రైతు భరోసా పథకం కోసం కౌలు రైతులను గుర్తించడం ఎలా?

రైతు భరోసా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పాటించాలో రాష్ట్ర రైతు సంఘాలు చర్చించాయి. కినని సాధారణ సూత్రాలను ఆమోదించాయి.

Update: 2024-06-09 04:00 GMT

డిసెంబర్ 2023 లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రైతు భరోసా పథకం ఒకటి. రైతు భరోసా సహాయాన్ని కేవలం భూమి పట్టా ఉన్న రైతులకు కాకుండా, కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయడం ఈ హామీలో అతి ముఖ్యమైన అంశం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయింది కాబట్టి, తక్షణమే కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. లేకపోతే, పాత పద్ధతిలోనే రైతు భరోసా ఆహాయం అందిస్తే, మళ్ళీ కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో రైతు భరోసా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పాటించాలో రాష్ట్ర రైతు సంఘాలు చర్చించాయి. కినని సాధారణ సూత్రాలను ఆమోదించాయి. ఈ పథకం కోసం నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

వ్యవసాయం చేయని వాళ్ళకి రైతు బంధు డబ్బులు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి కానీ వాస్తవంగా సాగు చేస్తున్న లక్షలాది మందికి కౌలు రైతులకు అందట్లేదనీ, ఉన్నోళ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ డబ్బులిస్తున్నది, లేనోళ్లకు ఇవ్వటం లేదనీ, పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా ఎకరాలతో నిమిత్తం లేకుండా లక్షల రూపాయలు ఇస్తున్నారనీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం పై మెజారిటీ ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తిన విషయం మనకు తెలుసు. ఆ అసంతృప్తి బీఆర్ఎస్ పై అసెంబ్లీ ఎన్నికలలో వ్యతిరేకతకు కూడా ఒక ముఖ్యమైన కారణంగా పని చేసింది.

వ్యవసాయం చేయని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నగరవాసులకు వేల కోట్లు అందించే రైతు బంధు పథకాన్నిఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ?

రైతు భరోసా ఇచ్చే భూమికి గరిష్ట పరిమితి విధించడం, ఉద్యోగాలు, ఇతర అధిక ఆదాయం ఉన్నవారిని మినహాయించడం, భూమిని కౌలుదారు సాగు చేస్తున్న చోట సాగుదారుకే మద్దతు ఇవ్వాలన్న సంకల్పం – వీటిని అమలు చేయడానికి అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయ నిబద్ధత అన్నిటి కంటే ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొలిటికల్ కమిట్మెంట్ చూపించాలి.

రైతు భరోసాను ప్రస్తుతం సాగులో ఉన్న భూమికి మాత్రమే ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ ప్లాట్లు, రోడ్లు, కొండలు, గుట్టలు, కట్టడాలు – ఈ విధంగా ఉన్న భూమిని మొట్టమొదట గుర్తించి రైతు భరోసా నుండి మినహాయించాలి. ఇప్పటికే రైతు బంధు ఇస్తున్న భూములలో సాగులో లేని భూములు ఏవి ఉన్నాయో సర్వే నెంబర్లతో సహా ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది.

ప్రతి సంవత్సరం సాగులో లేని భూమిని గుర్తించి ఈ పథకం నుండీ మినహాయించాలి. ఒక సీజన్ లో రైతు భరోసా పొంది కూడా సాగు చేయకుండా ఉంటే, ఆ భూములను క్రాప్ బుకింగ్ లేదా ఇతర మార్గాలలో గుర్తించి, తరువాతి సీజన్ లో ఆ భూములను మినహాయించాలి.

రైతు భరోసా పథకాన్ని వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న కుటుంబాలకు మాత్రమే పరిమితం చేయాలి. NRIలకు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పర్మినెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు, ఆదాయ పన్ను చెల్లింపు దారులకు, వివిధ స్థాయిలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు, టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు లాంటి ఇతర వృత్తులలో ఉన్నవారిని ఈ సహాయం నుండీ మినహాయించాలి. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ చెల్లింపులో పెట్టుకున్న ఇతర మినహాయింపులను కూడా దృష్టిలో ఉంచుకుని అమలు చేయాలి.

ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని అందించడానికి భూమి విషయంలో తగిన గరిష్ట పరిమితి విధించడం ద్వారా నిధులను చిన్న, మధ్య తరగతి రైతులకి కేటాయించవచ్చు. దీనికి వివిధ ప్రాతిపాదికలు పరిశీలించవచ్చు. రేషన్ కార్డు, ఇతర సంక్షేమ పథకాల అర్హత కొరకు 7.5 ఎకరాల భూమిని గరిష్ట పరిమితిగా తీసుకుంటారు కాబట్టి రైతు భరోసాకు కూడా అదే పరిమితిగా తీసుకోవచ్చు.

ఐదు ఎకరాల పైన ,పది ఎకరాల లోపు కమతాలు ఉన్నవారిని మధ్య తరగతి రైతులుగా పరిగణిస్తారు. ఈ క్యాటగిరీ క్రిందికి వచ్చే రైతులకు భూ కమతం ఎంత ఉన్నా, సంవత్సరానికి ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు పరిమితిగా పెట్టుకుని సహాయం అందించవచ్చు. ఏ ప్రాతిపాదిక తీసుకున్నా, దానిని మొత్తం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని వర్తింపజేయాలి. ఇక్కడ కుటుంబం అంటే భార్య, భర్త, మైనర్ పిల్లలు అనే యూనిట్ ను ప్రాతిపాదిక గా తీసుకోవాలి.

కౌలుకి తీసుకొని సాగు చేస్తున్న భూమిలో 2011 చట్టం ప్రకారం సాగుదారులను గుర్తించి, గుర్తింపు కార్డు పొందిన సాగుదారులకు, ఆ కార్డులో పేర్కొన్న భూమికి రైతు భరోసా సహాయం నేరుగా అందించాలి. రాష్ట్రంలో 36 శాతం ఉన్న కౌలు రైతులు ఈ పథకం అమలు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులను గుర్తించే ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం తీసుకోవాలి.

పై ప్రక్రియలు పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి, సీజన్ ప్రారంభం లోనే రైతు భరోసా పంపిణీ చేయాలనే సూత్రం పెట్టుకోకుండా జులై నెలలో రైతులకు చెల్లించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేసుకోవాలి.

వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి, కూలీలను గుర్తించడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు పొంది పనులలో చురుకుగా పాల్గొనడం, స్వంత భూమి 5 సెంట్ల కంటే ఎక్కువ ఉండకపోవడం అన్నది ప్రాతిపాదికగా తీసుకోవాలి. ఐదు సెంట్ల పైన, అర ఎకరం లోపు స్వంత భూమి ఉన్న వారిని కూడా ఈ వ్యవసాయ కూలీల క్యాటగిరి క్రింద గుర్తించి, సంవత్సరానికి 12,000 రూపాయలు కనీస మొత్తంగా చెల్లించాలి. అర ఎకరం నుండీ 1 ఎకరం లోపు ఉన్న వారికి కనీస మొత్తంగా 15,000 రూపాయలు రైతు భరోసా క్రింద చెల్లించాలి. రికార్డులలో ఇప్పటికీ వ్యవసాయ భూమిగా ఉండి , రియల్ ఎస్టేట్ క్రింద కు మారిపోయిన భూములను పూర్తిగా ఈ సహాయం నుండీ మినహాయించాలి. సన్నకారు రైతుల క్యాటగిరి లో ఎక్కువమంది పెరగడానికి ఇప్పటి వరకూ ఇదొక ముఖ్య కారణంగా ఉంది.

కౌలు రైతు గుర్తింపుకి చేపట్టవలసిన ప్రక్రియ :

కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తామని వెంటనే ప్రకటించి, ఆ చట్టం కింద గుర్తింపు కార్డుల (ఎల్.ఈ.సి.) కోసం దరఖాస్తు పెట్టుకోమని కౌలు రైతులందరినీ ప్రోత్సాహించాలి. అధికారులు కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సీజన్లో రైతు భరోసా ఇవ్వడానికి సమయం దగ్గిర పడుతున్నది కాబట్టి, జూన్ 10 నుండి జూన్ 20 లోపు ఈ చట్టం ప్రకారం దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించాలి. జనవరి నెలలో ప్రజాపాలన ప్రక్రియలో 2 లక్షల మంది కౌలు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా పరిగణనలో పెట్టుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ పై గ్రామ స్థాయిలో చాటింపులు, పోస్టర్లు, ప్రకటనలతో ప్రచారం చేయాలి. ఈ ప్రచారంలో భాగంగా 2011 చట్ట ప్రకారం భూ యజమానికి భూమి పై ఉన్న హక్కులకు ఎటువంటి భంగం కలగదని, కేవలం ఒక సంవత్సరం సాగు కోసం మాత్రమే ఇది గుర్తింపు అని ప్రకటించి, భూ యజమానుల భయాలను ప్రభుత్వమే నివృత్తి చేయాలి. దరఖాస్తు ఫారాలను గ్రామాలలోనూ, మీ సేవా కేంద్రాలలోనూ అందుబాటులో ఉంచాలి.

చట్టం ప్రకారం ఈ దరఖాస్తులో కౌలు రైతు వివరాలు, భూ యజమాని పేరు, కౌలు భూమి సర్వే నెంబరు, విస్తీర్ణం పేర్కొనాలి, భూ యజమాని సంతకం తప్పని సరి కాదు. భూమి సర్వే నెంబర్ కౌలు రైతుకు తెలియకపోతే, స్థానిక ప్రభుత్వ సిబ్బంది, లేదా మీ సేవ సిబ్బంది ధరణి ద్వారా కనుక్కొని వారికి తెలియజేయాలి. .

దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత జూన్ 25 వ తేదీ లోపు, ప్రతి గ్రామం నుండి వచ్చిన దరఖాస్తులను సమీకరించి, గుర్తింపు కోరుతున్న కౌలు రైతుల జాబితాను సదరు కౌలు భూమి వివరాలతో బాటు గ్రామ పంచాయితీ కార్యాలయం వంటి బహిరంగ స్థలాలలో ప్రదర్శించాలి.

జాబితాను విడుదల చేయడంతో బాటే ఈ దరఖాస్తుల పై గ్రామస్థాయిలో బహిరంగ విచారణ చేపడతామని ఆ గ్రామానికి ఒక తేదీని ప్రకటించి చాటింపు వేయాలి. బహిరంగ విచారణలు తాహశీల్దారు లేదా డిప్యూటీ తహశీల్దారు ఆధ్వర్యంలో జరగాలి. VRO వ్యవస్థ ప్రస్తుతం లేదు కాబట్టి స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బంది, పంచాయితీ శాఖ సిబ్బంది ఈ ప్రక్రియలో సహకరించాలి. ప్రతి మండలంలో రోజుకి 2-4 గ్రామాలలో ఈ విచారణ జరపవచ్చు కాబట్టి 10 రోజుల కాలెండర్ రూపొందించుకొని దీనిని అన్నీ మండలాలలోనూ పూర్తి చేయవచ్చు.

దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఫలానా భూమి కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారా లేదా అని నిర్ధారించడానికి నియమావళి క్రింది విధంగా ఉండాలి. సాధారణంగా గ్రామంలో ఎవరి భూమి ఎవరు సాగు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయంగానే ఉంటుంది అని సూత్ర ప్రాయంగా గుర్తించాలి.

సదరు కౌలు రైతు వివరాలు ప్రకటించినప్పుడు- ఆ రైతు సాగు చేస్తున్న విషయం ఆ భూమికి చుట్టు పక్క భూముల వారు సమర్థించడం ఒక ఆధారంగా స్వీకరించవచ్చు. ఆ రైతు సాగు చేస్తున్న విషయం ఆ గ్రామంలో ఇతరులు బహిరంగ విచారణలో చెప్పవచ్చు. సదరు భూ యజమాని అభ్యంతరం తెలిపితే దానిని విచారించి, కౌలు రైతు దరఖాస్తుని తిరస్కరించవచ్చు.

విచారణ సమయంలో భూమి యజమాని అందుబాటులో లేనప్పుడు, విచారణలో సదరు కౌలు రైతు దరఖాస్తుకు గ్రామస్తులు ఎవరైనా అభ్యంతరం తెలిపితే, సదరు భూ యజమానిని ప్రభుత్వ సిబ్బంది ప్రత్యక్షంగా, లేక ఫోన్ ద్వారా, లేదా ఇతర విధాలుగా సంప్రదించి విషయాన్ని నిర్ధారించుకోవాలి.

కౌలు రైతు సాగు చేస్తున్న విషయం స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బంది క్రాప్-బుకింగ్ సమయంలో నమోదు చేయడాన్ని కూడా ఆధారంగా స్వీకరించవచ్చు. పైన పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తాను పేర్కొన్న భూమిలో కౌలు సాగు చేస్తున్న విషయం లో అనుకూలంగా ఆధారాలు లభిస్తే, యజమాని నుండీ నిర్ధిష్టంగా అభ్యంతరాలు లేకపోతే , ఆ దరఖాస్తును అధికారులు ఆమోదించాలి.

పైన పేర్కొన్న విధంగా ఆమోదించిన దరఖాస్తుల ఆధారంగా మండల రెవెన్యూ అధికారి ఆయా దరఖాస్తుదారులకు “భూ అధీకృత సాగుదారులు”గా 2011 చట్టం ప్రకారం LEC గుర్తింపు కార్డును మంజూరు చేసి అందజేయాలి. గుర్తింపు కార్డు పొందిన సాగుదారుల జాబితాను సదరు భూమి వివరాలు, ఆధార్ నెంబర్ తో బాటు MRO కార్యాలయం నుండి జిల్లా, రాష్ట్ర వ్యవసాయశాఖకి, బ్యాంకులకి పంపించాలి. గుర్తింపు కార్డు మంజూరు చేసిన సాగుదారులందరినీ పంట బీమా, రైతు బీమాతో సహా ప్రభుత్వ పథకాలన్నింటికీ అర్హులు చేయాలి. ఆయా సర్వే నెంబర్లలో రైతు భరోసా లబ్ధిదారులుగా గుర్తించి వారి ఆధార్ లింకు అయిన బ్యాంకు అకౌంటుల లోకి రైతు భరోసా సొమ్ము జమ చేసే ఏర్పాటు చేయాలి. కౌలు రైతులకు పంట రుణాలు కూడా ఇచ్చే విధంగా బ్యాంకులను ఒప్పించాలి.

ఒకవేళ ఈ సంవత్సరం ఈ పని ప్రారంభం కాకపోతే, రాబోయే ఐదేళ్ళూ కానే కాదు.

Tags:    

Similar News