రాజీనామాతో హీరో అయిన జీవీ రెడ్డి
ఇంతకు ఎవరీ జీవీ రెడ్డి.;
రాష్ట్ర రాజకీయాల్లో జీవీ రెడ్డి ఒక్కసారిగా హీరో అయ్యారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం, టీడీపీలో కీలక పదవుల్లో పనిచేసి పార్టీకి దూరం కావడం చర్చగా మారింది. జీవీ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏమిటి? తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నట్లుండి ఎందుకు వైదొలిగారు. అసలు టీడీపీలోకి ఎలా వచ్చారు. ఎందుకు నిష్క్రమించారు. ముందు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు. ఆయన రాజకీయ, జీవిత ప్రస్థానం ఏమిటి తెలుసుకుందాం..
మాట తీరు, చురుకు తనం రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి..
సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టారు జీవీ రెడ్డి. (గొలమారి వెంకటరెడ్డి) రాజకీయాలపై ఆసక్తితో అడుగులు వేశారు. పదేళ్లకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం మీడియా అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆ తరువాత 2018తో వైఎస్సార్సీపీలో చేరారు. అక్కడ కూడా అధికార ప్రతినిధిగా చేశారు. అనంతరం లోకేష్ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో ఆయనను కలిసి లోకేష్ దృష్టిలో పడ్డారు. 2022 అక్టోబర్ లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరినీ వ్యక్తిగతంగా కలిసి వారితో పరిచయాలు పెంచుకున్నారు. లోకేష్ తో ఉన్న పరిచయం ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి వచ్చేలా చేసింది.
కుటుంబ నేపథ్యం..
మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం బొడిచెర్ల స్వగ్రామం. తర్లుపాడులోని లూథరన్ హైస్కూలులో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత గుంటూరు-చిలకలూరిపేట మధ్యలో ఉన్న శిద్దార్థ కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. సీఏ చెన్నైలో పూర్తి చేశారు. ఎంకాం నాగార్జున యూనిర్సిటీలో కరస్పాండెంట్ కోర్స్ పూర్తి చేశారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనిర్సిటీలో న్యాయవాద పట్టా పొందారు. చార్టెడ్ అకౌంటెంట్ గా హైదరాబాద్ లో జీవితం ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగారు. పేరున్న సంస్థలకు ఆడిటర్ గా పనిచేస్తున్నారు. తమ్ముడు శ్రీనివాసరెడ్డి మార్కాపురంలో ఉంటారు. ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్. మార్కాపురం నుంచి ఆడిట్ వ్యవహారాలు చూస్తూ అన్నకు తోడుగా ఉంటున్నారు.
తల్లిదండ్రులు తమ్ముడైన శ్రీనివాసరెడ్డి వద్ద మార్కాపురంలో ఉంటారు. తండ్రి గొలమారి నారాయణరెడ్డి ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం చేశారు. పిల్లలు స్థిరపడటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి చిన్న కొడుకు శ్రీనివాసరెడ్డి వద్ద ఉంటున్నారు. తల్లిదండ్రులు కానీ, తమ్ముడు శ్రీనివాసరెడ్డి కానీ రాజకీయంగా బయటకు వచ్చిన ధాఖలాలు లేవు.
జీవీ రెడ్డి కూడా మార్కాపురం బేస్ గా రాజకీయాలు చేయలేదు. నేరుగా పార్టీ పెద్దల సహకారంతో పార్టీలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టి ఫైబర్ నెట్ చైర్మన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలోని పెద్దలందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రస్తుతం జీవీ రెడ్డి వయసు 42 సంవత్సరాలు. కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటోంది.
ప్రెస్ మీట్ పెడితే సంచలనమే..
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టారంటే అన్ని ఆధారాలతో మీడియా ముందు మాట్లాడతారు. వైఎస్సార్సీపీ తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టిన సందర్భాల్లో మీడియాతో మాట్లాడిన సందర్భాల్లో శభాష్ అనిపించుకున్నారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సమయంలో పార్టీ పెద్దలతో కలిసి ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జ్ ల్లో ఒకరుగా ఉన్నారు. అన్ని వివరాలతో మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీని నీళ్లు నమిలించే వారు. దీంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు.
లోకేష్ ఆశీస్సులతోనే ప్రభుత్వ పదవి
మంత్రి లోకేష్ ఆశీస్సులతో ప్రభుత్వంలో పదవిని దక్కించుకో గలిగారు. పదవీ ప్రమాణ స్వీకారం రోజునే గతంలో ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతంరెడ్డి, మరికొందరు నాయకులపైన కేసులు నేమోదు చేస్తామని ప్రకటించారు. ఫైబర్ నెట్ సంస్థలో ఎంతో అవినీతి జరిగిందని, దానిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2025 జనవరిలో ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డి సంస్థ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. గత ప్రభుత్వంలో ఎందుకు నష్టాలు వచ్చాయి. బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి. విజిలెన్స్ విచారణ ఏమి చెప్పింది. ఇందుకు బాధ్యులు ఎవరు అని ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు.
మూడు నెలలుగా ఎండీ చైర్మన్ మధ్య అగాధం
మూడు నెలల నుంచి ఎండీ కె దినేష్ కుమార్ తాను చెప్పినవి ఏవీ పట్టించుకోవడం లేదని, తన ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేకయడంతో పాటు అవినీతి పరులకు సహకరిస్తూ వారికి లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఈ ఆరోపణలతో పాటు ఐఏఎస్ దినేష్ కుమార్ చేస్తున్న వన్నీ రాజద్రోహం నేరం కిందరకు వస్తాయని పేర్కొనడంతో ఐఏఎస్ ల్లో సంచలనానికి దారి తీసింది. ఐఏఎస్ ల సంఘం స్పందించి ముఖ్యమంత్రికి జీవీ రెడ్డిపై ఫిర్యాదు చేసింది.
సీఎం ఆదేశాలతో రాజీనామా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డితో మాట్లాడారు. తమ దృష్టికి సమస్యలు తీసుకు రాకుండా నేరుగా మీడియా ముందు చెప్పటాన్ని తప్పు పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. పదవిని వదిలేయాలని సీఎం ఆదేశించడంతో ఆగ్రహించిన జీవీ రెడ్డి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.
జనం దృష్టిలో జీవీ రెడ్డి హీరో
ప్రజల దృష్టిలో జీవీ రెడ్డి హీరోగా మారారు. తెలుగుదేశం లోని యువతలోనూ అభిమానించే వారు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా సైతం తెలుగుదేశం పార్టీ జీవీ రెడ్డి విషయంలో తప్పు చేసిందని, మంచి నాయకుడిని దూరం చేసుకుందని పోస్టులు వచ్చాయి. ప్రజలు కూడా జీవీ రెడ్డి నిజాయితీగా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.