మద్యం తాగితే ఎలా పసిగడతారు?.. టీటీడీ ఈఓ ధర్మసందేహం!

బ్రీతింగ్ ఎనలైజింగ్ టెస్టు చేసుకున్న తిరుపతి ఎస్పీ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-21 10:05 GMT
బ్రీతింగ్ ఎనలైజ్ టెస్టు చేస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, సీవీఎస్ఓకే.వి. మురళీకృష్ణ

ఒక వ్యక్తి మద్యం తాగాడు అనుకోండి. బ్రీతింగ్ అనలైజర్ ( Breathing analyzer ) టెస్టింగ్ ద్వారా ఎలా పసిగడతారు? ఇదీ టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ధర్మసందేహం. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యంత్రం ఎలా పనిచేస్తుందనేది వివరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు బ్రీతింగ్ అనలైజర్ టెస్టింగ్ పరికరంలో శ్వాస ఊదడం ద్వారా ఆల్కహాల్ ఎంత మోతాదులో తీసుకున్నాడనేది ఎలా తెలుస్తుందనేది వివరించారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల భద్రతకు టీటీడీ తిరుపతి పోలీసులకు సహకారం అందించింది. తిరుమల ఘాట్ రోడ్డులో మద్యం సేవించి ప్రయాణం, వాహనాలు నడపకుండా కట్టడి చేయడానికి 20 బ్రీతింగ్ ఎనలైజర్ పరికరాలను టీటీడీ ఆదివారం తిరుపతి పోలీసులకు అందించిన సందర్భంలో జరిగిన సంభాషణ ఇది.


పరికరం ఇలా పనిచేస్తుంది.
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు నడిపే వారికి పోలీసులు బ్రీతింగ్ ఎనలైజర్ టెస్టులు చేయడం మరింత ముమ్మరం చేశారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కుమార్ నుంచి పోలీసులు బ్రీతింగ్ ఎనలైజర్ పరికరాలు అందుకున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్ట్రా నోటిలో ఉంచుకుని ఊదడం ద్వారా ఆ పరికరం పనిచేసే విధానాన్ని వివరించారు.
"నేను మద్యం తీసుకోలేదు. అందువల్లే, పరికరంలో గ్రీన్ బల్బు వెలగలేదు" అని ఎస్పీ సుబ్బారాయుడు ప్రయోగాత్మకంగా వివరించారు.
"బ్రీత్ ఎనలైజర్ పరికరంలో రెండు భాగాలు ఉంటాయి. ఓ భాగంలో పొటాషియం డైక్రోమేట్ ( ద్రవం ఎరుపు, నారింజ కలర్ లో ఉంటుంది). మరో భాగంలో రసాయనాలు ఉంటాయనేది హెల్త్ లైన్ వెబ్ సైట్ ద్వారా తెలిసింది. ఈ రెండు భాగాలు ఒక మీటరుకు అనుసంధానమై ఉంటాయి.
ట్రాఫిక్ పోలీసులు బైక్ నడిపే వారినే కాకుండా, ఇతర వాహనాలు నడిపే వారితో బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేయడానికి ఆ పరికరం లోపలి నుంచి పైకి ఉన్న స్ట్రా (Straw) నోటిలో ఉంచుకుని ఊదగానే ఈ గాలి శ్వాసకు పరికరంలోని పొటాషియం డ్రైక్రోమేట్ రంగు ఆకుపచ్చ బల్బు వెలుగుతుంది. ఎక్కువ శాతం ఆల్కమాల్ ఉంటే రంగు మారుతుంది. దీనిని ఫోటో సెల్ అనే సెన్సార్ కొలవడం ద్వారా స్క్రీన్ పై ఎంతమోతాదులో మద్యం సేవించారనేది చూపుతుంది" అని పోలీసు అధికారులు వివరించారు.

యాత్రికుల భద్రత కోసమే..
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ సివిఎస్వో కేవి. మురళీకృష్ణ తో కలిసి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన బ్రీతింగ్ ఎనలైజర్ పరికరాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ యాత్రికుల భద్రత కోసం ఈ పరికరాలు పోలీసు శాఖకు టీటీడీ ద్వారా అందించినట్లు చెప్పారు.

"ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల భద్రతకు టిటిడి చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.8లక్షల విలువైన 20 బ్రెత్ ఎనలైజర్లు జిల్లా ఎస్పీ కి అందించాం" అని చెప్పారు. భద్రత కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామనీ, పోలీస్ శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల వాడకంపై కల్పించిన అవగాహనకు ఆశించిన స్పందన లభిస్తోందన్నారు. ప్రమాదాల నివారణ కోసం మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామన్నారు.
" టీటీడీ అందించిన బ్రీతింగ్ ఎనలైజర్లతో తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఈ యంత్రాల్లో అలిపిరి టోల్ గేట్ తనిఖీ కేంద్రం వద్ద నాలుగు, తిరుపతి జీఎన్సీ టోల్ గేటు వద్ద మరో నాలుగు, మిగతా 16 బ్రీతింగ్ ఎనలైజర్ పరికరాలు తిరుపతిలో వినియోగిస్తాం" అని ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. నగరంలోని రహదారుల్లో ఆకస్మిక తనిఖీలు సాగిస్తామని చెప్పారు. మద్యం తాగి వాహనం నడిపితే, శిక్షలు కూడా ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
Tags:    

Similar News