయర్ డాక్టర్ శిరీష

తిరుపతి నగర మేయర్ కు గురుగ్రామ్ లో జరిగే జాతీయ సదస్సుకు ఆహ్వానం అందలేదు. డిప్యూటీ మేయర్ ను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీనిపై తిరుపతి ఎస్సీ రిజర్వుడు వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి సీరియస్ గా స్పందించారు.

"రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర" అంశంపై జాతీయ సదస్సుకు బీసీ సామాజికవర్గానికి చెందిన మేయర్ డాక్టర్ శిరీషపై వివక్ష చూపించారు. ఇది పూర్తిగా బీసీ సామాజికవర్గాన్ని కించపరచడమే అని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి అభ్యంతరం తెలిపారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖా మంత్రి మనోహర్ లాల్ కు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేస్తూ, లేఖ రాశారు. తిరుపతి నగరానికి మొదటిసారి బీసీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ శిరీష మేయర్ గా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అని కూడా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గుర్తు చేశారు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల మూడో తేదీ నుంచి రెండు రోజుల పాటు "రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర" అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్ డాక్ట‌ర్ శిరీష‌ను కాకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖా మంత్రి మనోహర్ లాల్ కి ఫిర్యాదు చేశారు.
నిబంధనల ఉల్లంఘన
జాతీయ సదస్సుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ను ఈ సదస్సుకు పంపనున్నట్లు పేర్కొనడం, ప్రజా ప్రాతినిధ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని ఎంపీ గురుమూర్తి ఫిర్యాదులో ప్రస్తావించారు.
కేంద్ర మంత్రికి ఆయన రాసిన లేఖలో ఇంకా ఏమి ప్రస్తావించారంటే..
"మేయర్‌గా ప్రజలతో నేరుగా ఎన్నికయ్యే వ్యక్తి, నగరానికి పూర్తి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. అధికారిక హోదా కలిగిన ప్రతినిధిని పక్కన పెట్టి, డిప్యూటీ మేయర్‌ను ఎంపిక చేయడం సబబు కాదు. ఇది కేవలం ప్రోటోకాల్‌ ఉల్లంఘించడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, నిబంధనలను ఉల్లంఘించడమే. అని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖజోక్యం చేసుకుని, తిరుపతి మేయర్‌కు సదస్సుకు తగిన ఆహ్వానం అందేలా చూడాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Similar News