హైకోర్టులో జగన్ కు స్వల్ప ఊరట
సింగయ్య మృతి కేసులో రెండు వారాలపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు.;
By : V V S Krishna Kumar
Update: 2025-07-01 12:46 GMT
సింగయ్య మృతి ఘటన కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. జగన్ తో సహా ఇతరులపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు రెండు వారాలపాటు స్టే విధించింది.ఈ కేసులో రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలన్న జగన్ క్వాష్ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలు కోర్ట్ ముందు ఉంచేందుకు రెండు వారాలు సమయం కావాలని కోర్టును అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇప్పటికే ఈ కేసును బీఎన్‌ఎస్ కింద 105 సెక్షన్‌కు మార్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల లో జరిగిన జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు కిందపడి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై జగన్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టును జగన్ ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.