P4 రిజిస్ట్రేషన్ బహిష్కరణకు టీచర్ల పిలుపు
ఉపాధ్యాయుల మీద P4 బలవంతంగా రుద్దరాదంటున్న FAPTO;
By : V V S Krishna Kumar
Update: 2025-07-28 13:34 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన P4 పథకం లో టీచర్లు తప్పని సరిగా భాగస్వాములు కావాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తమని ధనవంతుల లిస్ట్ లో వేసి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోమనడం ఏమిటని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ప్రభుత్వం పై వత్తిడి తేవాలని భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO)P4 రిజిస్ట్రేషన్ల బహిష్కరణకు పిలుపునిచ్చింది.ఉపాధ్యాయులపై ప్రభుత్వం వత్తిడి తేవడం తగదంటూ ఫ్యాక్టో ఛైర్మన్ సాయి శ్రీనివాస్ , సెక్రటరీ జనరల్ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు.ఉపాధ్యాయులను నిర్భంధించాలని చూడటం దారుణమన్నారు.ప్రభుత్వ చర్యను ఖండిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయవలసిన అవసరం లేదని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పీ4 అనేది ఆర్ధికంగా శ్రీమంతులకు సంబంధించిన వ్యవహారమని ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆ గాడీలో కట్టడం దారుణమని విమర్శించారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం పీ4 పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆర్ధికంగా బాగా వున్నవారు, పారిశ్రామిక వేత్తలు పేదరికంలో వున్న బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని ప్రభుత్వం చెబుతోంది.