పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చిన డాక్టర్ అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. డబ్బు అక్రమార్జనే ధ్యేయంగా ఆమె వృత్తిని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు, దారుణాలు తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. విజయవాడకు చెందిన నమ్రత విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలలో 1995లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కర్నాటక జేజేఎం మెడికల్ కాలేజీలో గైనకాలజీలో ఎండీ చేశారు. ఆ తర్వాత ఫెర్టిలిటీ మెడిసిన్‌లో బెంగళూరు, ముంబై, సింగపూర్, జర్మనీ, ఎడిన్‌బర్గ్‌ల్లో శిక్షణ పొందారు. తన ఆరో ఏటనే డాక్టర్‌ను కావాలని కలగన్నానని, అది చిన్న వయసులోనే సాకారం చేసుకున్ననని తన వెబ్‌సైట్‌లో ఆమె గర్వంగా పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఆమె కన్న కల సక్రమార్జనకు కాకుండా అక్రమార్జన వైపు మళ్లడమే ఇప్పుడు ఆమె పరువు, ప్రతిష్ట మంటగలిసి పోవడానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదురాలిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ నమ్రత ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నా, అరెస్టయి జైలుకెళ్లి వచ్చినా, తన ఆస్పత్రుల లైసెన్సులు రద్దయినా బుద్ధి మార్చుకోలేదు. తగ్గేదే లే! అన్నట్టు నడచుకుంది. డాక్టర్‌లా కాకుండా ఓ లేడీ డాన్‌లా వ్యవహరించింది. మానవత్వం మరచి అక్రమార్జనే ధ్యేయంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించింది. తాజాగా సరోగసీ పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేసిన కేసులో సికింద్రాబాద్ గోపాల్‌పురం పోలీసులు అరెస్టు చేయడం, విశాఖలో దీని మూలాలు ఉండడంతో గతంలో ఆమె చేసిన దురాగతాలు, డబ్బు సంపాదనకు ఆమె ఎంచుకున్న వక్ర మార్గాలను పరికిస్తే ఔరా! అనిపిస్తుంది.
విశాఖలో నిర్మిస్తున్న ‘సృష్టి’ కొత్త భవనం
గ్రామీణ గర్భిణులే లక్ష్యంగా..
డాక్టర్ నమ్రత గ్రామీణ ప్రాంతంలో పేద గర్భిణులనే లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం కొంతమంది ఆశావర్కర్లను ఎంచుకుంది. నమ్మకస్తులైన ఏజెంట్లను నియమించుకుంది. ఆశా వర్కర్ల ద్వారా పేద గర్భిణుల వివరాలు సేకరించి ఉచితంగా ప్రసవం చేయిస్తామని విశాఖ సృష్టి ఆస్పత్రికి తరలించే వారు. డెలివరీ తర్వాత తల్లులకు కొంత మొత్తాన్ని ఇచ్చి పిల్లలు లేని ధనవంతుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఆ పసికందులను విక్రయించే వారు. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఈ చిన్నారులు పుట్టినట్టు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లను కూడా సృష్టించే వారు. అంతేకాదు.. సరోగసీ పేరుతో ఎవరికో పుట్టిన బిడ్డను వీరి బిడ్డగానే నమ్మించి రూ.లక్షలు వసూలు చేసేవారు. ఇలా ఒక్క విశాఖ సృష్టి ఆస్పత్రిలోనే ఏటా సగటున 50 వరకు శిశు జననాలు జరుగుతున్నాయని 2020లోనే పోలీసులు గుర్తించారు. ఏడాదికి సృష్టి ఐదు బ్రాంచిల్లో 200 పైగా చిన్నారుల అక్రమ రవాణా చేసినట్టు అనుమానిస్తున్నారు.
2020లో అరెస్టయిన నమ్రతకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
బిడ్డ చనిపోయిందని నమ్మించి..
ఇలా 2020 జనవరిలో ఉమ్మడి విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం పి.భీమవరానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మి చోడవరం పెద్దబజారులోని ఓ ఆస్పత్రికి పరీక్షల కోసం వచ్చింది. సృష్టి ఎండీ డాక్టర్ నమ్రత ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న నేమాల నూకరత్నం వెంకటలక్ష్మిని పరిచయం చేసుకుంది. తనతో వస్తే విశాఖ సృష్టి ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేయిస్తానని నమ్మించింది. దీంతో ఆమెను 2020 జనవరి 30న విశాఖలోని పద్మజ ఆస్పత్రిలో చేర్చగా ఆ మర్నాడు డెలివరీ చేశారు. ఆడపిల్ల పుట్టి, వెంటనే చనిపోయిందని తల్లికి చెప్పి ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేశారు. చాన్నాళ్లుగా తమ సంతానం కలగడం లేదని ఆధునిక వైద్య విధానంలో బిడ్డను పుట్టించాలని విజయనగరం దంపతులు 2019 ఫిబ్రవరిలో డాక్టర్ నమ్రతను కలిశారు. వారికి సరోగసీ ద్వారా పిల్లలు పుట్టించే ప్రక్రియ చేపడ్తామని, అందుకు రూ.13 లక్షలు ఖర్చవుతుందని చెప్పి వసూలు చేశారు. ఈ ప్రణాళిక అమలుకు వెంకటలక్ష్మిని తీసుకొచ్చి ఆమెకు పుట్టిన బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పారు. ఆ తర్వాత ఆ బిడ్డను విశాఖ మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఫిబ్రవరి 6న ఈ విజయనగరం దంపతులకు అప్పగించారు. అప్పట్లో సృష్టి ఆస్పత్రి సరోగసీ అక్రమాలపై మీడియాలో వచ్చిన కథనాలను చూసిన వెంకటలక్ష్మి అనుమానంతో విశాఖ ఎంవీపీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో బాధితురాలి రక్త నమూనాలు సేకరించి సృష్టి ఆస్పత్రిలోని నమూనాలతో సరిపోల్చారు. దీంతో సృష్టి నమ్రత, పద్మజ ఆస్పత్రి బండారం అంతా బయటపడింది. అప్పట్లో పద్మజ ఆస్పత్రి ఎండీ పద్మజతో పాటు ఏజెంట్ నూకరత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు.
నమ్రత చేతిలో మోసపోయామంటున్న తిరుపతి బాధితులు (ఫైల్)
2020 జులైలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన 34 ఏళ్ల సుందరమ్మ భర్త చనిపోయాడు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఈ సంగతిని తెలుసుకున్న అక్కడి ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణలు ‘సృష్టి’ ఏజెంట్ ఆర్జి రామకృష్ణకు చేరవేశారు. వీరు ముగ్గురూ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పుట్టిన శిశువును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు. ఆమె అంగీకరించడంతో విశాఖలోని యూనివర్సల్ సృష్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్చి 9న ఆస్పత్రిలో సుందరమ్మ మగబిడ్డను ప్రసవించడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు. ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు అమ్మేసింది.
బాగోతం ఇలా వెలుగులోకి..
సుందరమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్వాడీల నుంచి పౌష్టికాహారం పొందేది. అంగన్వాడీ టీచర్ సరోజిని ఆ మహిళ డెలివరీ విషయాన్ని తెలుసుకుని బిడ్డ గురించి ఆరా తీసింది. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి 2020 మార్చి 14న చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణలో ఆ బిడ్డను విక్రయించినట్టు తేలింది. మార్చి 20న ముఠా సభ్యుల నుంచి ఆ పసికందును వెనక్కి తీసుకువచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుసుకున్న నమ్రత కర్నాటక పరారయ్యారు. అక్కడ దేవణగిరిలో ఉన్న ఆమెను పోలీసులు అరెస్టు చేసి విశాఖ తీసుకొచ్చారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు మరో డాక్టర్, ఇద్దరు ఆశావర్కర్లు, సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను, శిశువును కొనుగోలు చేసిన ఇద్దరిని వెరసి 8 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతకు ముందు అంటే 2018లో డాక్టర్ నమ్రతపై పసి పిల్లల విక్రయించిన రెండు కేసులు న మోదయ్యాయి.
కేజీహెచ్‌లో నమ్రత హైడ్రామా..
2020 జులైలో పసికందుల అక్రమ రవాణా కేసులో విశాఖలో అరెస్టయిన డాక్టర్ నమ్రత.. కేజీహెచ్‌లో హైడ్రామా ‘సృష్టి’ంచారు. జైలుకు తరలించే ముందు ఆమెకు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తేల్చినా నమ్రత మాత్రం తనకు గుండె బరువెక్కిందని హడావుడి చేశారు. జైలుకు తీసుకెళ్లే వాహనం ఎక్కేందుకు ససేమిరా అన్నారు. వైద్యులతోనూ, పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగి కేజీహెచ్‌లోనే ఉంటానని హంగామా చేశారు. చివరకు మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా వాహనం ఎక్కించి సెంట్రల్ జైలుకు తరలించారు.
విజయవాడలోనూ అదే తీరు..
తొలుత తన సొంతూరు విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది డాక్టర్ నమ్రత. సరోగసీ, పిల్లల అక్రమ రవాణా కేసుల్లో దొరికిపోయింది. 2015లో విజయవాడ సృష్టి అక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు విచారణ జరిపి ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. 2018లో ఈ కౌన్సిల్ ఈ సృష్టి ఆస్పత్రి లైసెన్సును రద్దు చేసింది. అయినప్పటికీ వేరే వారి లైసెన్స్‌తో సృష్టి ఆస్పత్రిని నమ్రత నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లల అక్రమ విక్రయం, రవాణా కేసులో డాక్టర్ పచ్చిపాల నమ్రతను 2020 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. విజయవాడలో తనకు పరిస్థితి అనుకూలంగా లేదని భావించి పూర్తి స్థాయిలో విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో ఏర్పాటు చేసుకున్న యూనివర్సల్ సృష్టి సెంటర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టి దందాలను కొనసాగిస్తోంది.
రియల్ ఎస్టేట్‌లోనూ దందాలు..
సరోగసీ, శిశు అక్రమ విక్రయాలు, రవాణాలోనే కాదు.. డాక్టర్ నమ్రత రియల్ ఎస్టేట్‌లోనూ తన మోసాలను కొనసాగించింది. 2008లో తిరుపతికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లిఖార్జున్, వెంకటనర్సమ్మ దంపతులకు రెండెకరాల భూమిని విక్రయిస్తానంటూ రూ.27 లక్షలను అడ్వాన్సుగా తీసుకుంది. రిజిస్ట్రేషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అదనంగా మరో రూ.10 లక్షలు డిమాండ్ చేసిందని, దీనిపై ఆరా తీయగా 2008లోనే వేరొకరికి అమ్మేసిందని తెలిసిందని ఈ దంపతులు అప్పట్లో లబోదిబోమన్నారు. ఈమె మోసంపై హైదరాబాద్, విజయవాడ, చిక్‌బళ్లాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.