అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌ ఏర్పాటు

సీఆర్‌డీఏ ఇప్పటికే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించింది.;

Update: 2025-09-01 14:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీ కంప్యూటింగ్‌ సెంటర్‌(ఏక్యూసీసీ)లో ప్రముఖ సంస్థ ఐబీఎం క్యాంటం కంప్యూటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో ప్రభుత్వ సంస్థగా ఈ ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇది వరకే 50 ఎకరాలను కేటాయించింది. ఈ 50 ఎకరాల్లో రెండు వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్‌ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సాఫ్ట్‌వేర్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈ రెండు వేల చదరపు అడుగులకు గాను.. ఒక్కో చదరపు అడుగుకు రూ. 30 అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపైన ఐబీఎం సంస్థకు స్థలాన్ని కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి బదులుగా ఐబీఎం సంస్థ ఏడాదికి 365 గంటల ఉచిత కంప్యూటింగ్‌ టైమ్‌ను నాలుగేళ్ల పాటు ప్రభుత్వానికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్‌ సంస్థలతో పాటు విద్యా పరమైన అంశాలకు కూడా ఈ కంప్యూటింగ్‌ టైమ్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అమరావతిలోని విట్‌ యూనివర్శిటీ క్యాంపస్‌లో సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో బెంగుళూరు చెందిన క్యూపై ఏఐ అనే మరో సంస్థ చిన్న క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. వీటికి అధునాతన కూలింగ్‌ వ్యవస్థను అందించడంతో పాటుగా నిరంతర విద్యుత్‌ సరఫరాను కూడా కూటమి ప్రభుత్వం ఈ క్వాంటం వ్యాలీకి అందించేందుకు సిద్ధమైంది. వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, నూతన పరిశోధనలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా ఈ క్వాంటం వ్యాలీ సేవలు అందించనుంది.

Tags:    

Similar News