శ్రీకాకుళం.. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు ఎలా మళ్లిందీ

1967లో గిరిజనులకు జరిగిన అవమానంతో గన్నులు పట్టి పోరాడిన శ్రీకాకులం ఆ తర్వాత గన్ను విడిచి బ్యాలెట్ వైపు సాగింది. ఆ ప్రయాణంలో ఎలా జరిగిందంటే..

Update: 2024-04-26 02:00 GMT

1967 అక్టోబర్ 31న శ్రీకాకుళం జిల్లా మొండెంకల్ గ్రామం.. గిరిజనులు తండోపతండాలుగా వస్తున్నారు. ఓ పక్క పుచ్చలపల్లి సుందరయ్య కప్పగంతుల సుబ్బారావు లాంటి ఎందరో పోరాట యోధులు.. మరోపక్క గుమ్మ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భూస్వాములు. సభను భగ్నం చేయాలన్నది భూస్వాముల యత్నం. సభ నిర్వహించాలన్నది గిరిజనుల పంతం. గిరిజనులను భూ స్వాములు అడ్డుకున్నారు.. ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కొట్లాటైంది. కొట్లాట కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో కోరన్న, మంగన్న అనే గిరిజనులు చనిపోయారు. దీంతో గిరిజనుల్లో కసి పెరిగింది. విప్లవ కమ్యూనిస్టులు అందిపుచ్చుకున్నారు. శ్రీకాకుళం ఎగిసింది, పిడికిళ్లు బిగించింది.

భూస్వాములు, షావుకార్లు టార్గెట్ అయ్యారు. భూస్వాములను దోచి గిరిజనులకు పంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలప్రయోగానికి దిగాయి. పోలీసుల్ని ప్రయోగించాయి. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశాయి. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అజ్ఞాతానికి వెళ్లారు. 1967 నుంచి 1970 వరకు వందలాదిగా వరుస సంఘటనలు జరిగాయి. భూస్వాములు హత్యలతో పాటు పోలీసు, సిఆర్పిఎఫ్ గాలింపు చర్యలు, ఎన్కౌంటర్లు యథేచ్ఛగా సాగాయి.

మరోపక్క సీపీఐ నుంచి చీలిన మార్క్సిస్ట్ పార్టీలో అప్పుడప్పుడే సిద్ధాంత వైరుధ్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. నక్సలైట్ ఉద్యమం పురుడుపోసుకుంటోంది. పశ్చిమ బెంగాల్ నక్సల్బరీలో ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆ ప్రభావం ఇటు శ్రీకాకుళం వరకు పాకింది. చారు మజుందార్, కాను సన్యాల్, నాగభూషణ్ పట్నాయక్ వంటి ఎందరో ఈ ఉద్యమాన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తూ వచ్చారు.

 

చివరకు 1970 జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం కురుపాం సమీపంలోని కొండల్లో పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నక్సలైట్ల ఏరివేతకు పిలుపిస్తే ఎన్నికల బహిష్కరణ సహా శ్రీకాకుళం అష్టదిగ్బంధానికి నక్సలైట్లు పిలుపిచ్చారు. 1970ల నాటికి ఈ ఉద్యమాన్ని పోలీసులు పూర్తిగా అణిచివేశారు. తుపాకీ గొట్టాల మాట వినపడకుండా చేశారు.

అయితే శ్రీకాకుళం గిరిజన పోరాటం గోచీ కట్టుకున్న గిరిజనులను పోరాటయోధులుగా మార్చింది. వేలాది ఎకరాల భూములు గిరిజనులకు దక్కేలా చేసింది. అటవీ శాఖ అధికారుల వేధింపులకు ఆగడాలకు తావు లేకుండా చేసింది. భూస్వాములకు ఊడిగం చేసే వెట్టి చాకిరి నుంచి విముక్తి అందించింది. గిరిజన విద్య, వసతి, రోడ్లు వంటి అనేక విజయాలకు ఈ పోరాటం స్ఫూర్తినిచ్చింది. గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చేసింది. దశాబ్ద కాలానికి పైగా చరిత్ర ఉన్న శ్రీకాకుళ గిరిజన రైతాంగ విప్లవ పోరాటాన్ని చితాభస్మం నుంచి రెక్క విప్పిన విప్లవ విహంగంగా పోలుస్తుంటారు విప్లవ రచయితలు. సత్యం చావడు సత్యం చావదు అనేది ఆనాటి నినాదం. అందుకు తగ్గట్టుగానే ఆ పోరాటం సాగింది.

అంతటి వీరోచిత చరిత్ర ఉన్న శ్రీకాకుళం.. తుపాకుల మోత నుంచి రక్తమోడిన అడవుల నుంచి తేరుకుని బ్యాలెట్ వైపు సాగింది. శ్రీకాకుళం గిరిజన పోరాటం సాగుతున్న తరుణంలో ఓట్లు, బ్యాలెట్లు అంటేనే భయపడిన అధికారులు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులతో తిరగడం గమనార్హం. శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన చౌదరీ తేజేశ్వరరావు ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన 1952లోనే శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటయింది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి. శ్రీకాకుళం బీసీ పార్లమెంట్ స్థానంగా ఉండగా అందులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా బీసీ అసెంబ్లీ స్థానాలే కావడం గమనార్హం.

Tags:    

Similar News