విజయవాడ ఆస్పత్రిలో యువతి ఎలా చనిపోయింది?
విజయవాడలో పేరున్న ఆర్థోఫెడిక్ వైద్యశాల. అక్కడికి వైద్యం కోసం వెళ్లిన ఒక యువతి ఇంజక్షన్ వికటించి చనిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? కారణాలు ఏమిటి?
ఆ యువతి జీవితంపై ఆశలతో ఎన్నో కలలు కన్నది. బాగా చదువుకుని ఇంజనీర్ కావాలనుకున్న కలలు మట్టిలో కలిశాయి. ఇందుకు ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులు కావడం మరీ దారుణం. 18 సంవత్సరాల యువతి విజయవాడలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమె పేరు పి రిఖిత. విజయవాడ గాంధీనగర్ నివాసి. పుట్టుకతో కాళ్లు వంకర్లు వచ్చాయి. వీటిని సవరించేందుకు 2019లో ఒక ప్రైవేట్ వైద్యశాలలో ప్లేట్స్ వేశారు. అప్పట్లో సర్జరీ చేసి ప్లేట్స్ అమర్చడం వల్ల వాటిని తీసి వేసేందుకు విజయవాడ నగరంలోని ఎంజె నాయుడు ఆస్పత్రికి వచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఏమి జరిగింది?
ఆస్పత్రికి వచ్చిన తరువాత ఆపరేషన్ చేసి ప్లేట్లు తొలగించేందుకు నిర్ణయించారు. ఆపరేషన్ చేసేందుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు మందు వికటించింది. ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే నోటి నుంచి నురగలు రావడంతో ఐసీయూకు తరలించారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. శుక్రవారం ఉదయం పల్మనరీ ఎడిమాతో సడన్ గా బీపీ తగ్గి కొద్ది సేపటి తరువాత చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో విషాదం నెలకొంది. బంధువులు బోరున విలపించారు. ఇంత నిర్లక్ష్యంగా వైద్యులు ఎందుకు ప్రవర్తించారనే విషయం ఎవ్వరికీ అంతుపట్టకుండా ఉంది. నిపుణులైన డాక్టర్ ఎంజె నాయుడు, ఆయన కుమారుడు ఎముకల డాక్టర్లు. ఎన్నో సంవత్సరాల క్రితం ఆస్పత్రి నిర్మించారు. ఆస్పత్రికి కూడా మంచి పేరు ఉంది. అయితే వారు కూడా ప్రస్తుతం కమర్శియల్ వైద్యులుగా మారిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది.
ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
రిఖిత (18) చనిపోవడంతో బంధువులు ఎంజె నాయుడు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆరు గంటలపాటు ఆస్పత్రి ఎదుట బంధువులు ధర్నా చేశారు. మాకు న్యాయం కావాలని, మా పాప చావుకు కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. వీరి ఆందోళనతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రిఖిత మేనత్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైద్యులు బంధువులతో మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. డాక్టర్ ఎంజె నాయుడు, ఆయన కుమారుడు డాక్టర్ రవితేజ, అనస్థీషియా వైద్యుడిపై కేసు నమోదైంది.
స్పందించిన వైద్య శాఖ
ఎంజె నాయుడు ఆస్పత్రిలో యువతి చనిపోయిన విషయంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ముగ్గురు వైద్యులతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆస్పత్రికి చేరుకుని ప్రాథమిక విచారణ చేశారు. రోగికి అందిన చికిత్స వివరాలు తెలుసుకున్నారు. వైద్యశాలలో ఉన్న వైద్య పరికరాలు పరిశీలించారు. వైద్యులు నిర్వహించిన రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన ఆర్థోఫెడిక్ ఫ్రొఫెసర్ డాక్టర్ శ్యాంకుమార్, అనస్థీషియా ఫ్రొఫెసర్ డాక్టర్ సొంగా వినయ్ కుమార్, జనరల్ మెడిసిన్ ఫ్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావులు యువతి చనిపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను వైద్య శాఖ కార్యదర్శికి పంపించినట్లు సమాచారం. అనస్ఠీషియా ఇవ్వడంలో నిర్లక్ష్యం కారణంగా నడుము భాగం నుంచి కాళ్ల వరకు మత్తు రావాల్సింది పోయి మెదడుకు మత్తు ఎక్కినట్లు గుర్తించారు. దీని కారణంగానే యువతి నరాలు దెబ్బతిని ఫిట్స్ రావడం జరిగిందని వారు భావిస్తున్నారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?
పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఉత్కంఠగా మారింది. వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి రిపోర్టును సూర్యారావుపేట పోలీసులకు అందించారు. నివేదికలో ఏముందనే విషయాన్ని చెప్పేందుకు పోలీసులు సుముఖత చూపలేదు. పోస్టుమార్టం నివేదిక కోర్టులో అందజేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చి విచారణ జరిపిన ముగ్గురు వైద్యులు చెబుతున్న ప్రకారం అనస్థీషియా ఇవ్వడంలో జరిగిన లోపం వల్లనే యువతి చనిపోయిందని నిర్థారించారు.
నిర్లక్ష్యంగా పోలీసులు
ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. చనిపోయిన యువతి తల్లిదండ్రులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్ డి రామకృష్ణను కలిసి తమకు తగిన న్యాయం చేయాలని, నిందితులను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళితే రూ. 5వేలు అవుట్
ఎవరైనా జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే మినిమం రూ. 5వేలు ఖర్చు పెట్టాల్సిందే. జ్వరం ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు పరీక్షలు చేయిస్తారు. ఇందుకు మూడు వేలు అవుతుంది. మందుల కొనుగోలుకు రూ. 2వేలు అవుతుంది. మొత్తం ఐదువేలు లేనిది ఆస్పత్రికి వెళ్లి రాలేరు. విజయవాడలో ఆస్పత్రులు ఆవురావురంటున్నాయి. ఎవరైనా రోగి ఆస్పత్రికి వెళ్లారంటే పీక్కుతింటున్నారు. శరీరంలో చిన్న గడ్డలు ఉంటే కాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం ఉందని పరీక్షలకు రాస్తున్నారు. హెచ్సిజీ పెట్ సిటీస్కాన్ ఇమేజింగ్ సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోని రావాల్సిందిగా రాస్తారు. అక్కడ పది నుంచి 15వేల వరకు వసూలు చేస్తారు. ఇలా ప్రతి విషయంలోనూ దోపిడీ ఎక్కువైంది. ప్రాణాలను కూడా పట్టించుకోవడం లేదు. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడంలోనూ వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.