పెట్టుబడుల కోసం రేవంత్ విదేశీ టూర్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయి ?
అనేక ప్రయోజనాలను ఆలోచించి అంతా వర్కవుటవుతుందని అనుకున్నపుడు మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు.;
విదేశాల నుండి పెట్టుబడులను రాబట్టడం అంటే అంత ఈజీకాదు. పెట్టుబడిదారులు తాము పెట్టే పెట్టుబడులకు రిటర్న్స్ ఎలాగుంటాయి ? ప్రభుత్వాలు తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తాయి ? పన్ను మినహాయింపులతో పాటు అనేక ప్రయోజనాలను ఆలోచించి అంతా వర్కవుటవుతుందని అనుకున్నపుడు మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు. అంతేకాని ఒక ప్రధానమంత్రో లేకపోతే ముఖ్యమంత్రో విదేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలు లేదా పెట్టుబడిదారులతో సమవేశమైనంత మాత్రాన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పరుగెత్తుకుంటు మనదేశానికి వచ్చేయవు. ఇపుడు విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి(Revanth) విదేశీ పెట్టుబడుల(Foreign investments) కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. గడచిన 15 మాసాల్లో కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్లో పర్యటించారు. జపాన్ పర్యటన నుండి మంగళవారం అర్ధరాత్రే తెలంగాణకు చేరుకున్నారు.
పెట్టుబడుల కోస విదేశీప్రయాణాల కాన్సెప్టును చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) నుండి రేవంత్ నేర్చుకున్నట్లున్నారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పెట్టుబడుల కోసం విదేశీయానాలు చేసేవారు. ఏ దేశం వెళ్ళినా అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమై వేలకోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని విపరీతంగా ప్రచారం చేసుకునేవారు. ఆ తర్వాత వాస్తవంగా ఆ దేశాలనుండి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని మాత్రం చెప్పేవారుకాదు. ఇపుడు రేవంత్ కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళుతున్నారు. తాజాగా ఏడురోజుల జపాన్(Japan Tour) పర్యటన ముగించుకున్నారు. ఏడురోజుల పర్యటనలో రేవంత్ అనేకమంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తాజా పర్యటనలో రు. 12062 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి జపాన్లోని మారుబేని, హిరోషిమా, సోని లాంటి బడా పారిశ్రామికవేత్తలతో రేవంత్ భేటీ అయ్యారు.
పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ(Telangana) విధంగా సరైన రాష్ట్రం, తెలంగాణలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అందించబోయే ప్రోత్సాహకాలు, రోడ్డు, రైల్, ఎయిర్ కనెక్టివిటీ సౌకర్యాలను రేవంత్ వివరించారు. పారిశ్రామికప్రగతిలో తెలంగాణ సాధించిన, సాధిస్తున్న మైలురాళ్ళను కూడా వివరించారు. రేవంత్ ఎంతచెప్పినా పెట్టుబడిదారులు కదా ఎంతోమంది పాలకులను చూసుంటారు. అందుకనే ఒకసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని కొందరు పారిశ్రామిక దిగ్గజాలు బదులిచ్చారు. రేవంత్ మానసపుత్రిక ఫోర్త్ సిటిలో మారుబేని పెట్టబోతున్న రు. 5 వేల కోట్ల పెట్టుబడులు గొప్ప విషయంగానే చూడాలి. ఇదేవిషయమై హిరోషిమా యాజమాన్యం మాట్లాడుతు వ్యర్ధాల నుండ ఇంధనం లాంటి క్లాన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్ధాల ప్రాసెసింగ్, మురుగునీటిశుద్ధి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, హిరోషిమా-తెలంగాణ ఆటోమేటివ్ అండ్ మొబిలిటి కారిడార్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ 2024 ఆగస్టులో అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించారు. అప్పటి పర్యటనల్లో పై రెండు దేశాల్లోని పారిశ్రామికవేత్తలు సుమారు రు. 36 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికా పర్యటనలో పారిశ్రామికవేత్తలతో రు. 31,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే దక్షిణకొరియా పర్యటనలో మరో రు. 4,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. కొరియా పర్యటనలో ప్రధానంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఇంధనస్టోరేజి, కాస్మొటిక్స్, టెక్స్ టైల్ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయించాలని రేవంత్ బాగా ఉత్సాహం చూపించారు. డాంగ్ బాంగ్ ఫార్మా కంపెనీ రు. 200 కోట్లు, ఎల్జీ, శామ్సంగ్, యూయూఫార్మా, జీఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు.
కొరియా పర్యటనలోనే సియోల్ లో ‘చంగ్ యే చున్’ నది పునరుజ్జీవనం జరిగిన విధానంపై రేవంత్ బాగా దృష్టిపెట్టారు. అదేపద్దతిలో మూసీ నది ప్రక్షాళన చేసి మురికికూపంగా తయారైన మూసీనదిని మంచినీటి నదిగానే కాకుండా ప్రముఖమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటి భాగస్వామ్యంతో తెలంగాణ స్పార్ట్స్ యూనివర్సిటి ఏర్పాటుకు రేవంత్ చర్యలు తీసుకున్నారు. పెట్టుబడుల కోసం విదేశీప్రయాణాలపై పరిశ్రమల శాఖ, ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) చెప్పిన ప్రకారం విదేశీ పెట్టుబడుల కోసం రేవంత్ పర్యటనలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పటివరకు సుమారు లక్ష కోట్లరూపాయలు విదేశీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు.
సింగపూర్, అమెరికా, కొరియా, దావోస్ దేశాల పర్యటనల్లో సుమారు లక్ష కోట్లరూపాయల విలువైన ఒప్పందాలు జరిగినట్లు మంత్రి చెప్పారు. అమెరికా, కొరియా, దావోస్ లోనే రు. 81,564 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగితే తాజా జపాన్ పర్యటనలో మరో రు. 12 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సుమారు 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపినట్లు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుచేయబోయే కంపెనీలకు భూమి, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైలు, రోడ్డు, ఎయిర్ కనెక్టివిటి ఉండటం తెలంగాణకు బాగా కలిసొచ్చే అంశంగా దుద్దిళ్ళ అభిప్రాయపడ్డారు.
అయితే ఇక్కడ ఒకచిన్న మెలికుంది. అదేమిటంటే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించి, ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన కంపెనీలు తెలంగాణకు వచ్చేస్తాయని అనుకునేందులేదు. ఆసక్తిచూపించి, ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలంటే అందకు ఫాలో అప్ అన్నది చాలా చాలా అవసరం. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్, ఐటి లాంటి శాఖల ఉన్నతాధికారుల కమిటి రెగ్యులర్ గా ఒప్పందాలు చేసుకున్న కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతుంటేనే పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలున్నాయి. అలాకాకపోతే పారిశ్రామికవేత్తల ఆసక్తులు, ఒప్పందాలన్నీ మీడియాలో వార్తలవరకు మాత్రమే పనికొస్తుంది.